
‘ఒంటరితనం అనేది బాధను వందరెట్లు చేస్తుంది’ అంటారు. భర్త చనిపోయిన తరువాత బాధపడుతూ ఒంటరితనంలో కూరుకుపోయింది సత్యవతి. ‘ఎప్పుడూ ఇంట్లో ఉండడం కంటే నలుగురిలో కలిస్తే అమ్మ కాస్త చురుగ్గా ఉంటుంది’ అని ఆలోచించాడు సత్యవతి కుమారుడు, ఆటోడ్రైవర్ గోపి. ఆ ఆలోచన ఫలితంగానే కుమారుడి ఆటోలో రోజూ అనేక ఊళ్లకు వెళుతుంటుంది సత్యవతి. పన్నెండేళ్ల కాలంలో ఆమెకు ఎంతోమంది ప్రయాణికులు పరిచయం అయ్యారు. బంధువులయ్యారు. అవును...ఇప్పుడు 84 ఏళ్ల సత్యవతి హుషారుగా ఉంటోంది. గోపి నడిపే ఆటోకు ‘అమ్మ ఆటో’ అని పేరు!
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడేనికి చెందిన మాసగాని సత్యవతి కుమారుడు గోపి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రి మరణంతో తల్లి బెంగగా ఉండడంతో ఆమెను తనతోపాటు ఆటోలో తీసుకు వెళ్లి కబుర్లు చెబుతూ తిప్పేవాడు. రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకు కొడుకుతోపాటు సత్యవతి ఆటోలోనే తిరుగుతుంది. తల్లి లేకుండా ఆటో స్టార్ట్ చేయడు గోపీ. ‘అసలే రోజులు బాగోలేవు. ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలే. ఇంట్లో ఉన్నప్పుడు గోపి గురించి భయంగా ఉండేది. ఇప్పుడు వాడి వెంటే ఉంటున్నాను కాబట్టి ఎలాంటి భయం లేదు. రోజూ ఆటోలో వెళ్లడం వల్ల ఎంతోమంది నాకు పరిచయం అయ్యారు. బంధువులు అయ్యారు’ సంతోషంగా అంటుంది సత్యవతి.
‘ఇంట్లో అమ్మ ఎప్పుడూ నాన్న గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది అనే బెంగ ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అమ్మ నాతోపాటే ఉండడం వల్ల ఎలాంటి బెంగా లేదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నా వెనక అమ్మ ఉంది అనే ధైర్యం ఉంది’ అంటున్నాడు 52 ఏళ్ల గోపి. – కాసాని వెంకటేశ్వర్లు, సాక్షి, దేవరపల్లి, తూర్పుగోదావరి జిల్లా