గుబాళించే కాలం..

గుబాళించే కాలం..


అత్తరు పరిమళం మనస్సుకు ఎంతో హాయినిస్తుంది. మల్లెపూలు, గులాబీరేకులు, గంధపు చెక్కలు, మొగలిపువ్వుల ఆవిరే అసలైన అత్తర్. ఎంతకాలం ఎక్కువగా భద్రపరిస్తే అంత సువాసనను వెదజల్లుతుంది. నగరజీవన శైలిలో దీని ప్రాధాన్యం మరింత పెరిగింది.

 

విశాఖ-కల్చరల్ :
సెంట్ ఎంత ఎక్కువ కాలం భద్రపరిస్తే అంత సువాసనను వెదజల్లుతుంది. నకిలీలదైతే కొంతకాలంలోనే వాసనలో వ్యత్యాసాన్ని గమనించవచ్చు. వీటిని తోలుతో చేసిన కుప్పిలలో ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి రవాణా చేస్తారు. పురాతన కాలంలో కొంతమంది తమకు నచ్చిన అత్తరులను తయారు చేయించి, పెద్ద డ్రమ్ముల్లో నిల్వ ఉంచుకునేవారు. అవి చాలాకాలం పాటు నిల్వ ఉండేవి.

 

వీడని పరిమళం

జన్నతుల్ పిర్‌దోస్, మజ్మ, షాజహాన్, తమన్నా, నాయట్, హౌప్, బఖూర్, మొఖల్లత్, ఇత్రేఫిల్, షమామతుల్, అంబర్, హీన, జాఫ్రాన్, మిష్క్, దహనుల్‌ఊద్, రోజ్, కచ్చికలి అత్తరుల్లో ముఖ్యమైనవి. కృత్రిమంగా తయారు చేసేవి ఎన్ని ఉన్నా...పెట్టిన మరుక్షణమే వాసన పోయేవి ఉన్నాయి. అసలుసిసలైన అత్తరు అంటే ఒక్కసారి పూసుకున్నాక రెండు, మూడుసార్లు దుస్తులు ఉతికినా దాని పరిమిళం మాత్రం పోదు.

 

రూ.10 నుంచి...రూ.వేల వరకూ..

సిటీలో డాబాగార్డెన్స్, జగదాంబ కూడలి, వన్‌ఏరియా, ద్వారకానగర్, పూర్ణామార్కెట్, కురుపాం మార్కెట్, మరికొన్ని కార్పొరేట్ షాపింగ్‌మాల్స్‌లోనూ లభిస్తున్నాయి. అత్తరుకే ప్రత్యేకమైన దుకాణాల్లో లభ్యమయ్యేవి మరింత భిన్నం. అరబ్బులు ఇష్టపడే దహనల్‌ఊద్ పది మి.లి.లకు రూ.2వేల నుంచి రూ.6వేల వరకు ఉన్నాయి. షమామతుర్ అంబర్, హీన వంటి 10మి.లి.ధర రూ.600, కచ్చికలి పదిగ్రాములు రూ.80, జన్నతుల్ ఫిర్‌దౌస్ పదిగ్రాముల రూ.120 ఉన్నాయి.

 

సీజన్ వారీగా...

సిటీలో సీజనల్‌వారీగా సెంట్స్‌ను వినియోగిస్తున్నారు. సాధారణంగా అన్ని రకాల అత్తరులను నిత్యం వినియోగించట్లేదు. వాడే పద్ధతి తెలియక సమయం కాని సమయంలో ఒంటికి పూసినా, వాసన పీల్చినా అనర్థాలు కలిగే అవకాశం ఉండడంతో సీజన్ బట్టి సెంట్ వెరైటీని వినియోగించడం పరిపాటి. వేసవిలో ఖస్, ఇత్రేఫిల్ చాలా మంచివి. ఇవి రెండు చల్లదనాన్ని ఇస్తాయి. ఇత్రేఫల్ మట్టివాసనను ఇస్తూ చల్లదనాన్ని కలిగిస్తుంది. వర్షాకాలం, చలిలో షమామతుల్ అంబర్, హీన, జాఫ్రాన్, మిష్క్, దహనుల్‌ఊద్ వంటివి వాడాలి. ఇవి వెచ్చదనాన్ని ఇస్తాయి.

 

దుబాయ్ నుంచి దిగుమతి...

సీజన్ బట్టి రకరకాల సెంట్స్ దుబాయి, ఖత్తర్ వంటి దేశాల నుంచి నగరానికి దిగుమతి అవుతాయి. మనదేశంలో ఉత్తరప్రదేశ్‌లోని ఖన్నోజ్ ప్రాంతం నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నట్టు హోల్‌సేల్ వ్యాపారి మహ్మద్ ఇమ్రాన్ తెలిపారు. సాధారణంగా వాడే సెంట్స్ ఇతర దేశాలతోపాటు బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ నగరాల నుంచి విశాఖకు వస్తున్నాయి.. అల్యూమినియం డాబ్బాలను రవాణాకు వినియోగిస్తున్నారు. గాజుపాత్రలు మంచివే అయినా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడం కష్టంతో కూడుకున్న పని. అందుకే అల్యూమినియం పాత్రల్లో తీసుకు వచ్చి ఇక్కడ గాజుపాత్రల్లో, సీసాల్లో నింపి బోటలింగ్ చేస్తున్నారు.

 

40 ఏళ్ల నుంచి ఇదే వ్యాపారం

మాది షాదీనగర్. మా బాబా సమయంలో ఇక్కడకు వచ్చేశా. 40 ఏళ్ల నుంచి ఇత్తరు వ్యాపారం చేస్తున్నాం. ముఖ్యంగా సూఫిబ్రాండ్ అత్తరులను ఎక్కువగా విక్రయిస్తున్నాం. దుబాయ్, ఖత్తరు, మలేసియా, సింగపూర్, విదేశాల నుంచి హోల్‌సేల్‌గా తీసుకు వస్తుంటాం. రంజన్ మాసంలో ముస్లింలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ నుంచి ఐదు జిల్లాలకు హోల్‌సేల్‌గా విక్రయిస్తుంటాం.     

- మహ్మద్ తుగ్లాక్ ఇమ్రాన్‌ఖాన్,

జగదాంబ జంక్షన్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top