లోకల్‌ నంబర్లతోనే పాక్‌ ‘హనీ’ స్కెచ్‌.! | Shocking facts from the Operation Firewall 2026 investigation | Sakshi
Sakshi News home page

లోకల్‌ నంబర్లతోనే పాక్‌ ‘హనీ’ స్కెచ్‌.!

Oct 11 2026 5:36 AM | Updated on Oct 11 2026 5:36 AM

Shocking facts from the Operation Firewall 2026 investigation

ఆపరేషన్‌ ఫైర్‌వాల్‌– 2026 దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు 

హ్యాండ్లర్ల చేతికి క్లాసిఫైడ్‌ డాక్‌యార్డ్‌ ఫోటోలు చిక్కినట్లు అనుమానాలు

సాక్షి, విశాఖపట్నం: దేశ భద్రతకు అత్యంత కీలకమైన విశాఖపట్నం నేవల్‌ బేస్‌ కేంద్రంగా జరిగిన హనీట్రాప్‌ వ్యవహారంలో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్స్‌ (పీఐవో) అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ గూఢచర్యానికి పాల్పడినట్లు ఆపరేషన్‌ ఫైర్‌వాల్‌–2026 దర్యాప్తులో తేలింది. విదేశీ నంబర్ల ద్వారా వల విసిరితే ఇంటెలిజెన్స్‌ అధికారులు సులభంగా గుర్తిస్తారని భావించిన పాక్‌ ఏజెంట్లు, భారతీయ సిమ్‌ కార్డులను ఉపయోగించి వాట్సాప్‌  ఖాతాలను యాక్టివేట్‌ చేసినట్లు తెలుస్తోంది.

తాము నిజంగా స్థానిక యువతులతోనే మాట్లాడుతున్నామని భ్రమపడిన సెయిలర్‌ ప్రదీప్‌ ముఖర్జీ, సివిలియన్‌ డ్రైవర్‌ సాయివరప్రసాద్‌ సులభంగా ఈ హనీట్రాప్‌లో చిక్కుకున్నారు. వీరి ద్వారా మరికొన్ని సిమ్‌ కార్డులు కొనుగోలు చేసి వినియోగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హ్యాండ్లర్ల  (తెరవెనుక ఉండి మొత్తం నెట్‌వర్క్‌ను లేదా వ్యూహాన్ని నడిపించే ప్రధాన సూత్రధారులు) చేతికి కీలక సమాచారం, ఫోటోలు చేరినట్లు తెలుస్తోంది. తదుపరి విచారణ నిమిత్తం నిందితుల కస్టడీని కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నారని, ఈ కస్టడీ విచారణ ద్వారా హవాలా నెట్‌వర్క్, ఇతర వ్యక్తుల పాత్రను బహిర్గతం చేసే అవకాశాలున్నాయని సమాచారం.  

కీలక రహస్యాలు లీక్‌.! 
నిందితుడు ముఖర్జీ.. పాక్‌ మహిళా ఆపరేటివ్‌లకు  దేశ రక్షణకు సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారాన్ని చేరవేసినట్లు బలమైన ఆధారాలు లభించినట్లు దర్యాప్తు వర్గాల సమాచారం. విశాఖపట్నంలోని అత్యంత కీలకమైన నేవల్‌ డాక్‌యార్డుకి చెందిన అంతర్గత ఫోటోలను నిందితుడు సేకరించి  షేర్‌ చేసినట్లు తెలుస్తోంది. న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌లు, యుద్ధ నౌకల కదలికలు, వాటి మోహరింపు షెడ్యూళ్లను రాబట్టడమే ప్రధాన లక్ష్యంగా పాక్‌ ఏజెంట్లు ఈ ఆపరేషన్‌ నడిపినట్లు కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. 

ఇక నేవల్‌ ఆఫీసర్ల వద్ద సివిలియన్‌ కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా పనిచేసిన అన్నం సాయివరప్రసాద్‌  నేవల్‌ బేస్‌ పరిసరాల్లో ఎవరెవరిని కలిశాడు? ఏఏ వాహనాల్లో తిరిగాడు? విశాఖపట్నం తూర్పు నౌకాదళం(ఈఎన్‌సీ) లోపలికి వెళ్లేందుకు కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ, నిందితులు మొబైల్‌ ఫోన్లను లోపలికి ఎలా తీసుకెళ్లగలిగారు? వంటి అంశాలను నిర్ధారించేందుకు కీలకమైన సీసీటీవీ ఫుటేజీలను, రికార్డులను  విచారణ అధికారులు విశ్లేషిస్తున్నారు. తద్వారా దేశద్రోహానికి సహకరించిన ఇతర వ్యక్తుల వివరాలను ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు. ఆయా అంశాల ప్రాతిపదికన సోమవారం మరికొంతమందిని విచారించే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.      

అంతర్రాష్ట్ర హవాలా లింకులపై పలు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు 
ఇక హనీట్రాప్‌ మాడ్యూల్‌ మూలాలు కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదని ప్రాథమిక విచారణలోనే వెల్లడయినట్లు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ముఖర్జీని అరెస్టు చేసిన తమిళనాడులోని కోయంబత్తూరుతో పాటు, అతని స్వస్థలం పశ్చిమ బెంగాల్, అదేవిధంగా.. నిందితులకు హవాలా లింకులు ఉన్నాయని అనుమానిస్తున్న అసోంలో ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ప్రత్యేక బృందాలు శనివారం ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. స్థానిక పోలీసుల సమన్వయంతో విచారణను వేగవంతం చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement