యోగవృక్షం | Tomorrow Father's Day | Sakshi
Sakshi News home page

యోగవృక్షం

Jun 19 2015 11:00 PM | Updated on Sep 3 2017 4:01 AM

యోగవృక్షం

యోగవృక్షం

చెట్టు ప్రాణవాయువును ఇస్తుంది...

చెట్టు ప్రాణవాయువును ఇస్తుంది... నీడను ఇస్తుంది... ఆకలేస్తే ఫలమిస్తుంది.
యోగవృక్షం ఇవన్నీ కాకుండా... మానసిక, శారీరక తేజస్సును ఇస్తుంది.
పెరటిచెట్టు వైద్యానికి పనికిరాద న్నట్లు... మహావృక్షమైన యోగవృక్షానికి మన దగ్గర పోషణ కరువైంది.
రేపటి నుంచి ఇది మారబోతోంది.  జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే.
మన పూర్వవైభవానికి ఒక కొత్త ఉదయం.

 
రేపు ఫాదర్స్ డే!
పితామహులకు నమస్కారం.
పతంజలికి, వివేకానందుడికి, పరమహ ంసకు ప్రథమ నమస్కారం.
     
రేపు టీ-షర్ట్స్ డే!
warning:Yoga Has Been Known To Cause Health  and Happiness
 ఆరోగ్యానికి, ఆహ్లాదానికి ప్రసిద్ధి చెందినది యోగా.
ఎలా ఉంది ఈ కోట్?
రేపు మీరు వేసుకునే టీ షర్ట్ మీదికి ఇలాంటి కోట్ ఒకటి ఉంటే బాగుంటుంది.
ఇవాళే వెదికి పట్టుకోండి.
     
రేపు మ్యూజిక్ డే!
మ్యూజింగ్ మనసుకు మంత్రం వేస్తుంది.
ఆ మంత్రానికి యోగా మిక్స్ అయితే...
మాయా మశ్చీంద్రే! మనసు, దేహం మిక్స్‌డ్‌గా హిమాలయాలపై తేలుతాయి.
     
రేపు ఇంకా చాలా డేస్ ఉన్నాయి.
ఆదివాసీల డే, క్రిస్టియన్ ఫీస్ట్ డే, మార్టిర్స్ డే, స్కేట్‌బోర్డింగ్ డే, సర్ఫింగ్ డే, హ్యూమనిస్డు డే, హైడ్రోగ్రఫీ డే...
కొన్ని నేషనల్. కొన్ని ఇంటర్నేషనల్.
నదుల్లాంటి ఈ డేస్ అన్నీ రేపు ‘యోగా’ అనే సముద్రంలో సంగమించబోతున్నాయి. థమ్స్ డౌన్. శీర్షాసనం వేయబోతున్నాయి.
జూన్ 21... ది బిగ్ డే. ది బిగ్గెస్ట్ డే కూడా.
ఉత్తరార్థగోళంలో రేపు పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. అందుకే బిగ్ డే.
రేపు ఇంటర్నేషనల్ యోగా డే. అందుకే ది బిగ్గెస్ట్ డే.
ఉత్తరార్థ గోళంలో, దక్షిణార్థ గోళంలో ప్రపంచ సమయం అంతా యోగధ్యానంలో ఉండిపోతుంది.

ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే...
మొత్తం ప్రపంచం ఇండియా చెప్పినట్లు ఆసనాలు వేయబోతోంది. అమెరికా కూడానా? అవును అమెరికా కూడా! రష్యా, బ్రిటన్, జర్మనీ... ఇవీ! ఇవికూడ. మొత్తం 192 దేశాలు. 200 కోట్ల మంది ప్రజలు భారతదేశానికి యోగాభివాదం చేయబోతున్నాయి.

భారత్ చొరవతో ఐక్యరాజ్య సమితి ఈ ‘అంతర్జాతీయ యోగా డే’ని ఏర్పాటు చేసింది. ఐరాస కార్యాలయంలో రేపు సమితి కార్యదర్శి బాన్‌కీ మూన్, మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కాసేపు యోగాసీనులౌతారు. వారితో పాటు 30 వేల మంది యోగాసనాలు వేస్తారు! ఇండియాలో అయితే యోగాడే పెద్ద పండగే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తై పీఠభూమి సియాచిన్‌లో రేపు ఇండియన్ ఆర్మీ యోగ విన్యాసాలు చేయబోతోంది.
 
భారత్‌కిది పెద్ద గౌరవం. భారత్‌పై ఇది పెద్ద బాధ్యత కూడా.
ఎందుకంటే... యోగా మనది. కంప్లీట్‌గా మనదే. ఆరు వేల ఏళ్ల నాటిది. అంతకు క్రితంది కూడానేమో! పతంజలి యోగసూత్రాలకంటే ముందే ప్రాచీన మునులు, రుషులు ఆసనాలు వేశారనడానికి ఆధారాలున్నాయి.
కర్మయోగం, జ్ఞానయోగం, రాజయోగం, భక్తియోగం... హిందుత్వంలో ప్రధానమైనవి. యోగాకు మతం లేదు. ప్రాంతం లేదు. యోగాకు ఉన్నవి, ఉండవలసినవి రెండే. మైండ్ అండ్ సోల్.
     
యోగాలో పాశ్చాత్యులు బాగా ముందుకెళ్లిపోయారు. హాట్ యోగా, కోల్డ్ యోగా, యోగా ప్లస్, యోగా లైట్... యోగా ఇప్పుడక్కడ పెద్ద ప్రయోగం. యోగా చుట్టూ ఒక్క అమెరికాలోనే సుమారు 2,700 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతోంది. అక్కడి పాఠాలు డిఫరెంట్.
గట్టిగా గాలి పీల్చి, నెమ్మదిగా బయటికి వదలమంటుంది మన యోగా.
inhale love,inhale hate అంటోంది అమెరికన్ యోగా.
మనం ‘‘ఓం శాంతి ఓం’ అంటాం.
వాళ్లు ‘ఓం స్వీట్ ఓం’ అంటున్నారు.

ప్రాథమికంగా లోకమంతా యోగా ఒక్కటే. అది వ్యాయామ సాధనాల సమాహారం. ఆరోగ్యానికీ, ఆధ్యాత్మికతకు సోపానం.
యోగాలో ఏ దేశానికా దేశానికి సొంత మూలాలు ఉన్నాయట. మిషెల్ గోల్డ్‌బెర్గ్ అనే రచయిత్రి ‘ది గాడెస్ పోస్’ అనే పుస్తకంలో రాశారు. ఇండియాలో ‘కుస్తీ’ ఎలాగో, ఐరోపాలో ‘కాలిస్తనిక్స్’, డెన్మార్క్‌లో ‘లింగ్ జిమ్నాస్టిక్స్, బ్రిటన్‌లో ‘సైనిక వ్యాయామాలు’ అలాగ  అని మిషల్ రాశారు. అయితే అంతకన్న ప్రాధాన్యం  ఉన్న విషయం... ‘ది గాడెస్ పోస్’... ఇంద్రాదేవీ అనే ఒక భారతీయ యోగిని జీవిత చరిత్ర కావడం. యవ్వనంలో ప్రారంభించి, జీవిత చరమాంకం వరకు యోగాను ఉపసించిన ఇంద్రాదేవి నూరేళ్లకు పైగా జీవించారు (1899-2002). ఇరవయ్యవ శతాబ్దంలో భారతీయ యోగా పాశ్చాత్యదేశాలను చేరుకుంది ఇంద్రాదేవి ద్వారానే అనే విషయాన్ని ఎంతో ప్రామాణికంగా రాశారు గోల్డ్‌బెర్గ్.
     
ఇంద్రాదేవి వలసయోగిని. ఇండియా, రష్యా, అమెరికా దేశాల్లో యోగాను విస్తృతం చేశారు. అమె పుట్టింది రిగా (ఇప్పటి లాట్వియా)లో. పుట్టినప్పటి పేరు యూజినీ (మన ‘యోగిని’ లానే ఉంది కదా!). బాలీవుడ్‌లో సెలైంట్ మూవీల్లోకి నటించడానికి వచ్చాక ఇంద్రా దేవిగా మారిపోయారు. టీన్స్‌లో ఆమె మైసూర్‌లో ఉన్నారు. ఆ వయసులోనే జిడ్డు కృష్ణమూర్తి భారతీయ ఆధ్యాత్మికత ఆమెను ఆకర్షించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు పృథ్వీరాజ్ కపూర్‌తో కలిసి ‘అరేబియన్ నైట్స్’ చిత్రంలో నటించారు. అయితే యోగా మాస్టర్ తిరుమలై కృష్ణమాచార్య ఆమెపై చూపిన ప్రభావాన్ని బాలీవుడ్ చూపలేకపోయింది.

ఇంద్రాదేవి ఆయన శిష్యురాలిగా స్థిరపడ్డారు. ఆయన ప్రోత్సాహంతో మిగతా శిష్యులైన జోయస్, అయ్యంగార్‌ల కంటే ముందు ఇంద్రాదేవే యోగాను పాశ్చాత్యుల చెంతకు తీసుకెళ్లారు. ఆమె ద్వారా అక్కడ యోగా ఏ స్థాయిలో ప్రసిద్ధి చెందిందంటే... హాలీవుడ్ అందాల తారలు మార్లిన్ మన్రో, గ్రెటా గార్బో కూడా యోగాలో ఆమె శిష్యరికం తీసుకున్నారు!
 
యోగా గొప్పతనం ఏమిటి?

తలనొప్పిని తగ్గించుకోడానికి పది నిమిషాల భౌతిక వ్యాయామంతో ఈథరిక్ బాడీని శుభ్రపరిచి, ఆధ్యాత్మిక గురువులను ప్రార్థించి, నాలుకను అంగిలికి కలిపి, ప్రేమపూరిత కారుణ్యంతో యావత్ప్రపంచాన్నీ దీవించడం ద్వారా క్రౌన్ చక్రాన్ని క్రియాత్మకం చేసుకోవడం కన్నా, దగ్గర్లోని మెడికల్ షాపుకు వెళ్లి శారిడాన్ వేసుకోవడం నయం కదా! మరి యోగా గొప్పతనం ఏమిటి?
చెప్తే అర్థం కానిదీ, చేస్తే తప్ప అర్థమవనిదీ యోగా. సృష్టిలోని 84 లక్షల జీవరాసులకు ప్రతీకలుగా 84 లక్షల ఆసనాలు రూపొందాయని యోగులు చెబుతారు. దేహం ఒక్కటే. కానీ ఆసనాలు 84 లక్షలు! ఇంతకన్నా గొప్పతనం కావాలా? మరి తలనొప్పి సంగతి? యోగాను ఓపిగ్గా సాధన చేస్తే శారిడాన్ నయమో, శారీరక పరిశ్రమ నయమో మీకే తెలుస్తుంది.
- సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
యోగా ఫర్  విమెన్

ఆరోగ్యం అందాన్నిస్తుంది. అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వీటన్నిటినీ యోగా ప్యాకేజ్‌గా అందిస్తుంది. మహిళలు క్రమం తప్పకుండా యోగా చేస్తే చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. శరీరాన్ని సరైన ఆకృతిలో పెడుతుంది.  రోజంతా ఉత్సాహంగా.. చురుకుగా ఉంచుతుంది. రుతుక్రమం సరిగ్గా వచ్చేలా చూస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే రోజూ చేసే యోగా మహిళలను స్లిమ్ అండ్ ఫిట్‌గా మారుస్తుంది!
 
బాలీవుడ్ యోగా సాధకులు
సోనమ్ కపూర్  
శిల్పాశెట్టి
కొంకణ సేన్ శర్మ
లారాదత్తా  
రాణీ ముఖర్జీ
కరీనా కపూర్


ఫలయోగం
‘‘మనిషి తన చిత్తంలోని ప్రవృత్తులను నియంత్రించుకుని తన వశంలో ఉంచుకోవడమే యోగం’’ అంటారు పతంజలి. ఇప్పటి ఆధునిక జీవన విధానానికి యోగా తప్పనిసరి అని యోగా నిపుణులు చెబుతున్నారు. యోగా నిత్య జీవితంలోని ఒత్తిళ్లను తగ్గిస్తుంది. వృత్తి జీవితంలోని కలతలను, ఆహారపు అలవాట్లలోని అపసవ్యతలను సరిచేసి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. బీపీ, మధుమేహం తదితర  అనారోగ్యాలను దరి చేరనివ్వదు. అలాగే మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఆధ్యాత్మిక జీవనంపై మనసును మళ్లిస్తుంది. దీర్ఘాయుష్కులను చేస్తుంది. ఇవన్నీ కూడా సాధన ద్వారా నిరూపితమైన విషయాలే.
 
యోగా సాధన - నియమ నిష్టలు
ముందు...
పరగడుపున చేయాలి. తేలికపాటి ఆహారం తీసుకుని ఉన్నా పర్వాలేదు.
దుప్పటిపైన గానీ, చాప మీద గానీ యోగా సాధన చేయాలి.
గర్భిణిగా ఉన్నప్పుడు, లేదా ఆరోగ్యం బాగోలేనప్పుడు ఆసనాలు వేయదలిస్తే ముందుగా యోగా నిపుణులను సంప్రదించాలి.
సౌకర్యంగా ఉండే తేలికపాటి దుస్తులను ధరించి యోగా సాధనన చేయాలి.
బాగా అలసటగా ఉన్నప్పుడు, ఆరోగ్యం అస్సలు బాగోలేనప్పుడు యోగా చేయకూడదు.
ప్రశాంతమైన వాతావరణంలో బాడీ, మైండ్ విశ్రాంతిగా ఉన్న స్థితిలో యోగా మొదలుపెట్టాలి.
 
మధ్యలో, తర్వాత...
ప్రార్థనతో సాధన ప్రారంభించాలి. ప్రార్థన వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది.
శ్వాస తీసుకోవడం కానీ, వదలడం కానీ నాసిక ద్వారా మాత్రమే జరగాలి.
యోగ సాధనను ప్రతిసారీ ధ్యానంతో ముగించాలి.
యోగాసనాలు వేస్తున్నప్పుడు శరీరాన్ని బిగుతుగా ఉంచకూడదు.
యోగ సాధనను మన శక్తిమేరకు మాత్రమే చేయాలి.
సాధన ముగిశాక 20-30 నిమిషాల తర్వాత స్నానం చేయాలి.
ఆహారం కూడా 20-30 నిమిషాల తర్వాతే తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement