
7 జిల్లాల్లో ఎక్సైజ్ కార్యాలయాల ముట్టడి.. మద్యం బాటిళ్లు పగులగొట్టి నిరసన
సాక్షి, అమరావతి: నకిలీ మద్యాన్ని ఏరుల్లా పారిస్తున్న కూటమి ప్రభుత్వ తీరుపై మహిళలు కన్నెర్రజేశారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పెద్దఎత్తున తరలివచ్చిన మహిళలు 7 జిల్లాల్లో ఎక్సైజ్ కార్యాలయాల్ని ముట్టడించారు. కార్యాలయాల ఎదుట మద్యం బాటిళ్లు సైతం పగులగొట్టారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మద్యం మాఫియా తయారైందని ధ్వజమెత్తారు.
మద్యం షాపులు, పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాపుల పేరిట ఎక్కడబడితే అక్కడ ఆ మాఫియా గ్యాంగ్ ఎమ్మార్పికి మించి ఇష్టానుసారం మద్యం అమ్ముతోందని ఆరోపించారు. ఇదంతా టీడీపీ కనుసన్నల్లోనే జరుగుతోందన్నారు. మద్యం విక్రయాల్లో దోపిడీతో ఆగని టీడీపీ నాయకులు ఏకంగా నకిలీ మద్యం తయారీకి తెగబడ్డారని, రాష్ట్రంలో ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసి మరీ అన్ని ప్రాంతాలకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇందుకోసం గోదాములు కూడా ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఆ నకిలీ మద్యానికి ఆ దుకాణాల వద్దే 8 మంది మరణించారని, ఇళ్లవద్ద ఎన్ని మరణాలు సంభవించాయో లెక్కేలేదని చెప్పారు. అయినా అధికార పక్షం నిస్సిగ్గుగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీపై బురద జల్లుతోందని ఆక్షేపించారు.
కల్తీ మద్యాన్ని అరికట్టాల్సిందే
విశాఖపట్నంలో ఎక్సైజ్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకులు, ప్రతినిధులు నిరసన చేపట్టారు. విజయవాడలో జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మహిళా నేతలు మద్యం బాటిళ్లు పగులగొట్టి నిరసన తెలిపారు. గుంటూరులోనూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. మద్యం బాటిళ్లు పగులగొట్టి ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. నెల్లూరులో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఎౖక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
తిరుపతిలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం కొనసాగింది. వైఎస్సార్‌సీపీ నాయకులు, ఆ పార్టీ మహిళా విభాగం ప్రతిని«ధులు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ మహిళా, యువజన విభాగాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కర్నూలులో మహిళలు, పార్టీ కార్యకర్తలు మద్యం బాటిళ్లు పగులగొట్టారు.