
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘడ్ జిల్లాలోని గ్రామంలో వింత ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. శంకా శ్యామ్‌జీ అనే గ్రామంలో 400 ఏళ్లుగా స్ర్తీలు ఎవరూ పిల్లల్ని ప్రసవించలేదు. గ్రామ సరిహద్దుల్లో నవజాత శిశువులను ప్రసవించరాదనే వింత ఆచారం ఏళ్ల తరబడి అమల్లో ఉంది. పిల్లల్ని కంటే దేవతలు ఆగ్రహిస్తారనే నమ్మకంతో గ్రామస్తులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. గ్రామంలో బిడ్డలకు జన్మనిస్తే బిడ్డతో పాటు తల్లికూడా మరణిస్తుందనే భయం వారిని వెంటాడుతోంది.
16వ శతాబ్దంలో దేవతలు గ్రామానికి ఈ రకంగా నిర్ధేశించారని గ్రామ పెద్దలు చెబుతున్నారు. అప్పటినుంచి గ్రామంలో నిండు గర్భిణులను గ్రామ సరిహద్దు వెలుపలికి తీసుకువెళ్లి ప్రసవించేలా చేస్తున్నారు. దీనికోసం గ్రామ సరిహద్దుల అవతల ప్రత్యేకంగా ఓ గదిని నిర్మించారు. గ్రామంలో దేవాలయాన్ని నిర్మించేందుకు దేవతలు ప్రయత్నించగా ఓ మహిళ అడ్డుకుందని అప్పటినుంచి గ్రామానికి ఇది శాపంగా పరిణమించిందని గ్రామ సర్పంచ్ నరేంద్ర గుర్జార్ చెప్పుకొచ్చారు. గ్రామంలో 90 శాతం డెలివరీలు ఆస్పత్రుల్లోనే జరుగుతాయని, అత్యవసర పరిస్థితుల్లో గ్రామ సరిహద్దుల వెలుపల ప్రసవించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఆయన చెబుతున్నారు.