రెండు శతాబ్దాల గుబాళింపులు | Sakshi
Sakshi News home page

రెండు శతాబ్దాల గుబాళింపులు

Published Fri, Nov 13 2015 12:54 AM

రెండు శతాబ్దాల గుబాళింపులు

భారతదేశ రాజధాని ఢిల్లీ నగరంలో గులాబ్ సింగ్ జోషీ మాల్‌లో గులాబీ అత్తరు నేటికీ పురాతన పరిమళాలను వెదజల్లుతోంది. ఇది ప్రపంచంలోనే అతి పురాతన అత్తరు దుకాణంగా గుర్తింపు పొందింది. అంతేకాదు, ఈ సంస్థ తాను తయారుచేసే అత్తరుకి పేటెంటు హక్కులు కూడా సంపాదించుకుంది. ఆసియాలోకెల్లా అతి పెద్ద నగల మార్కెట్ అయిన దరీబా కలన్ ప్రాంతంలో 200 ఏళ్లనాటి అత్తరు దుకాణం ఇది. 1816 లో ఈ దుకాణానికి పునాది పడింది. అత్తరు తయారీకి వీరు తాజా పూలను, చందన తైలాన్ని ఉపయోగిస్తారు.‘‘ఈ దుకాణానికి అత్తరు రాణి అని పేరు పెట్టినా తప్పులేదు’’ అంటారు సందర్శకులు. ఆ దుకాణంలోకి అడుగు పెట్టగానే 1852 నాటి గోడ గడియారం గంటలు కొడుతూ స్వాగతం పలుకుతుంది.

అత్తరు వ్యాపారం చేస్తున్న అదే కుటుంబానికి చెందిన ఏడవ తరానికి చెందిన గుంధీ ఆ గడియారాన్ని అపురూపంగా సంరక్షిస్తున్నాడు. తన పూర్వీకుల గురించి ఎన్నో విషయాలు వివరిస్తాడు గుంధీ. ‘‘ఈ అత్తరు దుకాణానికి ఆద్యుడు గులాబ్ సింగ్. అప్పట్లో రెండో అక్బర్ షా హయాంలో మొఘల్ వంశీకులకు అత్తరు సరఫరా చేసేవాడాయన. ఆ తరవాత ఎందరో ప్రముఖులు ఈ దుకాణాన్ని నిత్యం సందర్శించేవారు. మొఘల్ మహిళలు వీధులలోకి రారు కనుక, వారి రాణివాసం వారికి ప్రత్యేకంగా అత్తర్లు తయారుచేసి, వాటిని బెల్జియం కట్ గ్లాసు సీసాలలో బంధించి, వాసన చెడిపోకుండా గట్టిగా బిగించి, సరఫరాచేసిన ఘనత గులాబ్‌సింగ్‌ది. ‘‘ఆ  సీసాలను నేటికీ మా దుకాణంలో అపురూపంగా భద్రపరచాం’’ అంటూ వాటిని ప్రేమగా చూపుతాడు గుంధీ.

 ‘‘మా దగ్గర సుమారు పన్నెండు రకాల అత్తర్లు దొరుకుతాయి. ప్రత్యేకంగా పెంచిన గులాబీ మొక్కల నుంచి, మల్లె మొక్కల నుంచి సేకరించిన తాజా పూలతో అత్తరు తయారుచేస్తాం. నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తాం. లేదంటే వీటి పరిమళం ఎంతోకాలం నిలబడదు’’ అంటాడు గుంధీ.ఉత్తరప్రదేశ్‌లో గులాబీ తోటలు పెంచుతూ, రూహ్ ఏ గులాబ్ అత్తరును గులాబీల నుంచి తయారుచేస్తున్నారు. అత్యధికంగా పదిగ్రాముల రూహ్ ఏ గులాబ్ ఖరీదు 18 వేల రూపాయలు. ఈ దుకాణంలో అత్యంత చౌకగా దొరకే గులాబీ అత్తరు పది గ్రాములు వెయ్యి రూపాయలు.

 ‘‘గులాబీలను తెల్లవారుజామునే కోసి, సూర్యోదయం కాకుండా పరిమళం పోకుండా, పని ప్రారంభించాలి. ఈ పని చేయడానికి ఎంతో నేర్పరితనం ఉండాలి’’ అంటాడు గుంధీ. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్, పాకిస్థాన్ ప్రెసిడెంట్ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్, ఢిల్లీ నగర ప్రముఖులు... ఎందరో ఈ అత్తరు దుకాణానికి అభిమానులు.    - డా. వైజయంతి
 
 

Advertisement
 
Advertisement