ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

YouTube hits this week - Sakshi

రాజీ ట్రైలర్‌
నిడివి  2 ని. 41 సె.
హిట్స్‌  21,55,563

బాలీవుడ్‌కు వర్తమానంలో కథలు దొరకడం లేదు. అందుకే బయోపిక్‌లు, చారిత్రక ఘటనలు, యుద్ధ సమయాలు అంటూ వెనక్కు వెళ్లి వెతుక్కుంటున్నారు. తాజాగా 1971 ఇండో–పాకిస్తాన్‌ యుద్ధ సమయంలో మన దేశపు అమ్మాయి అక్కడి అబ్బాయిని పెళ్లి చేసుకుని ఎలా మనకు గూఢచారిగా పని చేసిందనే కథను ‘రాజీ’గా తీశారు. ఇది నిజ జీవిత ఆధార కథ. గతంలో నేవీలో ఆఫీసర్‌గా పని చేసిన హరిందర్‌ సిక్కా అనే వ్యక్తి తనకు తారసపడిన ఒక ఆఫీసర్‌ చెప్పిన వాస్తవ గాథ ఆధారంగా ‘కాలింగ్‌ సెహమత్‌’ అనే నవల రాస్తే దాని ఆధారంగా ఈ సినిమా తీశారు. ‘రాజీ’ అనే ఉర్దూ మాటకు అర్థం ‘అంగీకారం’ అని. దేశం కోసం త్యాగం చేయాలనే అంగీకారంతో పాకిస్తాన్‌కు వధువుగా వెళ్లి ఆమె ఎలాంటి కష్టాలు పడిందనేది కథ. ఆలియా భట్‌ ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించింది. మేఘనా గుల్జార్‌ దీని దర్శకురాలు. కరణ్‌ జొహర్‌ ఒక నిర్మాత. పాకిస్తాన్‌ నుంచి ఇక్కడకు, ఇక్కడి నుంచి పాకిస్తాన్‌కు అండర్‌ కవర్‌ ఏజెంట్‌లుగా వెళ్లినవాళ్లు అజ్ఞాతంగా రాలిపోవాల్సిందే తప్ప నలుగురికీ తెలియరు. వాళ్లను ఆయా దేశాలు తమ ఏజెంట్లుగా బయటకు చెప్పవు కూడా. అటువంటి కథను తీసుకొని ఈ సినిమా తీయడం కుతూహలం రేపుతోంది.

రంగమ్మా మంగమ్మా  వీడియో సాంగ్‌
నిడివి  5 ని. 58 సె.
హిట్స్‌  45,91,926

ఒక పాట హిట్‌ అయితే దాని ఆధారంగా వీడియో సాంగ్స్‌ తయారు కావడం మామూలే. కానీ ‘రంగస్థలం’లోని ‘రంగమ్మా మంగమ్మా’ పాట వీడియో సాంగ్‌ చాలామందికి నచ్చుతున్నట్టే ఉంది. దీప్తి సునయన ఈ పాటకు డ్యాన్స్‌ చేసి ఒరిజినల్‌ పాట అందుబాటులో లేని లోటును తీరుస్తోంది. పెద్ద సినిమాల్లో నటించాలనే అభిలాష ఇలా తీర్చుకునే వీలు దొరకడం వల్ల ఔత్సాహికులు తమ టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకుంటున్నారని చెప్పవచ్చు. అఖిల్‌ జాక్సన్, సాత్విక్‌ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. మంచి పల్లె వాతావరణంలో కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ పాట ఒరిజినల్‌ ట్రాక్‌ వల్ల కూడా ఆకట్టుకుంటుంది. సినిమాలో ఈ పాట పాడిన మాన్సి ఈ పాటతో పెద్ద స్టార్‌ అయ్యింది. అలాగే ఈ వీడియోకు డ్యాన్స్‌ చేసిన దీప్తి కూడా యూట్యూబ్‌ స్టార్‌ అవుతుందని ఆశిద్దాం.

పరమాణు ట్రైలర్‌
నిడివి  1 ని. 11 సె.
హిట్స్‌  15,03,370

‘బుద్ధుడు నవ్వాడు’ అని మెసేజ్‌ పాస్‌ అయ్యింది వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో పైస్థాయి అధికారులకు. 1998లో పోఖ్రాన్‌ అణుపరీక్షలు విజయవంతం అయ్యాక ఆ సమాచారాన్ని అందచేయడానికి వాడిన కోడ్‌వర్డ్‌ అది. భారతదేశాన్ని ‘న్యూక్లియర్‌ స్టేట్‌’గా ప్రకటించే సమయం ఆసన్నమయ్యిందని నాటి పాలకులు, సైన్యం భావించింది. దానికి తగిన పనులు ఎంతో రహస్యంగా జరిగాయి. ఆ ‘మిషన్‌’ వెనుక జరిగిన కథ పెద్దగా బయటకు రాలేదు. ఇప్పుడు అదంతా ‘పరమాణు’ పేరుతో సినిమాగా తయారయ్యింది. జాన్‌ అబ్రహమ్‌ ప్రధాన పాత్ర పోషించాడు. అభిషేక్‌ శర్మ దర్శకుడు. ఈ సినిమా డిసెంబర్, 2017కే విడుదల కావాల్సి ఉంది. కానీ ‘పద్మావత్‌’ లాంటి పెద్ద సినిమాలు ఉన్నాయని పోస్ట్‌పోన్‌ చేశారు. మే 4 విడుదల. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top