వీళ్లిద్దరూ కవలలు కాదు... కాదా?

Today is EVVy Satyanarayana Jayanti - Sakshi

మరి నాన్న గురించి ఏమడిగినా కవలల్లానే కనెక్ట్‌ అవుతున్నారేంటి?ఒకరికి చక్కిలిగింత పెడితే మరొకరికి నవ్వు వచ్చినట్టు..  ఒకర్ని గిల్లితే ఇంకొకళ్లకి కన్నీళ్లు వచ్చినట్లు.. వీళ్లిద్దరికీ నాన్న అంత దగ్గర. ఏది చేసినా నాన్న కీర్తి పెరగాలని, నాన్న ఆశయం నిలవాలని,  నాన్న మాట నిలబెట్టాలని ఒకేలా ఆలోచించే ‘థాట్‌ ట్విన్స్‌’ ఈ హలో బ్రదర్స్‌.

మీ నాన్నగారితో మీ మెమరబుల్‌ మూమెంట్స్‌.. 
రాజేశ్‌: ‘హాయ్‌’ సినిమా ఫస్ట్‌ డే షూటింగ్, ఫస్ట్‌ సీన్‌ ఇంకా గుర్తున్నాయి. ఫస్ట్‌ టైమ్‌ నాన్న ఒక డైరెక్టర్‌లా నాకు సీన్‌ వివరించడం, నేను ఆయన్ను డైరెక్టర్‌లా అనుకుని చేయడం.. ఆ రోజు థ్రిల్లింగ్‌గా అనిపించింది. లొకేషన్‌లో ఫాదర్‌ అండ్‌ సన్‌లా కాదు. పని విషయంలో రూల్స్‌ రూల్సే. ఆ సినిమాకు నేను హీరో అవ్వొచ్చు కానీ అంతా ఆయన చేతుల్లోనే. డాడీతో ఎన్నో మెమరబుల్‌ మూమెంట్స్‌ ఉన్నాయి.
‘హాయ్‌’ ఓ స్వీట్‌ మెమరీ.

నరేశ్‌: నేను బాగుండనని, నన్ను డైరెక్టర్‌ని చేయాలని అనుకునేవారు. కాకపోతే ‘నువ్వు బాగుండవు’ అనే మాట నాతో అని, నన్ను డిజప్పాయింట్‌ చేయలేదు. నేను ‘అల్లరి’ సినిమా చేసినప్పుడు ఆయన పెద్దగా ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. రిలీజ్‌కి ముందు సురేశ్‌బాబుగారు, దర్శకుడు రవిబాబు, నాన్నగారు సెకండ్‌ షో వేసుకొని చూశారు. నాకు 24 ఏళ్లు వచ్చేవరకూ మా నాన్నగారి పక్కనే పడుకునేవాణ్ని. ‘అల్లరి’ షో చూసొచ్చి, రూమ్‌లోకి వచ్చీ రాగానే ‘చాలా బాగా చేశాడు. ఆర్టిస్ట్‌గా సక్సెస్‌ అవుతాడు’ అని అమ్మతో అన్నారు. మరో బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ‘గమ్యం’కి ఇచ్చారు. ‘ఈ కథ ముందు నాకు చెప్పి ఉంటే వద్దనేవాణ్ని. నీది మంచి డెసిషన్‌’ అన్నారు.
   
నాన్నగారు లేని ఇల్లు ఎలా అనిపిస్తోంది? 
నరేశ్‌: ఆయన లేని లోటు ఎప్పటికీ ఉంటుంది. వెలితి ఎప్పుడు తెలుస్తోందంటే... నాన్నగారికి పిల్లలంటే చాలా ఇష్టం. మా పిల్లల్ని చూసినప్పుడు ఆయన బ్రతికుంటే అసలు పిల్లల్ని ఎత్తుకుని కిందకి దించేవారు కాదేమో అనిపిస్తుంటుంది. 
     
మీ నాన్నగారు కెరీర్‌వైజ్‌గా ఇచ్చిన సలహాలేంటి? 
నరేశ్‌: ‘ఒకరికి మంచి చేయకపోయినా çఫర్లేదు కానీ చెడు చేయొద్దు. మన వల్ల ఎవరూ బ్లేమ్‌ అవ్వకూడదు. గొడవలకి వెళ్లకూడదు’ అనేవారు. ఆయన లైఫే మాకు మంచి లెసన్‌. మా ఆఫీస్‌ ముందు 20కి పైగా కారులు ఉన్న టైమ్‌ని చూశాం. హిట్స్‌ లేనప్పుడు ఎవరూ పలకరించని ఇన్సిడెంట్స్‌నీ చూశాం. ‘ఈవీవీ అయిపోయాడు’ అనే మాటని తట్టుకోలేక ‘ఈవీవీ సినిమా’ బేనర్‌ స్టార్ట్‌ చేసి, నాన్నగారు ‘చాలా బాగుంది’ తీశారు. ముందే ‘చాలా బాగుంది’ అని టైటిల్‌ పెట్టేస్తే సరిపోతుందా? అన్నవాళ్లు ఉన్నారు. సినిమా హిట్‌ కాబట్టి ఎవ్వరూ మాట్లాడలేదు. 
     
రాజేశ్‌గారూ.. మీ అబ్బాయి అచ్చం మీ నాన్నగారిలానే ఉన్నాడు...
రాజేశ్‌: మా ఆరవ్‌ని ఎక్కడికి తీసుకెళ్లినా ‘చిన్న ఈవీవీ’గారు అంటుంటారు. (చెమర్చిన కళ్లతో).

చిన్న ఈవీవీగారు అల్లరి చేస్తున్నారా?
నరేశ్‌: (నవ్వేస్తూ)... మా తర్వాతి జనరేషన్‌లో మా ఇంట్లో పుట్టిన ఫస్ట్‌ అబ్బాయి వాడు. అబ్బాయి అమ్మాయి అని కాదు కానీ ఫస్ట్‌ బేబీ కాబట్టి స్పెషల్‌. వాడు పుట్టినప్పటి నుంచి ‘ఈవీవీగారిలా ఉన్నాడు’ అని అందరూ అనడం వల్ల అమ్మ బాగా గారం చేస్తారు. అల్లరి చేసినా ఏమీ అనరు. ‘అమ్మా కోప్పడాలి. వెనకేసుకు రాకూడదు. తిట్టమ్మా’ అంటాం.

ఈవీవీగారు ఉన్నప్పుడే మీ పెళ్లి సెట్‌ అయింది కదా?
రాజేశ్‌: అవును. ఆయన ఉండగానే మాట్లాడాం. నా పెళ్లి చూడకపోయినా ఫలానా అమ్మాయిని చేసుకుంటున్నాడు అని ఆయనకు తెలుసు. కనీసం ఆ తృప్తి అయినా మిగిలింది.  
నరేశ్‌: రాజేశ్‌ ఎంగేజ్‌మెంట్‌ ఫిబ్రవరి 10న అనుకున్నాం. నాన్నగారు జనవరి 21న చనిపోయారు. 

పెళ్లి ఇలా చేయాలని మీ నాన్నగారు చెప్పారా? 
రాజేశ్‌: రాజమండ్రిలో మ్యారేజ్‌ అనుకున్నాం. పెళ్లి అక్కడ బంధువుల మధ్య చేసి, ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్, సన్నిహితుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేయాలన్నారు. నాన్నగారికి బంతి భోజనం అంటే ఇష్టం. ఆయన అనుకున్న మండపంలోనే, ఆయన చూసిన అమ్మాయినే, ఆయన ఎలా అయితే అనుకున్నారో అలానే నా పెళ్లి జరిగింది. 

ఈవీవీగారు ‘బెస్ట్‌ హోస్ట్‌’. అతిథులకు వడ్డించే వంటకాల విషయంలో కేర్‌ తీసుకునేవారు కదా? 
నరేశ్‌: మా నాన్నగారు ఏది చేసినా ఒక మార్క్‌ ఉండేలా చేస్తారు. ఈస్ట్‌ వెస్ట్‌లో ఫుడ్‌తో చంపేస్తారు. అందరూ విందులో స్వీట్స్, ఐస్‌క్రీమ్స్‌ పెడుతున్నారు కాబట్టి మనం జున్ను పెడదాం అని అది తయారు చేయించేవారు. అన్నయ్య పెళ్లికి నాన్నగారి స్థాయికి తగ్గట్టుగా విందు ఏర్పాటు చేయాలనుకున్నాం. పెళ్లికి 84 ఐటెమ్స్‌ పెట్టాం. ‘పిల్లలు కదా ఎలా చేస్తారో అనుకున్నాం. ఆయన పిల్లలనిపించుకున్నారు’ అని అందరూ అన్నారు. అంటే.. ఫుడ్‌లో కూడా మేం ఆయన పిల్లలు అనిపించుకోవాలంటే అది తెలియని బాధ్యత. అదొక హ్యాపీ ఫీలింగ్‌. 
     
