మామూలుకు శిక్ష

women empowerment :  retold stories 19 - Sakshi

మళ్లీ చెప్పుకుందాం!  

రీటోల్డ్‌ కథలు – 19

బాత్‌రూమ్‌లో అరగంటకు పైగా చాటింగ్‌ అయిపోయింది. ముద్దులు అయిపోయాయి. గుడ్‌నైట్‌లు ముగిశాయి. ఇంకా సమయం తీసుకుంటే అనుమానం వస్తుందని స్నానం ముగించి పైజమా టీ షర్ట్‌ వేసుకుని డైనింగ్‌ టేబుల్‌ మీద డిన్నర్‌కి కూచుంటే తల్లి వచ్చి సొరకాయ పాయసం పెట్టింది. పాలు, చక్కెర వేసి, వేయించిన జీడిపప్పులు తేలుతుండగా సువాసనలీనుతున్న లేతాకుపచ్చ పాయసం.గతుక్కుమంది. ‘ఏంటమ్మా విశేషం?’ ‘తినరా మాట్లాడదాం’పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంట్లో తీపి చేయడం మామూలే. భార్య చేస్తుంది. పెళ్లయినప్పటి నుంచి తల్లిని వంటింట్లోకి రానివ్వకుండా తల్లే అన్నంత బాగా చూసుకుంటూ వంట తనే చేస్తుంది. తీపి కూడా చేస్తుంది. కాని తల్లి వంటగదిలో దూరి ఈ పాయసం చేసిందంటే ఆ సూచన మంచిది కాదు. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడే అలా చేస్తుంది. ‘ఏమైనా గుర్తుకు వచ్చిందా?’ అడిగింది.

‘ఊ’.. అన్నాడు కొంచెం భయపడుతూ. పదమూడేళ్ల వయసు ఉండగా తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. వానాకాలం అది. మంచివానలో తడిచి వచ్చి ఆ సంగతి చెప్పి వారం తర్వాత వస్తానని బట్టలు సర్దుకొని పోబోయాడు. తల్లి అడ్డు నిలిచింది. దీనికి అంగీకరించను అంది. ఇప్పుడేం కొంప మునిగిపోయిందని... నిన్ను ఎప్పట్లానే చూసుకుంటానుగా అన్నాడు తండ్రి. ఇల్లు ఇచ్చి, నెల నెలా ఇంటి ఖర్చులు ఇచ్చి, అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉంటానని తండ్రి హామీ. దానికి అంగీరిస్తుందా ఏ తల్లైనా? తండ్రి వెళ్లిపోయాడు. తల్లి ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లిపోయింది.‘నన్ను వద్దనుకున్నప్పుడు నాకు మాత్రం అతనెందుకు’ అనుకుంది చివరకు.‘ఏమంటావు నాన్నా’ కొడుకును అడిగింది. 

ఇలాంటివి చిన్నపిల్లలకే అర్థమైపోతాయి. పదమూడేళ్లంటే పూర్తి అవగాహన కలిగి ఉండే వయసు.‘వద్దమ్మా. నాన్న వద్దు. నేను నీతో ఉంటాను. మనకు నాన్న వద్దు’ ఆవేశంగా జవాబు చెప్పాడు.
ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నాక ఆమె పూర్తిగా తెరిపిన పడింది.‘ఏదైనా తీపి చేస్తానురా’ అంది సంతోషంలో.ఇంట్లో సొరకాయ మాత్రమే ఉంది. దాంతోనే పాయసం చేసింది. ఆ ఇంట్లో వాళ్లిద్దరూ కలిసి ఆరగించిన ఆఖరి పదార్థం అది.అన్నాళ్ల తర్వాత మళ్లీ ఇవాళ టేబుల్‌ మీద.దానినీ భార్యనూ మార్చిమార్చి చూశాడు.భార్య తలొంచుకుని ఉంది.‘నువ్వెందుకు తలొంచుకుంటావ్‌. వాడు కదా తలొంచుకోవాల్సింది’ అంది తల్లి.‘ఇప్పుడు ఏం చేశాననమ్మా’ అడిగాడు.‘ఏం చేయాలి? ఇంట్లో ఉంటున్నావా నువ్వు. భార్యతో మాట్లాడుతున్నావా కనీసం. నా పక్కన పది నిమిషాలైనా కూచుంటున్నావా’
‘ఏం చేయనమ్మా... నువ్వే చూస్తున్నావుగా. పెళ్లయిన నాటి చిన్న ఉద్యోగిని అనుకున్నావా సాయంత్రం ఆరు కొట్టేసరికి ఇల్లు చేరడానికి. జీఎం అయ్యాను. కారిచ్చారు. ఇల్లిచ్చారు. ఇంకా చాలా ఇచ్చారు. దీనికి బదులు మొత్తం టైమ్‌ వాళ్లే తీసుకున్నారు. వేలు పట్టుకు తిరగడానికి, షికార్లకు తిప్పడానికి వీలు కాదమ్మా. పెద్ద హోదాలోకి వెళ్లాక ఇలా బిజీ కావడం మామూలే’...‘మరి ఆ అమ్మాయి విషయం?’

