
చేరిన ఏడాదిలోపే మానేస్తున్న మహిళలు
పనికి అనువుగా లేని పరిస్థితులే కారణం
గత 6 నెలల్లోనే మానేసిన వారు 67%
బ్లూ, గ్రే కాలర్ ఉద్యోగాల్లో ఇదీ పరిస్థితి
దేశంలోని కార్మిక, నైపుణ్య (బ్లూ, గ్రే కాలర్) ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో సగం మందికి పైగా.. ఉద్యోగంలో చేరిన ఏడాది లోపే తమ ఉద్యోగాన్ని విడిచిపెట్టే ఆలోచనలో ఉంటున్నారని స్త్రీ సాధికార సంస్థ ‘ఉదయతి ఫౌండేషన్’, ఐటీ కంపెనీలకు ఉద్యోగులను సమకూర్చే ‘క్వెస్ కార్ప్’ కలిసి రూపొందించిన తాజా నివేదికలో వెల్లడైంది.
రౌండేళ్లకు పైగా తమ ఉద్యోగాల్లో నిలదొక్కుకోగలిగిన మహిళల్లో ఉద్యోగం మానేయాలన్న తలంపు 3 శాతం మాత్రమే ఉండగా, ఒక ఏడాది కంటే తక్కువ కాలం ఉద్యోగం చేస్తున్న వారిలో ఇది 52 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఇంటా బయటా మహిళలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని ఈ ధోరణి తెలియజేస్తోందని నివేదిక పేర్కొంది.
జీతం పెంచితే మళ్లీ వస్తాం..: 54 శాతం మంది మహిళలు తమ ఆదాయం ఏమంత సంతృప్తికరంగా లేదని చెప్పగా, వారిలో 80 శాతం మంది నెలకు రూ. 2,000 కంటే తక్కువ ఆదా చేయగలుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన జీతం ఉంటే మహిళలు ఉద్యోగం మానేయాలన్న భావనలో ఉండేవారు కాదని సర్వే చెబుతోంది. రూ. 20,000 కంటే ఎక్కువ సంపాదించే మహిళలు ఉద్యోగం మానేసే అవకాశం 21 శాతం తక్కువగా ఉండగా, పని మానేసి వెళ్లిన వారిలో 42 శాతం మంది తమకు మెుగైన వేతనాలు ఇస్తామంటే తిరిగి ఉద్యోగంలో చేరుతామని చెప్పినట్లు నివేదిక తెలిపింది.
రిటైల్, వస్తు ఉత్పత్తి, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా వంటి రంగాలలో ప్రస్తుతం పని చేస్తున్న 10,000 మంది, గతంలో పనిచేసిన 1,500 మంది మహిళా కార్మిక ఉద్యోగులపై ఉదయతి, క్వెస్ కార్ప్ సర్వే నిర్వహించి ‘స్టేట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ది బ్లూ–గ్రే కాలర్ వర్క్‌ఫోర్స్ 2025’ అనే పేరుతో ఈ నివేదికను రూపొందించాయి. తక్కువ జీతం, సదుపాయంగా లేని రోజువారీ ప్రయాణం, భద్రతా సమస్యలు, ఉద్యోగంలో ఎదుగుదలకు పరిమిత అవకాశాలు, అన్ని కలిసి మహిళా కార్మిక ఉద్యోగులు తమకు తాముగా ఉద్యోగం మానేసే పరిస్థితులను కల్పిస్తున్నాయని సర్వే స్పష్టం చేసింది.
