వర్కింగ్‌ హ్యూమన్‌

women empowerment :  Advancing Women's Leadership - Sakshi

200 పర్సెంట్‌

‘యు కెన్‌ డు’ అని ఆడవాళ్లను బయటికి పంపిస్తే సరిపోయిందా!
‘ఐ కెన్‌ డు ఇట్‌’ అని ఇంట్లో పూచికపుల్లను అటు తీసి ఇటైనా పెట్టాలి కదా ఈ మగవాళ్లు!

ఇరవై ఐదేళ్ల క్రితం ఓ రోజు.. గిమీ రామెటీ కి ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించాలని ఐబీఎం బోర్డు రూములో ఆకస్మిక నిర్ణయం జరిగింది! రామెటీ అప్పటికే ఐబీఎంలో అత్యున్నతస్థాయి ఉద్యోగి. ‘‘ఇప్పటికిప్పుడు మీరు ఈ బాధ్యతను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నారా మిస్‌ రామెటీ?’’ అని ఆమెను పిలిచి అడిగారు బోర్డు డైరెక్టర్‌లు. రామెటీ వెంటనే ‘ఎస్‌’ చెప్పలేదు. ‘‘ఇంటికి వెళ్లాక ఆలోచించుకుని చెబుతాను’’ అన్నారు.  ఈ సంగతి తెలిసి, రామెటీ భర్త నివ్వెరపోయాడు! ‘‘అదే నీ ప్లేస్‌లో మగవాడెవరైనా ఉంటే అలా అనడు తెలుసా?’’ అన్నాడు. మర్నాడు ఆఫీసుకు వెళ్లి ఆ కీలకమైన కొత్త బాధ్యతను స్వీకరించారు రామెటీ. ఐబీఎం కంపెనీ ‘థింక్‌ ఫోరమ్‌’ కార్యక్రమానికి సోమవారం యు.ఎస్‌.నుండి ముంబై వచ్చినప్పుడు.. ‘అడ్వాన్సింగ్‌ ఉమెన్స్‌ లీడర్‌షిప్‌’ అనే అంశంపై మాట్లాడుతూ, ఆనాటి తన సందిగ్ధావస్థను గుర్తుచేసుకున్నారు రామెటీ. ప్రస్తుతం ఆమె ఐబీఎం చైర్మన్, ప్రెసిడెంట్, సీఈవో. 2012లో రామెటీ సీఈవో పదవిలోకి వచ్చినప్పుడు, ‘ఐబీఎం తొలి మహిళా సీఈవో’గా గుర్తింపు పొందారు. అయితే అది రామెటీకి ఇష్టం లేని గుర్తింపు. ‘నేనొక సీఈవోని. అంతే తప్ప మేల్‌ సీఈవోనో, ఫిమేల్‌ సీఈవోనో కాదు’ అని అనేవారు. అయితే కొద్దిరోజులకే  తన అభిప్రాయాన్ని మార్చుకున్నారట రామెటీ. ‘‘రోల్‌ మోడల్‌గా ఉండటం ముఖ్యం అని నేను గ్రహించాను’’ అని తన తన ప్రసంగంలో చెప్పారు. 

రామెటీ భర్త, రామెటీకి ఇచ్చినట్లుగా.. ఇంట్లో మగవాళ్లు ఆడవాళ్లకు స్ఫూర్తిని, ప్రేరణను ఇవ్వగలరేమో కానీ.. ఇంటి పనుల్లో మనస్ఫూర్తిగా ఒక చెయ్యివేస్తారా అన్నది సందేహమే! ‘యు కెన్‌ డు’ అని ఆమెను బయటికి పంపిస్తే సరిపోయిందా? ‘ఐ కెన్‌ డు ఇట్‌’ అని ఇంట్లో పూచికపుల్లను అటు తీసి ఇటైనా పెట్టాలి కదా. అసలు ఆడవాళ్లు ఇంటిని, ఆఫీస్‌ని బ్యాలెన్స్‌ చేసుకోవడం ఎంత కష్టమో, ‘థింక్‌ ఫోరమ్‌’కి వచ్చిన ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంక్‌ ఎండీ, సీఈవో చందా కొచ్చర్‌ చెప్తుంటే.. కిరీటాలు మోస్తూ,  కిచెన్‌లో పాత్రలు సర్దడం అంత తేలిక కాదనిపిస్తుంది. రామెటీ, కొచ్చర్‌.. ఇంకా కొంతమంది మహిళా చైర్మన్‌లు, సీఈవోలు కూర్చొని ఉన్నప్పుడు పిచ్చాపాటీగా ఈ విషయాలు వచ్చాయి. ‘‘మహిళ.. ఆఫీస్‌కి నూరు శాతం, ఇంటికి నూరుశాతం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకోవడం అంటే 200 శాతం ఇవ్వడం’’ అంటారు కొచ్చర్‌. 

అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని యాడ్‌ చేసుకోవలసి ఉంటుంది. కంపెనీలు ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా, ఇంట్లో కంపానియన్‌లు కూడా చక్కగా ఉంటేనే స్త్రీ తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోడానికి అవకాశం కలుగుతుంది. అంటే.. స్ఫూర్తిని ఇవ్వడం ఒక్కటే కాకుండా, చేయూతనూ ఇవ్వాలి. చేయూత అనగానే మగాళ్లు భీతిల్లనక్కర్లేదు. తిండికి కాస్త లేట్‌ అయితే, ముఖం మాడ్చుకోకుండా ఉంటే చాలు. లేదా, ఆఫీస్‌ నుంచి ఆమె రావడం కాస్త ఆలస్యం అయితే, ఆలోపు ఇన్ని బియ్యం ఉడకేసి, పిల్లలకి తినిపించి పడుకోబెట్టినా చాలు. పెద్దపెద్ద కంపెనీల్లో పనిచేసే భార్యాభర్తలకి బియ్యం ఉడకేయడం, ఉల్లిపాయలు తరిగిపెట్టడం వంటివి ఉంటాయా అనుకోకండి. ఐబీఎంలో చేస్తున్నా, ఐసీఐసీఐలో చేస్తున్నా ఇల్లు ఇల్లే.

మహిళ.. ఆఫీస్‌కి నూరు శాతం,  ఇంటికి నూరుశాతం ఇవ్వాల్సి  ఉంటుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్‌  చేసుకోవడం అంటే 200 శాతం  ఇవ్వడం’’
– చందా కొచ్చర్, ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంక్‌ సీఈవో

అదే నీ ప్లేస్‌లో మగవాడెవరైనా ఉంటే అలా అనడు తెలుసా?’’  అని విస్తుపోయాడు నా భర్త!
– గిమీ రామెటీ, ఐ.బి.ఎం. సీఈవో 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top