
అక్కచెల్లెమ్మలకు నాటి భరోసా కరువు
నాడు ఇల్లాలి చేతికి పథకాల సొమ్ము.. నేడు ఆశలు వమ్ము
నీటి మూటలు, ఎండమావులుగా మారిన హామీలు
నిరాశ, నిస్పృహలతో ఆత్మస్థైర్యం కోల్పోతున్న మహిళలు
చేయూత లేదు.. ‘ఆసరా’ లేదు.. సున్నా వడ్డీ అసలే లేదు..
కుంటుపడిన చిరు వ్యాపారాలు.. స్వయం ఉపాధికి బ్రేకులు
అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపించిన గత సర్కారు
నేనున్నానంటూ ప్రతి పథకం ద్వారా ఆదుకున్న వైఎస్ జగన్
ఊరూరా సొంత కాళ్లపై నిలబడ్డ ఎంతో మంది మహిళలు
క్రమం తప్పకుండా అందిన సాయంతో ఆర్థికంగా బలపడే దిశగా అడుగులు.. ఇంకొన్నేళ్లు ఆ సాయం అంది ఉంటే పూర్తిగా గాడిన పడేవి ఆ కుటుంబాలు
ఆయన మేనిఫెస్టో సీఎం.. ఈయన మానిప్యులేట్ సీఎం అని సర్వత్రా ఆవేదన
అంతా నా వాళ్లే అని భావించిన గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌విప్లవాత్మక మార్పులతో మహిళా సాధికారతకు బలమైన పునాదులు వేశారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయం.. ఇవన్నీ ఏవీ చూడకుండా అర్హత ఉన్న వారందరికీ అండగా నిలిచారు. విలక్షణమైన పథకాలతో అక్కచెల్లెమ్మలకు అడుగడుగునా అండగా నిలిచి రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించారు. ఒక మహిళ అభివృద్ధి చెందితే ఆ కుటుంబం బాగు పడుతుందని.. కుటుంబాలు బాగు పడితే ఊరు అభివృద్ధి చెందుతుందని..అలా ఊళ్లు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని తన పాలనలో ప్రత్యక్షంగా నిరూపించారు.
ఫలితంగా మహిళా ఆర్థిక స్వావలంబన సాకారమై పూర్తిగా నిలదొక్కుకునే దశలో కూటమి నేతల ‘మాయాఫెస్టో’ ఆ విప్లవాత్మక అడుగులకు బ్రేక్ వేసింది. వెరసి ఇపుడు చిరు వ్యాపారాలన్నీ పడకేశాయి. ఆశలు అడియాశలయ్యాయి. చేయి పట్టుకుని నడిపించే భరోసా కరువైంది. అడుగులు ఎలా ముందుకు వేయాలో తెలియక క్రాస్‌రోడ్‌లో నిలుచున్నారు.
రమ సరస్వతి – రాయలసీమ జిల్లాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన నీలమ్మ (పేరు మార్చాం) దిగువ మధ్యతరగతికి చెందిన సాధారణ గృహిణి. టైలర్. అమ్మ ఒడి, జగనన్న చేదోడు, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ సున్నా వడ్డీ లాంటి పథకాలతో ఆ కుటుంబం చాలా లాభపడింది. అంతకు ముందు కేవలం బట్టలు కుట్టడం వరకే పరిమితమైన ఆమె ఈ పథకాలతో వచ్చిన డబ్బును కొట్టుకు పెట్టుబడిగా మలచుకుంది. దగ్గర్లో ఉన్న టౌన్‌లోని హోల్‌సేల్ షాపులో ఖాతా తెరిచి.. ఫాల్స్, పెట్టీకోట్లు, బ్లౌజ్ పీసెస్ లాంటి వాటిని తెచ్చుకొని ఇంట్లోనే ఓ గదిని చిన్న మ్యాచింగ్ సెంటర్‌లా మార్చుకుంది.
ఓవైపు బట్టలు కుడుతూనే ఆ చిన్న ఊర్లో ఆడవాళ్ల మ్యాచింగ్ దుస్తుల అవసరాలనూ తీరుస్తూ వాళ్లు పట్నానికి వెళ్లే ఖర్చు, సమయాన్నీ ఆదా చేస్తోంది. ‘జగనన్న పెట్టిన పథకాలు చాలానే వచ్చాయి మా కుటుంబానికి. వాటిల్లో కొన్నిటికి నేరుగా నా అకౌంట్లోనే డబ్బు పడటంతో అవి వేస్ట్ కాకుండా నా కుట్టు మిషన్ పనికి వాడుకున్నాను. మొదటి రెండు నెలలు వేస్ట్‌గానే ఖర్చయిపోయాయి. మేము బాగు పడాలని ఆయప్ప ఇచ్చిన డబ్బులు అలా వేస్ట్ అయినందుకు కొంచెం బాధ పడ్డాను. తర్వాత మా ఆడబిడ్డే సలహా ఇచ్చింది. కుట్టు పని వచ్చు కదా వదినా.. ఇంట్లోనే టైలర్ షాప్ లాంటిది పెట్టుకోవచ్చు కదా అని! నిజమే అనిపించింది.