సురక్షితం కాని రాకపోకలు..: ప్రస్తుత మహిళా ఉద్యోగుల్లో 57 శాతం మంది నివాస స్థలానికి, పని ప్రదేశానికి మధ్య సజావైన రవాణా సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారట. 11 శాతం మంది తమ ప్రయాణ మార్గంలో, ముఖ్యంగా రాత్రి షిఫ్ట్‌లలో సురక్షితంగా లేమని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. చాలామంది హాస్టళ్లపై ఆధారపడతారు కానీ, ప్రయాణాల్లో మళ్లీ అదే భయం, అదే అభద్రత. ఉద్యోగం వదిలిపెట్టిన ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు, ఇంటికి దగ్గరగా ఉద్యోగావకాశం వస్తే తిరిగి ఉద్యోగానికి వెళ్తామని చెప్పారు.
పని ప్రదేశంలో మహిళల భద్రత కూడా ఆందోళనకరంగానే ఉంది. 22 శాతం మంది మహిళలు పనిలో తాము సురక్షితంగా లేమని భావిస్తున్నారట. 28 శాతం మహిళలు.. ఎక్కువ గంటలు, కష్టతరమైన పరిస్థితుల వల్లే తాము ఉద్యోగం మానేశామని చెప్పారు. వారిలో మూడింట ఒక వంతు మంది తమకు ఒత్తిడిని తట్టుకునే శక్తి లేకపోవటమే కారణమన్నారు.
67 శాతం మానేశారు
⇒ బ్లూ–గ్రే ఉద్యోగాలలో ఉన్న ఎంట్రీ–లెవల్ మహిళల్లో సగం మంది ఒక సంవత్సరం లోపే ఉద్యోగ విరమణ చేయాలన్న ఆలోచనకు వచ్చేస్తున్నారు.
⇒ 2020–21లో 16 శాతంగా ఉన్న బ్లూ–గ్రే కాలర్ ఉద్యోగాలలో మహిళల వాటా 2023–24లో 19 శాతానికి పెరిగినప్పటికీ, ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్’ సర్వే ప్రకారం, గత ఆరు నెలల్లో అనేక ప్రతిబంధకాల కారణంగా 67 శాతం మంది మహిళలు ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయారు.
ఆ 5 కీలకం
⇒ మహిళల్ని ఉద్యోగం మానేయకుండా ఆపగలవని నివేదిక గుర్తించిన 5 అంశాలు...
⇒ మెరుగైన వేతనం సురక్షితమైన ప్రయాణ సదుపాయం
⇒ అనువుగా మార్చిన కార్యాలయ మౌలిక సదుపాయాలు
⇒ స్పష్టమైన వృద్ధి అవకాశాలు
⇒ అందరినీ కలుపుకొనిపోయే కార్యాలయ సంస్కృతి
మహిళలు సామర్థ్యం లేకపోవడం వల్ల ఉద్యోగం మాని వెళ్లిపోవడం లేదు. వారికి తగినట్లుగా మనమింకా మౌలిక సదుపాయాలను కల్పించడం లేదు. వారి నుంచి అత్యుత్తమ ఫలితాలను సాధించటానికి అనువుగా పని ప్రదేశాలను మలుచుకోవడం లేదు. అందుకే వాళ్లు మధ్యలోనే ఉద్యోగం మానేస్తున్నారు
– పూజా గోయల్, ఉదయతి ఫౌండేషన్ వ్యవస్థాపక సీఈఓ
ఎదిగే అవకాశాలు అస్పష్టం..: కెరీర్లో ఎదుగుదలకు సంబంధించి స్పష్టమైన దారేదీ కనిపించక ఉద్యోగాన్ని వదిలేశామని 21 శాతం మంది మహిళలు తెలిపారు. ముఖ్యంగా బీ.ఎఫ్.ఎస్.ఐ. (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) టెలికం రంగాల్లో ఎదుగుదల అవకాశాలు అస్పష్టంగా ఉన్నప్పుడు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఆ ఉద్యోగంలో పనిచేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్లలో ఉద్యోగ విరమణ చేసే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉందని డేటా తెలిపింది. అయినప్పటికీ 11 శాతం మంది మహిళలు అదనపు నైపుణ్యాలలో శిక్షణ పొంది ఉద్యోగాలలో కొనసాగుతున్నారు.