స్వర నారాయణన్ | musician swaranarayanan | Sakshi
Sakshi News home page

స్వర నారాయణన్

Apr 3 2015 11:16 PM | Updated on Sep 2 2017 11:48 PM

స్వర నారాయణన్

స్వర నారాయణన్

దక్షిణ భారత సంగీతంలో మకుటం లేని మహారాజు పద్మభూషణ్ డాక్టర్ టీవీ శంకర నారాయణన్.

దక్షిణ భారత సంగీతంలో మకుటం లేని మహారాజు పద్మభూషణ్ డాక్టర్ టీవీ శంకర నారాయణన్. మామ మదురై మణి అయ్యర్ నుంచి స్వరాన్ని ఒడిసిపట్టారు ఈ సంగీత కళానిధి. ఇటీవల రవీంద్రభారతిలో కర్ణాటక సంగీత కచేరీతో సిటీవాసులకు వీనుల విందు చేశారు. ఈ సందర్భంగా సిటీప్లస్ ఆయనను పలకరించింది. ఆ విశేషాలు...
 
 సంగీతం ప్రపంచ ఆస్తి అయితే కర్ణాటక సంగీతమే నా ఆస్తి. మంచి సంగీత గాయకుడిగా పేరు రావటానికి కర్ణాటక సంగీతమే దోహదం చేసింది. మదురై మణి అయ్యర్ స్వరంతో పాటు ఆయన సమకాలీన స్వరకర్తల కూర్పులను పాడాను. తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా మయిలాడుతురై నా స్వస్థలం. తొమ్మిది సంవత్సరాల వయస్సు నుంచి మామ మదురై మణి అయ్యర్ నుండి సంగీతం నేర్చుకోవటం ప్రారంభించాను. నా మొదటి కచేరీ 1968లో జరిగింది.
 
 భావోద్వేగమే కారణం...
 కర్ణాటక సంగీతంలో నన్ను నిలబెట్టింది భావోద్వేగమే. కర్ణాటక సంగీతానికి మూల బిందువులైన గానం, శైలి రెండింటిని మామ మధురై మణి అయ్యర్ నుంచి ఒడిసిపట్టాను. దాంతో పాపులారిటీ వచ్చింది. సంగీత ప్రియులందరూ నా స్వరంలో మదురై మణి అయ్యర్ స్వరాన్ని వింటారు. ఆయన స్వరానికి ఒకింత భావోద్వేగాన్ని జోడించాను. శ్రోతలు మంత్రముగ్ధులు కావటమే కాదు. నాకు ప్రపంచ స్థాయి ఖ్యాతి తెచ్చిపెట్టింది అదే!
 
 ప్రశాంతతను కలిగించాలి...
 ఆంగ్ల సాహిత్య పుస్తకాలు బాగా చదివేవాడిని. ఇప్పటికీ కూడా. దీంతోనే నాకు హిందూస్థానీ, పాశ్చాత్య సంగీతంలో లోతైన అవగాహన ఏర్పడింది. అది తెలియడంవల్లనే... మధురమైన సంగీతాన్ని అందించగలుగతున్నాను. శ్రోతల ఆత్మను రంజింప చేసేదే నిజమైన సంగీతం. ఎంత ఒత్తిడిలో ఉన్నవారైనా సరే మన ఎదుట కొన్ని గంటల పాటు కూర్చుంటే... మన గాత్రం నుంచి వెలువడే స్వరాలు వారికి ప్రశాంతతను కలిగించాలి.
 
 40 ఏళ్ల అనుబంధం...
 హైదరాబాద్‌తో అనుబంధం ఎంతని చెప్పమంటారు. ఒకనాటిది కాదు. 40 సంవత్సరాలుగా ఎన్నో కచేరీలు చేశాను. అన్ని సంతృప్తిని ఇచ్చినవే. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు సంగీతాన్ని ఇష్టపడతారు. కచేరీలకు రావటమే కాదు ఆనందిస్తారు. అదే సంగీత విద్వాంసులకు కావాల్సింది. నేనే కాదు ఎవరైనా హైదరాబాద్ ప్రజల్ని ఇష్టపడతారు. మద్రాస్‌లో ఆధ్యాత్మికత ఎక్కువ కాబట్టి అక్కడ సంగీతం వర్ధిల్లటం సహజం. కానీ అక్కడివారికి తీసిపోకుండా ఇక్కడి తెలుగు ప్రజలు కర్ణాటక సంగీతాన్ని ఇష్టపడటం గొప్ప విషయమే.  
 
  కోన సుధాకర్‌రెడ్డి    
 

Advertisement
 
Advertisement
Advertisement