షూటింగ్ మహాల్స్ | House owners to give call sheets for Shootings | Sakshi
Sakshi News home page

షూటింగ్ మహాల్స్

Oct 22 2014 12:15 AM | Updated on Aug 11 2018 8:29 PM

అరుంధతి, జై చిరంజీవ, సింహా మూవీలకు వేదికైన అనూప్ హౌస్ - Sakshi

అరుంధతి, జై చిరంజీవ, సింహా మూవీలకు వేదికైన అనూప్ హౌస్

సినిమా షూటింగ్‌లు అనగానే.. అయితే ఇన్‌డోర్ లేదంటే అవుట్‌డోర్‌లో జరుగుతాయి. ఇన్‌డోర్ అన గానే ఫేమస్ స్టూడియోలు నగరంలో ఉండనే ఉన్నాయి.

 సినిమా షూటింగ్‌లు అనగానే.. అయితే ఇన్‌డోర్ లేదంటే అవుట్‌డోర్‌లో జరుగుతాయి. ఇన్‌డోర్ అన గానే ఫేమస్ స్టూడియోలు నగరంలో ఉండనే ఉన్నాయి. అవుట్‌డోర్ విషయానికి వస్తే.. కథ డిమాండ్‌ను బట్టి ఇక్కడి పల్లెటూరు నుంచి అమెరికాలోని డిస్నివరల్డ్ వరకూ లొకేషన్లే లొకేషన్లు. ఇక పాటల సంగతి వేరే చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ అటుంచితే ఇప్పుడు అవుట్‌డోర్ షూటింగ్‌లకు అదిరిపోయే ఇళ్లు సినిమాలకు సెట్టింగ్‌లుగా మారుతున్నాయి. యజమానుల అభిరుచికి తగ్గట్టుగా.. అడుగడుగునా అందంగా తీర్చిదిద్దిన లోగిళ్లు సినిమా వాళ్ల మనసులను కట్టిపడేస్తున్నాయి. తమ కలల సౌధాన్ని మెచ్చి షూటింగ్ కోసం వచ్చిన సినీజనులకు కాదనకుండా కాల్షీట్లు ఇచ్చేస్తున్నారు ఆ ఇంటి యజమానులు.
 
 అందమైన ఇల్లు, ఇంటి ఆవరణ వంటి దృశ్యాలకు ప్రత్యేకంగా సెట్లు వేయాలంటే బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది. సమయం కూడా చాలా వృథా అవుతుంది.  అందుకే రిచ్‌గా ఉండే హౌస్‌లను నమ్ముకుంటున్నారు నిర్మాతలు. నగరంలో ఇలాంటి ఇళ్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. అలాంటి ఇళ్లను కొన్ని రోజులు బుక్ చేసుకుని తక్కువ మొత్తంలోనే పని కానిచ్చేస్తున్నారు. సినిమాలపై అభిమానం, వెండితెరపై తమ ఇల్లు కనిపిస్తుందన్న ఆశ.. పెపైచ్చు ఆర్థికంగా కూడా లాభసాటిగా ఉండటంతో ఇళ్ల యజ మానులూ షూటింగ్‌లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.
 
 రిచ్ అండ్ రియల్.. అరుంధతి సినిమాలో ‘డోలారే డోరాలే ధమ్’ సాంగ్ గుర్తుందా.. ఆ పాట చిత్రీకరించిన అందమైన లోగిలిని ఒక్కసారి రీకాప్ చేసుకుని చూడండి..! సెట్టింగ్ అదరహో అనిపిస్తుంది కదా..! అది సెట్టింగ్ కాదండి బాబు.. రియల్ హోమ్. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి బ్యాక్‌సైడ్ ఉంటుంది. పద్నాలుగేళ్ల కిందట షూటింగ్ లొకేషన్‌గా మారిన ఆ ఇంటి పేరు ‘అనూప్ హౌస్’. ‘జై చిరంజీవ’ సినిమాలో చిరంజీవికి, జయప్రకాశ్‌నారాయణకు మధ్య జరిగే ఫైట్ సీన్ కూడా ఈ ఇంట్లో షూట్ చేసిందే. ‘సింహా’ మూవీలో కూడా ఈ ఇంటి అందాలు మనకు కనిపిస్తాయి.
 
