సాంకేతిక విద్యశాఖలో ఇష్టారాజ్యం
దొడ్డిదారిన డిప్యుటేషన్లతో కేంద్ర కార్యాలయంలోనే తిష్ట
సెప్టెంబర్ లో మరోసారి ‘వర్క్ అడ్జెస్ట్‌మెంట్’పేరుతో డిప్యుటేషన్లు
ఒక్క అక్టోబర్‌లోనే రెండోసారి డిప్యుటేషన్లు
సెమిస్టర్ పూర్తయ్యాక పని సర్దుబాటుపై అనుమానాలు
సాక్షి, అమరావతి: ‘వడ్డించేవాడు మనోడైతే..’ అన్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్యలో ఉద్యోగుల బదిలీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు, కావాల్సిన వారికి ‘వర్క్ అడ్జెస్ట్‌మెంట్’ పేరుతో జరిగిపోతున్నాయి. ఈ ఏడాది మే నుంచి ఇప్పటి దాకా నాలుగుసార్లు బదిలీలు చేపట్టగా, ఇప్పుడు ఐదోసారి బదిలీలకు రంగం సిద్ధమైంది. జూన్‌లో జరిగిన సాధారణ బదిలీలు మినహా, మిగిలిన అన్ని బదిలీలకు సర్‌ప్లస్, వర్క్ అడ్జెస్ట్‌మెంట్, డిప్యుటేషన్ పేరుతో కావాల్సిన వారిని నచ్చిన చోటుకు పంపేస్తున్నారు.
అక్టోబర్ 8న వర్క్ అడ్జెస్ట్‌మెంట్ పేరుతో బదిలీలు చేసిన ప్రభుత్వం.. తాజాగా మరోసారి ఉద్యోగుల సర్దుబాటుకు సిద్ధమైందంటే పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సర్దుబాటుకు ఏకంగా కౌన్సెలింగ్‌కు సిద్ధపడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఎవరెవరికి పోస్టులు కావాలో వివరాలు సేకరించడం చర్చనీయాంశమైంది. ఈ నెల 25వ తేదీతో మొదటి సెమిస్టర్ కూడా పూర్తయిపోయింది. అయినప్పటికీ మరోసారి వర్క్ అడ్జెస్ట్‌మెంట్ చేయడం ఏంటని లెక్చరర్లు, ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నట్టని నిలదీస్తున్నారు.
అడ్డగోలు బదిలీలు
జూన్‌లో వీడియో కాల్స్ ద్వారా ఉత్తుత్తి బదిలీలు చేపట్టి రికార్డు సృష్టించిన సాంకేతిక విద్యాశాఖ... సెప్టెంబర్ లో ‘వర్క్ అడ్జెస్ట్‌మెంట్’ పేరుతో అడ్డగోలు డిప్యుటేషన్లు చేపట్టింది. ఇందులో ఫోకల్ (పట్టణాలు)లో పనిచేస్తూ మేలో నాన్ ఫోకల్ (గ్రామీణ నేపథ్యం)కు బదిలీ అయినవారిని, గతంలో ఆర్థిక తప్పులు చేసి పనిషిమెంట్ తీసుకున్నవారిని తిరిగి రాష్ట్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. అలాగే, జూన్‌లో సాధారణ బదిలీలు చేపట్టినా అన్ని ఖాళీలు చూపకుండా కేవలం డబ్బులిచ్చిన వారికి, నేతల సిరఫారసు ఉన్నవారికే ప్రాధాన్యం ఇచ్చారు.
కీలకమైన స్థానాలను దాచిపెట్టి కేవలం వీడియో కాన్ఫరెన్స్‌తో బదిలీలు చేపట్టి దానికి ఆన్‌లైన్ బదిలీలుగా నామకరణం చేశారు. ఎస్‌బీటీఈటీ (స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్)లో దీర్ఘకాలంగా పనిచేస్తున్నవారికి కూడా సాధారణ బదిలీల్లో స్థానచలనం కల్పించినట్టు జీవోలతో కలరింగ్ ఇచ్చిన అధికారులు... తర్వాత ఆ ఉత్తర్వులు పట్టించుకోవద్దని కాలేజీలు, కార్యాలయాలకు సమాచారం అందించారు. అయితే, వీరికోసం గత నెలలో మరోసారి వర్క్ అడ్జెస్ట్‌మెంట్ చేస్తూ ఉన్న స్థానాల్లో కొనసాగేలా బదిలీ ఉత్తర్వులిచ్చారు.
ఎస్‌బీటీఈటీలోనూ అవినీతి మకిలి
సాంకేతిక విద్యలో సిబ్బంది కొరత ఉంది. దీంతో అవసరం మేరకు డిప్యుటేషన్‌పై సిబ్బందిని నియమిస్తారు. దీనికి ఓ విధానం కానీ, మార్గదర్శకాలు కానీ పాటించడం లేదు. పైరవీలు చేసేవారికే అవకాశం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా వచ్చిన వారు కార్యాలయాన్ని వదలకుండా కొత్తవారు రాకుండా అడ్డుకుంటున్నట్టు విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే గత నెలలో పలువురు అధికారులు డిప్యుటేషన్లు తెచ్చుకోగా, వారికి అనుకూలంగా ఉండే వారికోసం తాజాగా వర్క్ అడ్జెస్ట్‌మెంట్ బదిలీలకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది.
⇒ 2014–17 మధ్య ఎస్‌బీటీఈటీలో పనిచేసిన ఓ అధికారిపై ఆర్థిక ఆరోపణలు రావడంతో పాలిటెక్నిక్ కాలేజీకి బదిలీ చేశారు. అయితే తనకున్న పలుకుబడితో రాష్ట్ర కార్యాలయానికి వచ్చేందుకు ఆయన ప్రయత్నించినా, గత ప్రభుత్వంలో కుదరలేదు. కూటమి ప్రభుత్వం రాగానే కాకినాడ ఆర్జేడీ కార్యాలయానికి బదిలీ చేయించుకున్నారు. మేలో జరిగిన బదిలీల్లో ఆయన్ను కలిదిండి పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బదిలీ చేసినా చేరకుండా డిప్యుటేషన్ కోసం ప్రయత్నించి చివరికి జాయింట్ సెక్రటరీగా రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.
⇒ ఇప్పటి దాకా బోర్డులో సిస్టం అనలిస్ట్‌గా హెడ్ ఆఫ్ సెక్షన్ స్థాయి అధికారికి మాత్రమే అవకాశమిచ్చారు. తాజాగా ఆంధ్రా పాలిటెక్నిక్‌లో పనిచేసే ఓ లెక్చరర్‌ను తెచ్చి ఈ పోస్టులో నియమించారు. విజయవాడలో అత్యధిక సర్విసు చేసిన ఈయన తన పరిచయాలను వాడుకుని మళ్లీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.
⇒ ఏళ్ల తరబడి తిరుపతి ఆర్జేడీ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న ఓ అధికారికి జూన్‌లో బేతంచర్ల పాలిటెక్నిక్ కాలేజీకి హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్‌గా బదిలీ అయింది. అయితే, ఆయన ఆ పోస్టులో చేరకుండా పైరవీలతో బోర్డులో డిప్యూటీ కార్యదర్శిగా వచ్చారు.
⇒ బోర్డులో పనిచేసిన ఒకరిని పార్వతీపురం మన్యం జిల్లాలోని చినమేరంగి కాలేజీకి హెడ్‌గా ఇటీవల బదిలీ చేశారు. ఆయన కూడా తిరిగి వర్క్ అడ్జెస్ట్‌మెంట్ పేరుతో డెప్యూటీ కార్యదర్శిగా స్థానం సంపాదించారు.
జూన్‌లో జరిగిన బదిలీలు బేఖాతరు
సాంకేతిక విద్యలో బదిలీలకు ప్రభుత్వం జూన్ 16న ఉత్తర్వులిచ్చింది. జీవో నం.91 ద్వారా ప్రిన్సిపాల్స్/డిప్యూటీ డైరెక్టర్ల స్థాయి అధికారులను బదిలీ చేసింది. జీవో నంబర్ 92 ద్వారా సెక్షన్ హెడ్ కేడర్ అధికారులను బదిలీ చేసింది. ఇందులోనూ ప్రభుత్వంలోని పెద్దల అండదండతో బదిలీ అయినా ఆ పోస్టులోకి వెళ్లకుండా కొంతమంది డైరెక్టరేట్‌లోనే చక్రం తిప్పుతున్నారు. ఈ విషయాన్ని గత నెలలో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో ఉన్నత స్థాయిలో విచారణ చేపట్టారు. వాస్తవాలు వెలుగులోకి రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు నటించారు. యధాస్థానాల్లో కొనసాగుతూ బోర్డులో చక్రం తిప్పుతున్నారు.
బోర్డులో పాతుకుపోయారు
⇒ 2017 నుంచి బోర్డులో ఏడీగా కొనసాగుతున్న అధికారిని జూన్‌లో జంగారెడ్డిగూడెం బదిలీ చేయగా ఆయన బోర్డును మాత్రం వదల్లేదు.
⇒ 2018 నుంచి బోర్డులో పనిచేస్తున్న మరో అధికారిని గుంతకల్లు బదిలీ చేశారు. ఆయన కూడా అంతే. మరో అధికారిని ఇటీవల రాయదుర్గం బదిలీ చేసినా, ఆయన తీరూ ఇలానే ఉంది. ఇక డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న మరో అధికారిని హిందూపూర్ బదిలీ చేసినా, బోర్డును పట్టుకునే వేలాడుతున్నారు.
⇒ 2016 నుంచి బోర్డులో కొనసాగుతున్న ఓ అధికారిపై అవినీతి ఆరోపణలు రావడంతో గత కమిషనర్ చర్యలు తీసుకున్నారు. అనంతరం ప్రభుత్వం మారగానే తాను కీలక మంత్రికి బంధువునంటూ మళ్లీ బోర్డులోకి వచ్చేశారు. ఈయన్ను ఎటపాక బదిలీ చేసినా జీవోను సైతం రద్దు చేయించుకుని డైరెక్టర్ పేషీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ అన్నీ చక్కబెడుతున్నట్టు ఆరోపణలున్నాయి.


