సాక్షి, సిటీబ్యూరో: ఆన్‌లైన్ ఫుడ్ లవర్స్‌కు ఊహించని షాక్ ఇది. జొమాటో, స్విగ్గీ యూజర్లపై అదనపు భారం పడనుంది. ఫుడ్ డెలివరీ చార్జీలు అమాంతం పెరగనున్నాయి. ఈ నెల 22వ తేదీ నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ మార్పులతో ఫుడ్ డెలివరీలు మరింత భారం కానున్నాయి. జొమాటో, స్విగ్గీ వంటి యాప్‌లు డెలివరీ ఫీజులపై అదనంగా 18% జీఎస్టీ వర్తింపజేయాల్సి ఉంటుంది.
ఫుడ్ ఆర్డర్‌లపై ప్రస్తుతం ఉన్న 5% జీఎస్టీ కంటే డెలివరీ చార్జీలే అధికం. స్థానిక డెలివరీ సేవలు సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 9(5) కిందికి వస్తాయని జీఎస్టీ కౌన్సిల్ ధ్రువీకరించింది. పండగల వేళ ఇప్పటికే ఆయా కంపెనీలు ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచి వినియోగదారులపై మోయలేని భారం మోపగా, ఇప్పుడు జీఎస్టీ బాదుడు మొదలుకానుంది. జీఎస్టీ భారాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు.
రెండు రకాల వసూళ్లు...
ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు రెండు రకాల జీఎస్టీ వర్తిస్తుంది. ఒకటి ఆర్డర్ చేసే ఆహారంపై ఉండగా, రెండోది డెలివరీ చార్జీలపై అమలులోకి రానుంది. ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌పై ఉన్న 5 శాతం జీఎస్టీ జనవరి 2022 నుంచి అమలులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఫుడ్ ఆర్డర్‌పై ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ, డెలివరీ ఫీజుపై 18 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నారు. స్విగ్గీ, జొమాటో వంటి కంపెనీలు ఒకప్పుడు డెలివరీ చార్జీలే వసూలు చేసేవి. కొన్నాళ్లకు ప్లాట్ ఫామ్ ఫీజు విధానాన్ని తెచ్చాయి. మొదట రూ.2 చొప్పున ప్రారంభించి ఇప్పుడు రూ.15 వరకు పెంచాయి.
స్విగ్గీ రూ.15.. జొమాటో రూ.12.50..
స్విగ్గీలో ఇప్పుడు డెలివరీ చార్జీలు రూ.15 కాగా, జొమాటోలో రూ.12.50గా ఉంది. మ్యాజిక్ పిన్‌లో రూ.10గా ఉంది. డెలివరీ చార్జీలపై ఇక కొత్తగా విధించే 18 శాతం జీఎస్టీతో జొమాటో వినియోగదారులపై అదనంగా ఒక్కో ఆర్డర్‌కు రూ.2 చెల్లించాల్సి వస్తుంది. స్విగ్గీలో రూ.2.60 చొప్పున భారం పడనుంది. అదనంగా రూ.5 పైన చెల్లించాల్సి రావచ్చని తెలుస్తోంది.
కేంద్రం స్పష్టత...
కేంద్ర ఆర్థక మంత్రిత్వ శాఖ ఈ విషయంపై మంగళవారం కీలక ప్రకటన చేసింది. డెలివరీ సర్వీసుల జీఎస్టీ విధింపు అంశంపై క్లారిటీ ఇచ్చింది. లోకల్ డెలివరీలపై జీఎస్టీ 18 శాతంగా ఉంటుందని తెలిపింది. రిజిస్టర్డ్ పర్సన్ నేరుగా లోకల్ డెలివరీ చేస్తే సదరు వ్యక్తి 18 శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఇక లోకల్ డెలివరీలను మరో వ్యక్తి (రిజిస్టర్ కాని వ్యక్తి) సరఫరా చేస్తే జీఎస్టీ 18 శాతం ఈసీఓ చెల్లించాల్సి ఉంటుంది. ఈసీఓ తరపున రిజిస్టర్డ్ పర్సన్ సరఫరా చేస్తే జీఎస్టీని లోకల్ డెలివరీ సర్వీసెస్ చెల్లించాల్సి ఉంటుంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