పెట్టాను. అంతకు ముందు కాళ్లతో తొక్కే మిషనే ఉండేది నాకు. పథకాల డబ్బుతో ముందు కరెంట్ మిషన్ కొనుక్కున్నా.. తర్వాత మెటీరియల్ తెచ్చుకున్నా. ఏ నెలకు ఆ నెల ఖాతా తీర్చేసి అప్పు లేకుండా చేసుకున్నా. కానీ గవర్నమెంట్ మారిపోయి.. డబ్బులు రాక మళ్లీ అప్పుల్లో పడింది జీవితం. ఇప్పుడు ఇదివరకంతటి మెటీరియల్ తీసుకురాలేకపోతున్నా! ఓ నాలుగు నెలలుగానైతే బ్లౌజులు కుట్టడం వరకే పరిమితమైపోయా’ అని చెబుతోంది నీలమ్మ.
సమీనా వ్యాపారవేత్త అయింది..
సమీనా (పేరు మార్చాం)ది ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతం. నలుగురు పిల్లలు, తాగుబోతు భర్త, వితంతు అత్త, వ్యవసాయ కూలీగా పనిచేసే మరిది ఉన్న ఉమ్మడి కుటుంబం. పెద్దకొడుకు చదువులో చురుకు. ఆర్థిక పరిస్థితి బాలేక చదువు మానిపించి పనిలో పెట్టింది. అలా ఆమె, కొడుకు, మరిది కష్టపడ్డా అప్పులతోనే సంసారాన్ని నెట్టుకొచ్చేది సమీనా. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఆమె రాత మారింది. కుటుంబం బాగు పడింది. వాళ్ల అత్తగారికి రూ.మూడు వేలు పెన్షన్ వస్తుండటంతో ఆమె భారం తగ్గింది.
వైఎస్సార్ చేయూతకు దరఖాస్తు చేసుకుని ఆ బెనిఫిట్ పొందిన సమీనా ఊర్లోనే చిన్న కిరాణా కొట్టు పెట్టుకుంది. భర్తనూ అందులో కూర్చోబెట్టి బేరం బాధ్యతను అప్పగించి తాగుడు వ్యసనానికి దూరం చేసింది. ఆమె పెద్దకొడుకు పై చదువుల కోరికను జగనన్న విద్యా దీవెన తీర్చింది. ఇప్పుడు ఆ అబ్బాయి బెంగళూరులో మంచి కంపెనీలో చక్కటి ఉద్యోగం చేస్తున్నాడు. కొట్టు మీద వస్తున్న ఆదాయంతో మరిదికి ఓ ఆటో కొనిపెట్టింది. ఆటో తోలుతూ ఆర్థికంగా వెసులుబాటు తెచ్చుకున్న ఆ మరిదిని వెదుక్కుంటూ వచ్చింది పెళ్లి సంబంధం. పెళ్లయింది. ఆ జంట వైఎస్సార్ షాదీ తోఫా అందుకుంది. దాంతో కొత్త కాపురానికి కావల్సిన వస్తువులు కొనుక్కున్నారు.
ఆ వరుడి ఆటో మెయింటెనెన్స్‌కు వైఎస్సార్ వాహన మిత్ర తోడ్పడింది. ‘మా కుటుంబం ఈరోజు కడుపు నిండా తిండి తినడమే కాదు, మా షాపులో ఓ అబ్బాయికి జీతం ఇవ్వగలిగే స్థితికీ రాగలిగామంటే కారణం జగన్ సారే! ఆయప్ప ఇచ్చిన పథకాలు మా కుటుంబాన్నే మార్చేశాయి. ఈ ఊర్లో మాలాగా ఇంకెన్నో కుటుంబాలు బాగుపడ్డాయి’ అని చెప్పింది సమీనా.. తన కిరాణా కొట్టుకు వచ్చిన ఓ వ్యక్తికి ఉప్మా రవ్వ పొట్లం కట్టిస్తూ.
వైఎస్సార్ కడప జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఆశ ( పేరు మార్చాం) విడో. పెద్దగా చదువుకోలేదు. పైగా పోలియో. ఆమెను పోషించే ఆర్థిక స్థోమత ఆమె అత్తకు లేనందున పుట్టింటికి వచ్చేసింది. అన్న పంచన చేరింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లో చేరింది. అప్పుడే ఆమెను ఆదుకుని అన్న మీద ఆధారపడే ఆగత్యాన్ని తప్పించేసింది వైఎస్సార్ ఆసరా పథకం. ‘ఈ పథకం కింద వచ్చిన డబ్బు నాకు నిజంగానే ఎంతో ఆసరాగా నిలిచింది. స్వతంత్రంగా బతికే ధీమానిచ్చింది’ అని చెప్పింది ఆశ.

ఆ ఐదేళ్లు అంతా సాఫీగా..
నీలమ్మ, సమీనా, ఆశే కాదు.. రాయలసీమలోని ఆ మూడు జిల్లాల్లోని ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయి. అమ్మ ఒడి నుంచి జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ (రైతులకు), స్వయం సహాయక బృందాల సున్నా వడ్డీ రుణాలు, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, కాపు నేస్తం, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, వాహన మిత్ర, ఆరోగ్య ఆసరా, ఈబీసీ నేస్తం, ఆరోగ్య శ్రీ, కళ్యాణమస్తు, హౌజింగ్.. తదితర పథకాల డబ్బు నేరుగా మహిళల పేరు మీదే బ్యాంకు ఖాతాలో పడటంతో.. ఆ డబ్బును కుటుంబ ప్రగతికే ఖర్చు పెట్టారు. ఇంటిని బాగు చేయించుకున్నారు.
ఇంట్లో అవసరమైన వస్తువులను అమర్చుకున్నారు. స్కూల్‌కు వెళ్లే పిల్లలకు సైకిళ్లు కొనిపెట్టారు. మునుపటిలా ఆర్థిక ఇబ్బందులు ఇంటి ఇల్లాలి బంగారం మీద, పిల్లల చదువు మీద ప్రభావం చూపించలేదు వైఎస్సార్ జగన్ హయాంలో! ఈ పథకాల ద్వారా వచ్చిన డబ్బుతో ఆర్థిక అవసరాలు తీరాయి. ఖర్చు లేకుండా పిల్లల చదువు సాగింది. తాకట్టులో ఉన్న ఇల్లాలి బంగారం తిరిగి ఆమె ఒంటి మీదకు చేరింది. అదనంగా ఇంకొంత కొని కూతురి పెళ్లి కోసం దాచగలిగింది. అదివరకు పస్తులున్న కుటుంబాలు సైతం పౌష్టికాహారాన్ని తినగలుగుతున్నామని ఆరోగ్యకరమైన నవ్వుతో చెబుతున్నారు.
ఆరోగ్యం అంటే గుర్తొచ్చింది.. జగనన్న పంపించిన ఫ్యామిలీ డాక్టర్.. గ్రామ ఆరోగ్యాన్ని కాపాడిందని చెప్పారు గ్రామ ప్రజలు. రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీలు ఒకరకంగా విప్లవాత్మక స్కీమ్స్ అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు రైతులు. సాగంటేనే అప్పుల కుప్ప అని భయపడ్డ రైతన్నలకు ఆ స్కీమ్స్ అండగా నిలిచాయి. వెరవక వ్యవసాయం చేసే భరోసానిచ్చాయి. వాటివల్ల రైతులు మొదటిసారి చేతులనిండా డబ్బు చూశారు. ఈ స్కీమ్స్ అన్నిటికీ స్త్రీలే ఖాతాదారులవడంతో ఒకరకంగా వాళ్లు ఆర్థిక స్వావలంబనను సాధించినట్టయింది.
పొదుపు.. మదుపు
గత ప్రభుత్వ సమయంలో ఇంట, బయట అన్ని పనులకు ఆర్థి కంగా కుటుంబం మహిళల మీదే ఆధార పడటంతో ఆడవాళ్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రణాళికా బద్ధంగా కుటుంబ ఆర్థిక నిర్వహణ సాగింది. అవసరాల ప్రాధాన్యంగా ఖర్చును నిర్ణయించుకున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పొదుపు, మదుపులను సాగించారు. స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణాలు, చేయూత, చేదోడు, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో ఎంట్రప్రెన్యూర్స్ (వ్యాపారవేత్తలు) అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పథకాలతో ఇంటి ఆర్థిక పరిస్థితే కాదు గ్రామీణ ప్రమాణాలు ఊహించని రీతిలో మెరుగుపడ్డాయి.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మన పంచవర్ష ప్రణాళికలు, ఇతర ఆర్థిక ప్రణాళికలన్నీ కసరత్తు చేస్తోంది దీనికోసమే కదా! అన్నేళ్ల శ్రమ సాధించలేనిది అయిదేళ్ల జగన్‌మోహన్ రెడ్డి పాలనలోని ఈ సంక్షేమ పథకాలు సాధించగలిగాయి. సంక్షేమం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది అని పెదవి విరిచిన నిపుణులంతా వైఎస్ జగన్ పథకాలను మనసారా అభినందిస్తున్నారు. గ్రామ సచివాలయం, వలంటీర్స్ ఏర్పాటు నుంచి డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్), నాన్ డీబీటీ దాకా పలు పథకాలు దేశానికే ఆదర్శం అని కొనియాడుతున్నారు. భారత్ లాంటి దేశాలకు ఇలాంటి సంక్షేమ పథకాలే అనుసరణీయమని ప్రపంచ స్థాయి సదస్సులో ఉదాహరణగా చూపుతున్నారు. కరోనా సమయంలో సైతం మార్కెట్‌లో మనీ రొటేట్ చేసిన ఈ పథకాల మీద ప్రతి దేశం
అధ్యయనం చేయాలని సూచనలిస్తున్నారు.
క్రాస్ రోడ్లో లక్షలాది మంది జీవితాలు
అంత ఆర్థికోన్నతికి పాటుపడ్డ ఆ పథకాలు ఇప్పుడు.. తెలుగుదేశం కూటమి పాలనలో దిక్కుమొక్కు లేకుండా పోయాయి. ఏడాది గడిచినా.. ఇచ్చిన హామీల అమలు కనిపించడం లేదు. అందుకే ఊళ్లల్లో పరిస్థితి మళ్లీ దిగజారడం మొదలైంది. ఎవరిని కదిలించినా తీరని అసంతృప్తి. ఎవరి ఖాతా తెరుచుకోలేదు. కొనుగోలు శక్తి లేదు. మార్కెట్లో కళ లేదు. నత్తనడకనైనా నడుస్తుందంటే గత అయిదేళ్లలో మహిళలు జాగ్రత్తపడ్డ ఆదా వల్లనే! వాళ్ల ఎంట్రప్రెన్యూర్ స్కిల్స్ వల్లనే! అదైనా ఇంకెన్నాళ్లు నడిపించగలమనే బెంగను వ్యక్తపరస్తున్నారు అక్కచెల్లెమ్మలు.
అభివృద్ధి పేరుతో ఉన్న డబ్బంతా అమరావతికే మళ్లించి మిగిలిన రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారనే బాధను అత్యధికులు వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమంతో అభివృద్ధి సాధ్యమని వైఎస్ జగన్ నిరూపిస్తే.. అభివృద్ధి నినాదంతో ఒక వర్గం సంక్షేమాన్నే కాంక్షిస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి అని యువత, ఉద్యోగులు, మహిళలు, రైతులు అభిప్రాయ పడుతున్నారు. గ్రామ సచివాలయం, వలంటరీ వ్యవస్థ ఏర్పాటుతో అధికార వికేంద్రీకరణ, విద్య, వైద్యంలో సంస్కరణలు, సంక్షేమ పథకాల ద్వారా స్త్రీ సాధికారత వంటివాటితో గ్రామ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడి గాంధీ గ్రామ స్వరాజ్య కలను వైఎస్ జగన్ నెరవేరిస్తే.. అధికార కేంద్రీకరణతో నేటి ముఖ్యమంత్రి గ్రామాలను ధ్వంసం చేస్తున్నారని వాపోతున్నారు అన్ని వర్గాల వారు.
ఇప్పుడు ఏపీలోని పల్లెల్లో జీవం లేదు. ఉత్సాహం కరువై.. నిరాశ, నిస్పృహల నిలయంగా కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ మేనిఫెస్టో ముఖ్యమంత్రి అయితే.. చంద్రబాబు మానిప్యులెటివ్ ముఖ్యమంత్రి అని చెబుతున్నారు ప్రజలు. గత ప్రభుత్వ పాలనలో క్రమం తప్పకుండా అందిన సాయంతో నిలదొక్కుకునే దిశగా వేగంగా అడుగులు పడ్డాయని, ఇంకొన్నేళ్లు ఆ సాయం అలానే అంది ఉంటే లక్షలాది కుటుంబాలు పూర్తిగా గాడిన పడేవనడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం రావడంతో పరిస్థితి అంతా తలకిందులైందని ఇప్పుడు ఊరూరా వినిపిస్తున్న మాట. ఎందరి జీవితాలోఇప్పుడు క్రాస్ రోడ్లో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఏడాదిగా ప్రస్తుత ప్రభుత్వ పాలన చూసిన ఈ లబ్దిదారులందరూ తామంతా మోసపోయామని కుమిలిపోతున్నారు. అదే విషయాన్ని ‘సాక్షి’తో చెబుతూ తమ పేర్లు రాయొద్దని కోరారు. ఈ లెక్కన కూటమి ప్రభుత్వ పాలన ఎలా సాగుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దుర్మార్గపు ప్రభుత్వ తీరుపై గళం విప్పడానికి ఇప్పుడిప్పుడే ధైర్యం కూడగట్టుకుంటున్నారు. సమయం వచ్చినప్పుడు తాము చేయాల్సింది మాత్రం చేస్తామని బల్లగుద్ది చెప్పారు.