సమాజంలో ఏకాకిగా.. | One in six people worldwide affected by loneliness | Sakshi
Sakshi News home page

సమాజంలో ఏకాకిగా..

Sep 9 2025 4:51 AM | Updated on Sep 9 2025 6:11 AM

One in six people worldwide affected by loneliness

దేశ ప్రజలను వెంటాడుతున్న ఒంటరితనం

ప్రతి ఆరుగురు భారతీయుల్లో ఒకరిని వేధిస్తున్న సమస్య 

43 శాతం పట్టణ ప్రాంతవాసుల్లో ఇదే భావన 

దీర్ఘకాలిక ఒంటరితనంతో ఒత్తిడి, గుండెజబ్బులు, స్ట్రోక్‌ ముప్పు 

‘ఇప్సోస్‌’తాజా అధ్యయనంలో విస్మయకర అంశాలు

నిత్యం బంధువులు, స్నేహితుల నుంచి వాట్సాప్‌ను ముంచెత్తుతూ గుడ్‌మారి్నంగ్‌ సందేశాలు.. ఆఫీసుకెళ్లగానే హాయ్, హలో పలకరింపులు.. వారాంతాల్లో స్నేహితులతో పారీ్టలు.. ఏడాదంతా పండుగలు, పబ్బాలు, కుటుంబ వేడుకలు.. ఇలా సంఘజీవులుగా దైనందిక జీవితాన్ని గడుపుతున్నప్పటికీ మనోళ్లనుఒంటరితనం వేధిస్తోంది! ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభాగల దేశంగానే కాకుండా.. సాంఘిక, సామాజిక స్థాయిల్లో వివిధ బంధాలతో పెనవేసుకు పోయిన భారతీయుల్లో ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతుండటం దేనికి సంకేతం?

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని పట్టణవాసుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు తరచూ ఒంటరితనంతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. వేగవంతమైన సామాజిక–ఆర్థిక మార్పులు, పాతుకుపోయిన సాంస్కృతిక అంశాల సంక్లిష్ట మిశ్రమం కారణంగా పట్టణ ప్రాంతాల వారు ఎక్కువగా ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపింది. ఉపాధి లేక గ్రామాల నుంచి వలసల పెరుగుదల, పట్టణాల్లో అధికమవుతున్న వృత్తిపరమైన పోటీతత్వం, సుదీర్ఘ పనిగంటలు, సుదూర ప్రయాణాల వంటి అంశాలు ప్రజల్లో భావోద్వేగ అలసటకు దారితీస్తున్నట్లు పేర్కొంది.

సంబంధాలన్నీ పైపైనే..
ప్రముఖ గ్లోబల్‌ మార్కెట్‌ రీసెర్చ్, పబ్లిక్‌ ఒపీనియన్‌ స్పెషలిస్ట్‌ కంపెనీ ‘ఇప్సోస్‌’ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం పట్టణవాసులు పరస్పరం సత్సంబంధాలు కలిగి ఉన్నట్లు పైకి కనిపిస్తున్నా భావోద్వేగపరంగా ఒకరికొకరు కలవలేకపోతున్నారు. స్త్రీ, పురుష తేడాలు, పేద, ధనిక అంతరాలు, ప్రాంతాలు, పట్టణీకరణ వంటివి ఈ భావోద్వేగాలను ప్రభావితం చేస్తున్నాయి. అయితే సోషల్‌ మీడియా ఈ భావాలను కప్పిపుచ్చేందుకు.. బాధ, ఇబ్బందులను పక్కకునెట్టేందుకు దోహదపడుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమలోని భయాలను కప్పిపుచ్చుకోవడంతోపాటు వాటిని బయటకు వెల్లడిస్తే ఇతరుల దృష్టిలో చులకన అవుతామనే ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ ఔట్‌ (ఫోమో) భావన కూడా దీనికి తోడ్పడుతోంది.

సర్వేలోని ముఖ్యాంశాలు..
పట్టణ ప్రాంతాల్లోని 43% మంది భారతీయులు ఎక్కువ సమయం ఒంటరితనం ఫీలవుతున్నారు. పెద్ద నగరాల్లో ఇది 45 శాతంగా ఉంటోంది.
ప్రతి ఆరుగురిలో ఒకరు తరచూ ఒంటరిననే భావనతో కాలం నెట్టుకొస్తున్నారు.
45 ఏళ్లకు పైబడిన వారిలో 20 శాతం ఓ మోస్తరుగా,13 శాతం తీవ్రమైన ఏకాకి జీవితాన్ని అనుభవిస్తున్నారు.

పురుషుల్లో ఒంటరితనమనే భావన క్రమక్రమంగా పెరుగుతోంది.
ప్రతి నలుగురు టీనేజర్లలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారు.
పెద్ద వయసు వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు సామాజికంగా దూరంగా ఉన్నామనే భావనతో ఉన్నారు.

శారీరక, మానసిక సమస్యలు
దీర్ఘకాలిక ఒంటరితనం తీవ్ర శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి బలహీన పడటం, గుండె జబ్బులు, స్ట్రోక్‌ ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కేన్సర్‌ వంటి వ్యాధులకు గురయ్యే చాన్స్‌ ఎక్కువగా ఉంటుందన్నారు. మానసిక సమస్యలను ఎదుర్కొనే విషయంలో భారత్‌లో తగినంత మంది మానసిక ఆరోగ్య నిపుణులు లేకపోవడం అడ్డంకిగా మారుతోందని అభిప్రాయ పడుతున్నారు.

పరిష్కారం ఏమిటి? 
 కుంగుబాటుకు గురైనప్పుడు బాధితులు ఫోన్, చాట్‌ లేదా యాప్‌ల రూపంలో ‘లిజనింగ్‌ సరీ్వసెస్‌’ద్వారా సాంత్వన పొందొచ్చు. కష్టాలను విని నిపుణులు తగిన మద్దతు అందిస్తారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ కిరణ్‌ హెల్ప్‌లైన్‌ (1800–599–0019) 13 భాషల్లో 24/7 మానసిక ఆరోగ్య మద్దతు అందిస్తోంది. 

 అభిరుచిగల సమూహాలు, క్లబ్‌లు లేదా ఆన్‌లైన్‌ ఫోరమ్‌లలో చేరడం ద్వారా స్వచ్ఛంద సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఒంటరితనంతో ముడిపడిన ప్రవర్తనలను అధిగమించడంలో దోహదపడుతుంది. 
ధ్యానం, యోగా, మైండ్‌ఫుల్‌నెస్‌ వంటి అభ్యాసాలు బాధితులను ప్రశాంతపరిచి ఆందోళనలు తగ్గిస్తాయి. ఈ అభ్యాసాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడంలో సహాయపడతాయి. కారి్టసాల్‌ వంటి ఒత్తిడి హార్మోన్ల విడుదలను తగ్గిస్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement