అన్ని రకాల కేన్సర్లకు ఒక్క మందు?

UK Scientists Stumble Upon Cells In Body That Can Cure All Types Of Cancer - Sakshi

పరిపరిశోధన

కేన్సర్‌ రకాన్ని బట్టి మందులివ్వడం ఇప్పటివరకూ ఉన్న పద్ధతి. కానీ యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని కార్డిఫ్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనలు సఫలీకృతమైతే మాత్రం పరిస్థితి పూర్తిగా మారనుంది. ఎందుకంటే.. రోగ నిరోధక వ్యవస్థ కణాల్లో అన్ని రకాల కేన్సర్లను ఎదుర్కోగల ప్రత్యేకమైన రిసెప్టర్లను వీరు గుర్తించారు కాబట్టి. ఈ రిసెప్టర్లను ఉపయోగించుకుని రోగ నిరోధక కణాలు క్లుప్తంగా టి–సెల్స్‌తో కేన్సర్లకు మెరుగైన చికిత్స అందించవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేన్సర్‌కు రేడియేషన్, కీమోథెరపీ, శస్త్రచికిత్స అనే మూడు చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటితో అనేక దుష్ప్రభావాలు ఉన్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఇమ్యూనోథెరపీ పేరుతో ఇంకో చికిత్స అందుబాటులోకి వచ్చింది. రోగ నిరోధక కణాలను వెలికతీసి కేన్సర్‌ కణాలను గుర్తించేలా చేసి మళ్లీ శరీరంలోకి ప్రవేశపెట్టడం ఇమ్యూనోథెరపీ విధానం.

అయితే కొన్ని రకాల కేన్సర్లకు మాత్రమే ఈ పద్ధతి ద్వారా చికిత్స కల్పించవచ్చు. పైగా వ్యక్తులను బట్టి చికిత్స ప్రభావశీలతలో తేడాలుంటాయి. ఈ నేపథ్యంలో కార్డిఫ్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జన్యు ఎడిటింగ్‌ టెక్నాలజీ క్రిస్పర్‌ క్యాస్‌ –9 సాయంతో కొత్త రకం టీ–సెల్‌ రిసెప్టర్లను గుర్తించాను. ఎంఆర్‌1 అని పిలిచే ఈ రిసెప్టెర్లు అందరిలో ఒకేలా ఉంటాయి. పైగా రక్త, రొమ్ము, ప్రొస్టట్, ఊపిరితిత్తులు, ఎముక, గర్భాశయ కేన్సర్‌ కణాలను ఈ కొత్త రిసెప్టర్ల ద్వారా సమర్థంగా మట్టుబెట్టవచ్చునని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఎంఆర్‌1 ప్రభావశీలతపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. ఆ తరువాత కూడా ఇదే రకమైన ఫలితాలు వస్తే మాత్రం అన్ని కేన్సర్లకు ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన చికిత్స అందించేందుకు వీలేర్పడుతుంది. ఇదంతా జరిగేందుకు మరో ఏడాది సమయం పట్టవచ్చునని అంచనా.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top