‘ఏ అమ్మాయి?‘ఎంతమంది అమ్మాయిలున్నారు?’‘ఆ అమ్మాయా... ఏంటమ్మా కొత్తగా మాట్లాడతావు. ఆఫీసులో నా వ్యవహారాలన్నీ చూసుకోవాల్సింది ఆ అమ్మాయే. ఇంటికి తీసుకువచ్చాను. నీకు పరిచయం చేశాను. తనకు పరిచయం చేశాను. మీరంతా ఒక ఫ్యామిలీలాగా మారిపోతారని అనుకున్నాను. మీటింగ్స్‌ అటెండ్‌ చేయాలన్నా బిజినెస్‌ ట్రిప్‌లకు వెళ్లినా తన అసిస్టెన్స్‌ నాకు తప్పనిసరి. అందుకే క్లోజ్‌గా ఉంటాను. ఆ అమ్మాయి కూడా– మీ వైఫ్‌కి ఇది తీసుకోండి... అది తీసుకోండి అని ఒక ఫ్యామిలీ మెంబర్‌లాగా ఎంత కన్సర్న్‌ చూపిస్తుంది. ఇంత క్లోజ్‌ అయ్యాక తన ఎమోషన్స్‌ కూడా షేర్‌ చేసుకోవాలి కదా. అందుకే మాట్లాడుతుంటాను. కార్పొరెట్‌ లెవల్‌లో ఇవన్నీ మామూలేనమ్మా’‘రేయ్‌... లక్షలు కట్నం ఇస్తానంటే కాదని ఈ పిల్లను ఇష్టపడి విలువలకి కట్టుబడి పైసా కట్నం లేకుండా చేసుకున్నవాడివిరా నువ్వు. ఆ మనిషివీ ఈ మనిషివీ ఒకడివేనా అని సందేహం వస్తోంది’‘ఇప్పుడు ఏం అపకారం చేస్తున్నానమ్మా. బాగానే చూసుకుంటున్నాగా తనని’‘శభాష్‌. అచ్చు మీ నాన్నలాగా మాట్లాడావురా’ కోడలి వైపు తిరిగింది.

‘నీకెందుకు సిగ్గు లేదు? నీ భర్తను ఎందుకు నిలదియ్యవు. నీకు నా మీద ప్రేమ చచ్చిపోయింది.. అందుకే నన్ను నిర్లక్ష్యం చేసి ఎవరితోనో తిరుగుతున్నావు.. నువ్వు నాకు వద్దు అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? సరే... నీ సమస్యలేవో నీకున్నట్టున్నాయి. నాకు లేవు’ అని కొడుకువైపు తిరిగింది.కొడుకు భయంగా చూశాడు.‘ఈ మాట నీకు ముందే చెప్పాల్సింది. కాని నాకు సపోర్ట్‌ చేయడానికి అప్పట్లా నువ్వు లేవుగా. ఒక్కదాన్నే నిర్ణయం తీసుకోవాలంటే టైమ్‌ పట్టింది. మీ నాన్నకు రెండో పెళ్లి చేసుకోవడం మామూలు. నీకు భార్య ఉండగానే తల్లి ఎదురుగా భార్య ఎదురుగా ఇంకో అమ్మాయితో రాసుకు పూసుకు తిరగడం మామూలు. ఆ అమ్మాయితో క్యాంపులకెళ్లడం దేశాలు తిరగడం మామూలు. ఇవన్నీ తేలిక విషయాలుగా భ్రమింపజేస్తూ పబ్బం గడుపుకునే మగాళ్ల లిస్టులో నువ్వు కూడా చేరతావని నేను అనుకోలేదు. మీ నాన్నతో రాజీ పడలేనిదాన్ని నీతో సర్దుకుపోతాననుకున్నావా? చస్తే జరగదు. జాగ్రత్తగా విను. నిన్ను నేను విడిచిపెట్టేస్తున్నాను. ఇక నువ్వు నాకు వద్దు. నా దారి నేను చూసుకుంటాను. ఏయ్‌ అమ్మాయ్‌... నువ్వూ వస్తావా... నిన్నూ తీసుకెళతాను’ అని హూంకరించింది.

దెబ్బకు అక్కడ భూకంపమే వచ్చింది.ఇన్నాళ్లు ఎప్పుడూ ఏడ్వని భార్య, ఎంతో ఇష్టంగా చూసుకునే భార్య, గౌరవంగా చూసుకునే భార్య ధారాపాతంగా ఏడుస్తూ ఉంది.అదిరిపడిపోయాడు. ఏదో కెలికినట్టయ్యి విలవిలలాడిపోయాడు. ఒక్క ఉదుటున లేచి భార్య పక్కన చేరి చెంపలు తుడుస్తూ ‘ఊరుకో.. ఊరుకో... ఇక మీదట అలా జరగదు.. అలా జరగనే జరగదు’ అని తల్లి దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని బెదిరిన గొడ్డు వలే తల వొంచుకు నిలబడ్డాడు.కథ ముగిసింది.రంగనాయకమ్మ రాసిన ‘మురళీ వాళ్లమ్మ’ కథ ఇది.మైక్రో ఫ్యామిలీలు వచ్చి ఇంటి పెద్దల్ని సక్సెస్‌ఫుల్‌గా ఇంటి బయటకు నెట్టాయి. మగాణ్ణి అదలించే, కట్టు తప్పితే కట్టులోకి తెచ్చే, మొటిక్కాయలు వేసే తల్లులూ తండ్రులూ ఉండాలి. మౌనం ఎప్పుడూ మంచిది కాదు. చూసి చూడనట్టు ఉందాం అనుకోవడమూ మంచిది కాదు. లోలోపల నలుగుబాటూ మంచిది కాదు. నిర్ణయం తీసుకోండి. పాయసం వండి టేబుల్‌ మీద పెట్టండి. తర్వాతి కథ అదే జరుగుతుంది.
పునః కథనం: ఖదీర్‌
రంగనాయకమ్మ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top