
మూడు రోజులు సరైన నిద్ర లేకుంటే ముప్పు
స్వీడన్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
స్టాక్‌హోం: మానవులతో పాటు సకల జీవులకు నిద్ర ఎంత ముఖ్యమే మనందరికీ తెలిసిందే. శరీరంలో జీవ క్రియలు సజావుగా సాగాలంటే తగినంత నిద్ర అవసరం. నిద్ర లేమి కారణంగా ఇతర అవయవాలతోపాటు గుండె సైతం బలహీనపడుతుంది. వరుసగా మూడు రోజులపాటు చాలినంత నిద్ర లేకపోతే గుండెకు తీవ్ర ముప్పు తప్పదని స్వీడన్‌కు చెందిన ఉప్సలా యూనివర్సిటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. రాత్రిపూట నిద్రను కేవలం నాలుగు గంటలకే పరిమితం చేసుకుంటే గుండెకు రక్తం చేరడంలో మార్పులు వస్తాయని, తద్వారా గుండె జబ్బుల ముప్పు పెరగడం ఖాయమని పరిశోధకులు గుర్తించారు. అంటే వరుసగా మూడు రోజులపాటు కేవలం నాలుగు గంటల చొప్పున నిద్రిస్తే గుండెజబ్బుల ముప్పు తప్పదని స్పష్టమవుతోంది.
→ మనసులో ఒత్తిడిలో ఉన్నప్పుడు, తగినంత నిద్రలేక శరీరం అలసటగా ఉన్నప్పుడు లేదా వ్యాధులతో పోరాడుతున్నప్పుడు రక్తంలో ఇన్‌ఫ్లమేటరీ ప్రొటీన్స్ ఉత్పత్తి అవుతాయి.
→ ఈ ప్రొటీన్లు రక్తంలో ఎక్కువకాలం అధిక మోతాదులో ఉంటే రక్త నాణాలు దెబ్బతింటాయి. తద్వారా గుండె వైఫల్యం, గుండె నొప్పి, కరోనరీ గుండె వ్యాధులు తలెత్తుతాయి. గుండె కొట్టుకోవడం అనేది క్రమం తప్పుతుంది.
→ అధ్యయనంలో భాగంగా 16 మంది యువకులను పరిశీలించారు. వారిని కొన్నిరోజులపాటు ప్రయోగశాలలోనే ఉంచి అధ్యయనం నిర్వహించారు.
→ అధ్యయనంలో భాగంగా యువకులు మొదటి మూడు రోజులు 8.5 గంటల చొప్పున నిద్రపోయారు. తర్వాత మూడు రోజులు 4.2 గంటల చొప్పున నిద్రించారు. నిద్ర నుంచి లేచిన తర్వాత సైక్లింగ్ చేశారు. సైక్లింగ్‌కు ముందు, తర్వాత వారి రక్తాన్ని పరీక్షించారు. ఈ రక్తం నమూనాల్లో 90 రకాల ప్రొటీన్లను గుర్తించారు. 4.2 గంటల చొప్పున నిద్రపోయినప్పుడు వారి రక్తంలో గుండు జబ్బులకు కారణమయ్యే ఇన్‌ఫ్లమేటరీ ప్రొటీన్లు పెరిగినట్లు వెల్లడయ్యింది.
→ సాధారణంగా నిద్ర నుంచి లేచిన తర్వాత వ్యాయామం చేస్తే రక్తంలో ఆరోగ్యకరమైన ప్రొటీన్లు పెరుగుతాయి. కానీ, మూడు రోజులపాటు తక్కువ సమయం నిద్రించినవారిలో ఇలాంటి ప్రొటీన్లు చాలా బలహీనంగా ఉన్నట్లు తేలింది.
→ ఆధునిక కాలంలో పని వేళలు మారిపోయాయి. ప్రతి నలుగురిలో ఒకరు రాత్రి పూట పని చేయాల్సి వస్తోంది. వారికి చాలినంత నిద్ర ఉండడం లేదు. అలాంటివారు త్వరగా గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హె చ్చరిస్తున్నారు. యువకులు, పూర్తి ఆరో గ్యంతో ఉన్నవారు సైతం తగినంత సమ యం నిద్ర పోవాలని సూచిస్తున్నారు.
→ గుండెను భద్రంగా కాపాడుకోవాలంటే ప్రతిరోజూ కనీసం ఆరు నుంచి ఏడు గంటలపాటు నిద్రించాలని చెబుతున్నారు.
→ సెల్‌ఫోన్లతో రాత్రంతా కాలం గడిపే పి ల్లలు, యువతీ యువకులు మరింత అ ప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.