ఇక్కడ కొబ్బరికాయ కొట్టరు!

Tradition in a temple in East Godavari District - Sakshi

భక్తులు భగవంతుని దర్శించుకునే ముందు ఆయా క్షేత్రాల్లో టెంకాయలను కొట్టడం ఆనవాయితీ, ఆచారంగా వస్తోంది, ఏ ఆలయంలో చూసినా భక్తులు తమ కోర్కెలు తీర్చమని భగవంతుని ప్రార్థిస్తూ టెంకాయలను కొడుతుంటారు. కానీ తూర్పు గోదావరి జిల్లా  పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం దత్త క్షేత్రంలో మాత్రం టెంకాయలను కొట్టరు. చెట్టుకు తాడుతో కడతారు. ఇది ఆచారంగా వస్తోంది. భక్తులు తాము తలచిన కోర్కెలు నెరవేరాలని కోరుకుంటూ ఒక టెంకాయను తాడుతో దత్త క్షేత్రంలో ఉన్న ఔదుంబర వృక్షం (మేడిచెట్టు)కు వేలాడదీయడం  ఆచారంగా కొనసాగుతోంది.

సంతానం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారాల్లో లాభాలు తదితర కోర్కెలను తలచుకుంటూ భక్తులు టెంకాయని మేడిచెట్టుకు కట్టి దత్తాత్రేయునికి దణ్ణం పెట్టుకుంటారు. కోర్కెలు తీరితే ఆలయంలో పల్లకి సేవ, అభిషేకం, అన్నదానం, పారాయణం వంటి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తామంటూ మొక్కుకుంటారు. తమ కోర్కెలు నెరవేరిన వెంటనే తిరిగి ఆలయానికి చేరుకుని మొక్కుబడులను తీర్చుకుంటారు. దాంతో ఈ మేడిచెట్టు ఎప్పుడు చూసినా కొబ్బరికాయలతో నిండి ఉంటుంది. చెట్టు నిండిపోతే ఆ కొబ్బరికాయలను తొలగించి వాటిని పవిత్రమైన గోదావరి కాలువలో నిమజ్ఞనం చేస్తుంటారు.

ముఖ్యంగా శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో శ్రీపాదవల్లభ జయంతి, దత్తాత్రేయ జయంతి తదితర ఉత్సవాల సమయంలో భక్తులు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో విచ్చేస్తుంటారు. ఆయా ఉత్సవాల సమయంలో ఎక్కువమంది భక్తులు తమ కోర్కెలు నెరవేరాలని అధికసంఖ్యలో కొబ్బరికాయలు కట్టడంతో రోజుకు రెండుసార్లయినా చెట్టునిండా కొబ్బరి కాయలు నిండిపోతుంటాయి. ఈ చెట్టుకు కట్టిన కొబ్బరికాయలను ఏ విధమైన అవసరాలకు ఉపయోగించకుండా పవిత్రమైన గోదావరి జలాల్లో నిమజ్ఞనం చేయడం విశేషం.

పాదగయ క్షేత్రంలోనూ...
పిఠాపురం పాదగయ శ్రీ కుక్కుటేశ్వరస్వామి వారి దేవస్థానంలో వేంచేసియున్న దత్తాత్రేయుని ఆలయంలోనూ కొబ్బరి కాయలు కొట్టకుండా అక్కడ ఉండే మేడిచెట్టుకు కట్టడం ఆచారంగా వస్తోంది. భక్తులు తమ మనసులో కోర్కెలు కోరుకుని కొబ్బరి కాయను మేడి చెట్టుకు కడతారు. అందుకే పాదగయ క్షేత్రంలో వెలసియున్న దత్తాత్రేయుడి గుడి వద్ద ఉన్న మేడిచెట్టు కొబ్బరి కాయలతో నిండిపోయి మేడి చెట్టు కాస్తా కొబ్బరి చెట్టుగా కనిపిస్తోంది.

ఇటువంటి ఆచారం దత్త క్షేత్రాల్లో మాత్రమే ఉంది. భక్తులు కట్టిన కొబ్బరి కాయలను పవిత్రంగా భావించి వాటిని ఏవిధమైన అవసరాలకు ఉపయోగించకుండా పవిత్రజలాలలో నిమజ్జనం చేస్తుంటారు. ఇలా పవిత్ర జలాల్లో నిమజ్జనం చేసిన కొబ్బరికాయలను భక్తులు పవిత్ర ప్రసాదంగా భావిస్తుంటారు. ఎవరికైనా నీటిలో దొరికితే దానిని స్వామివారి ప్రసాదంగా స్వీకరిస్తారు. నీటిలో ఉండడం వల్ల కాయలు మొలకలు వస్తే వాటిని దేవుడి వరంగా బావించి తమ ఇళ్ల వద్ద నాటుకుంటారు. శ్రీపాద వల్లభుడి ప్రతిరూపంగా పెంచుకుంటారు.
 
ఇది ప్రాచీన ఆచారం
పూర్వం ఒక భక్తురాలు తన మనసులో కోరిక కోరుకుని కొబ్బరికాయ కొట్టడానికి వీలు లేక అక్కడే ఉన్న ఔదంబరి చెట్టు దగ్గర పెట్టి వెళ్లిపోయి ఆమె కోరిక నెరవేరాక మళ్లీ తిరిగి వచ్చి చూడగా కొబ్బరి కాయ అక్కడే ఉండడంతో స్వామివారు ఆ కొబ్బరికాయను చూసి తమ కోర్కెలు తీర్చారని ఆమె చెప్పిందని, ఆ తర్వాత మరల అలాగే చేసిందని, అప్పుడు కూడా ఆమె కోరిక తీరడంతో అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోందని పూర్వీకులు చెబుతారు.   – నాగభట్ల జానకీరామశర్మ, ఆలయ అర్చకులు, శ్రీ పాదశ్రీవల్లభ మహాసంస్థానం, పిఠాపురం.

– వీఎస్‌వీఎస్‌ వరప్రసాద్‌ సాక్షి, పిఠాపురం, తూ.గో. జిల్లా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top