 ఇంద్రభవనాన్ని తలపించే ఈ రెండంతస్తుల బిల్డింగ్‌లో వందలాది సినిమాల షూటింగ్‌లు జరిగాయి. ఇంటి ఆవరణలో  రకరకాల పూలమొక్కలు.. ఫుల్ రిచ్‌గా ఉంటుందా లొకేషన్. ఇక ఇంట్లోకి అడుగుపెట్టగానే ఖరీదైన సోఫాలు.. ఎదురుగా మెట్లు.. ఆకర్షణీయమైన అలంకరణ వస్తువులతో.. అదరహో అనిపిస్తుంది. హై బడ్జెట్ సినిమాలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే అనూప్ హౌస్ దాదాపు సినిమావాళ్లందరికీ సుపరిచితమే. ఆ ఇంటి యజమాని అనూప్ ఓ డాక్టర్. సినిమాలపై ఆయనకు ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఎంతో మక్కువతో తన ఇంటిని షూటింగ్‌లకు ఇస్తుంటారు.  
 
 క్లాస్ అండ్ క్లాసిక్
 మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ‘సాయితేజ’ అపార్ట్‌మెంట్ టై తరచూ సినిమా లొకేషన్‌గా మారిపోతుంటుంది. పది రోజుల కిందటే ఈ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో ‘ఎర్రబస్సు’ సినిమా చిత్రీకరణ చేసుకుంది. ఈ అపార్ట్‌మెంట్ యజమాని రవీంద్రారెడ్డి. వృత్తిరీత్యా బిల్డర్ కావడంతో తన ఇంటిని అందరికంటే భిన్నంగా, చాలా అందంగా డిజైన్ చేసుకుని కట్టుకున్నారు. టె ర్రస్‌పై విశాలంగా ఇంటిని నిర్మించుకోవడంతోపాటు అక్కడే గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా చేయించుకున్న వాల్ మ్యూరల్స్ ఈ గార్డెన్ కు ప్రత్యేక ఆకర్షణ. అంతేకాదు అడుగడుగునా శిల్పకళా సౌందర్యం కనిపిస్తుంది. రాత్రిపూట టై మొత్తం రంగురంగుల కాంతుల్లో మెరిసిపోతుంటుంది. రెండేళ్లుగా ఈ ఇంట్లో ఇరవైకి పైగా సినిమాలు చిత్రీకరించారు. ఇంటి లోపల లేటెస్ట్‌గా డిజైన్ చేసిన ఓపెన్ కిచెన్, విశాలమైన హాల్ కూడా షూటింగ్‌లో పాలుపంచుకుంటున్నాయి. దీంతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 26లో ఉన్న ‘ఛత్రపతి హౌస్’లో  కూడా షూటింగ్‌లు చాలా జరుగుతుంటాయి. ఛత్రపతి సినిమాలోని చాలా సీన్లు ఆ ఇంట్లో షూట్ చేయడం వల్ల ఆ ఇంటి పేరు అలా నిలిచిపోయింది.
 
 హౌస్ ఈజ్ బ్యూటిఫుల్
 ఈమధ్యే విడుదలైన లౌక్యం సినిమాలోని కొన్ని సీన్లు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72, ఇంటి నంబర్ 96-3లో చిత్రీకరించారు. ఆ ఇంటి యజమానికి కూడా సినిమాలంటే ఇష్టం. నాలుగేళ్లుగా ఆ ఇంట్లో చాలా సినిమాలు ఇక్కడ షూట్ చేసుకున్నాయి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, పైసా, పవిత్ర, ఓ లైలా కోసం వంటి సినిమాల్లోని ఇంటి లోపల సీన్లు చాలా వరకూ ఇక్కడే చిత్రీకరించారు. షూటింగ్ లొకేషన్‌కు తగ్గట్టుగా ఈ ఇంట్లో నిజమైన చెట్లతో పాటు వాటికి అతికించిన ఆర్టిఫిషియల్ మొక్కలు అందర్నీ ఆకర్షిస్తాయి. అందుకే ఈ ఇల్లు సినిమా లొకేషన్‌గా మారింది.
 -  భువనేశ్వరి
 ఫొటోలు: సృజన్ పున్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement