‘జీవితభాగస్వామిని కోల్పోతే గుండెకు ముప్పు’

Widows Have Higher Risk Of Death In The First Six Months After Losing Their Spouse - Sakshi

లండన్‌ : జీవితంలో ఓ దశ దాటిన తర్వాత ఒంటరితనం శాపమే. ఒంటరితనం పలు రుగ్మతలకు దారితీస్తుందని ఇప్పటికే పలు అంచనాలు వెలువడ్డాయి. జీవిత భాగస్వామిని కోల్పోయిన తర్వాత తొలి ఆరునెలల్లో హృద్రోగ ముప్పుతో మరణం సంభవించే ప్రమాదం 40 శాతం అధికంగా ఉందని తాజా అథ్యయనం పేర్కొంది. ఎంతో ప్రేమించే వ్యక్తిని కోల్పోయిన తర్వాత తొలి ఆరునెలలు ఆ బాధను నియంత్రించుకోవడం ఎవరికైనా చాలా కష్టమని ఈ సమయంలో బాధితులకు మరణం ముప్పు 41 శాతం వరకూ అధికంగా ఉంటుందని టెక్సాస్‌కు చెందిన రైస్‌ యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన అథ్యయనం వెల్లడించింది.

తీవ్ర విచారం మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఈ అథ్యయనంలో తేలిందని పరిశోధకులు పేర్కొన్నారు. జీవిత భాగస్వామిని కోల్పోవడం విషాదకరమని, ఈ ఒత్తిడి జీవించి ఉన్న వ్యక్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతుందని తెలిపింది. ముఖ్యంగా గుండె జబ్బుల కారణంగానే వీరికి మరణ ముప్పు 53 శాతం వరకూ అధికంగా ఉంటుందని అథ్యయనానికి నేతృత్వం వహించిన రైస్‌ వర్సిటీ సైకాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ క్రిస్‌ ఫగుండెస్‌ చెప్పారు. అథ్యయనంలో భాగంగా జీవిత భాగస్వామిని కోల్పోయిన 32 మంది ఆరోగ్య పరిస్థితిని టెక్సాస్‌లోని రైస్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు విశ్లేషించారు. తామెంతో ప్రేమించే వ్యక్తిని కోల్పోతే బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌ సహా పలు హృదయ సంబంధిత వ్యాధులు తలెత్తే ముప్పుందని చెప్పారు. హృదయ కవాటాలు రక్తాన్ని పంప్‌ చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయని, హార్మోన్లు అమాంతం పెరగడం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నా వాస్తవంగా దీనికి కారణమేంటన్నది అస్పష్టంగా ఉంది. తమ అథ్యయనంతో జీవిత భాగస్వామిని కోల్పోయిన వారిని స్వాంతన పరిచే ప్రక్రియలో వినూత్న చికిత్సకు మార్గం సుగమమవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top