మీ నాన్నగారి ఆత్మ శాంతంగా ఉండాలంటేæ మీ ఇద్దరూ ఎప్పటికీ కలిసుండాలి. పెళ్లయ్యాక మీ ఇద్దరూ ఎలా ఉంటున్నారు ? 
నరేశ్‌: అందరం హ్యాపీగా ఉన్నాం. 
రాజేశ్‌: నాన్నగారు అనుకున్నట్లుగానే ఒకే ఇంట్లో ఉంటున్నాం. మా ఆవిడ కడుపుతో ఉన్నప్పుడు నా మరదలు (నరేశ్‌ భార్య) బాగా చూసుకుంది. మా పిల్లలు కూడా చక్కగా ఉంటారు.

ఆస్తి విషయంలో ఏమైనా గొడవలు ఉన్నాయా? ఆ మధ్య ఏదో ఇష్యూ ఉందనే వార్త ఒకటి వచ్చింది? 
నరేశ్‌: అలాంటిది ఏదీ లేదండి. మా ఫాదర్‌ పేపర్స్‌ మీద ‘ఇది నాకు.. ఇది వాడికి’ అని ఎప్పుడూ పెట్టలేదండి. ఏది కొన్నా రెండు కొనేవారు. ఒకటి నరేశ్‌కి ఇంకోటి రాజేశ్‌కి అనేవారు. మా ఇంట్లో అందరికంటే స్ట్రాంగ్‌ మా అమ్మగారే. డబ్బులున్నప్పుడు, లేనప్పుడు ఒకేలా ఉన్నారు. నాన్నగారు పోయాక రాజేశ్‌ పెళ్లి అయిపోయింది. ‘వీడు లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంటాడేమో’ అని నా విషయంలో అమ్మ కంగారు పడేవారు. ‘లేదమ్మా నేను అరేంజ్డ్‌ మ్యారేజే చేసుకుంటా’ అని ఆవిడ చూసిన అమ్మాయినే చేసుకున్నాను. ఇంటికి వచ్చిన అమ్మాయిలు కూడా చక్కగా కలిసిపోయారు. పిల్లల్ని చూసినప్పుడల్లా నాన్నగారుంటే బావుణ్ణు అనిపిస్తుంటుంది. 
రాజేశ్‌ : మా మధ్య ఏవో గొడవలున్నాయనే వార్త నిజం కాదండీ. మేం ‘బోర్న్‌ విత్‌ గోల్డెన్‌ స్పూన్‌’ కాదు. మాకు కష్టాలు తెలుసు. నాన్నగారు సంపాదించి ఇచ్చినదాన్ని కాపాడుకోవాలి. అలాగే మేం ఇంకా సంపాదించాలి. మా తాతయ్య, నానమ్మ (ఈవీవీగారి తల్లిదండ్రులు) ఇద్దరూ ఉన్నారు. ఒకే డేట్‌కి ఒక సంవత్సరం నాన్నగారు, ఆ మరుసటి ఏడాది మా బాబాయి చనిపోయారు. నాన్నమ్మ, తాతయ్యలకు అది పెద్ద షాక్‌. కొడుకు చేతిలో కొరివి పెట్టించుకోవాలని అనుకుంటారు ఎవరైనా. నాన్న ఆత్మ శాంతంగా ఉండాలంటే ఆయన అనుకున్నట్టు చేస్తే సరిపోతుంది. ఆయన పేరెంట్స్‌ని బాగా చూసుకోవాలి. మేం బాగుండాలి. అలానే ఉంటున్నాం.
   
 కష్టాలు తెలుసు అన్నారు కదా. ఫర్‌ ఎగ్జాంపుల్‌?
రాజేశ్‌: మా 8, 9 క్లాసెస్‌ వరకూ కష్టాలుండేవి.
నరేశ్‌ : మీకో ఎగ్జాంపుల్‌ చెబుతాను. ‘చెవిలో పువ్వు’ ఫ్లాప్‌. సక్సెస్‌ వస్తే ఓకే కానీ ఫ్లాప్‌ అయితే చాలు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాలి. చిన్నప్పుడు మేం చెన్నైలోఉండేవాళ్లం. అక్కడ వడపళని టెంపుల్‌కి వెళ్లినప్పుడు మాకు ముంత కొనిచ్చారు. నేను, అన్నయ్య డబ్బులు దాచుకునేవాళ్లం. నాన్నగారికి టీ, కాఫీ తాగాక సిగరెట్‌ తాగకపోతే చిరాకుగా ఉండేది. ఓసారి ఆయన దగ్గర సిగరెట్లు కొనడానికి డబ్బుల్లేవు. హుండీ పగలకొట్టి సిగరెట్‌ తెచ్చాను. అవి కొనడం తప్పని తెలిసే వయసు కాదు నాది. నాన్న కోసం అది చేయాలనిపించింది. 20 రూపాయిలు అప్పు తీసుకున్న రోజులూ ఉన్నాయి.  
రాజేశ్‌: అప్పట్లో మేం ఉన్న ఇంటి అద్దె 550 రూపాయిలు. 2, 3 నెలలు కట్టకుండా ఉండేవాళ్లం. స్కూల్‌ ఫీజ్‌ కూడా కట్టలేని పరిస్థితులను చూశాం.
నరేశ్‌ : నాకు రాజేశ్‌ మీద కోపం ఉండేది. వాడి బర్త్‌డే ఫిబ్రవరి 14. కొత్త బట్టలు కొనేవారు. నాది జూన్‌ 30. సరిగ్గా స్కూల్‌ స్టార్ట్‌ అయ్యేది. నాలుగు జతల యూనిఫామ్‌లో ఒక దానికి పసుపు రాసి, బర్త్‌డే రోజు వేసుకోమనేవారు. క్లాస్‌లో 72 మంది ఫ్రెండ్స్‌ ఉంటే.. 25 చాక్లెట్స్‌ కొనిచ్చి, క్లోజ్‌గా ఉండేవాళ్లకు ఇవ్వమనేవారు. ఎవరెవరికి ఇవ్వాలో తెలియక నేనే తినేసేవాణ్ణి. 
     
ఈవీవీగారు రెడీ చేసిన స్క్రిప్ట్స్‌ ఏమైనా ఉన్నాయా?
నరేశ్‌: కొన్ని కథలు స్టేల్‌ అయ్యాయి. అవి అప్పటి సందర్భాలకు తగ్గట్టుగా రాసినవి. ఫర్‌ ఎగ్జాంపుల్‌ 2012లో ‘యుగాంతం’ అని వార్త వచ్చినప్పుడు, ‘కొంప కొల్లేరు’ అనే టైటిల్‌తో కథ అనుకున్నారు. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఆ కథ చెప్పారు. ‘2012 డిసెంబర్‌లో యుగాంతం అంటున్నారు కదా.. మనం నవంబర్‌లో ఈ సినిమా రిలీజ్‌ చేద్దాం’ అన్నారు. అయితే అనుకోకుండా 2011లో నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఆ కథతో సినిమా తీయలేం. ఇంకొన్ని ఇలానే స్టేల్‌ అయ్యాయి.
     
ఈవీవీగారు, చలపతిరావుగారు మంచి ఫ్రెండ్స్‌. మీ డాడీ మరణం ఆయన్ని కూడా కుంగదీసిందా?
నరేశ్‌: చలపతిరావుగారి లైఫ్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని నాన్నగారు ‘మా నాన్నకు పెళ్లి’ మూవీ స్టోరీ రాశారు. చలపతి బాబాయ్‌ మిసెస్‌ ఎప్పుడో చనిపోయారు. ‘తోడు ఉండాలి. మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు కదా’ అని నాన్నగారు బాబాయ్‌తో చాలాసార్లు అన్నారు. కానీ చేసుకోలేదు. నాన్న, బాబాయ్‌ల ఫ్రెండ్‌షిప్‌ జర్నీ దాదాపు 15 ఏళ్లు పైనే. ట్రూ ఫ్రెండ్‌షిప్‌ అంటే వాళ్లదే. చలపతి బాబాయ్‌ టీ, కాఫీ కూడా తాగరు. చాలామంది నాన్నగారు మందు తాగుతారనుకునేవాళ్లు. కానీ ఆయనకు అలవాటు లేదు. నాన్నగారిని ఆయన చాలా మిస్సవు తున్నారు. ‘ఆయన ఉండి ఉంటే బాగుండేది’ అంటుంటారు.
     
ఈ నెల 30న మీ బర్త్‌డే. మీ నాన్నగారు ఉన్నప్పుడు జరుపుకున్న బర్త్‌డేస్‌లో గుర్తుండిపోయినది?
నరేశ్‌:  ‘చిలక్కొట్టుడు’ షూటింగ్‌ అబ్రాడ్‌లో జరిగినప్పుడు 200 డాలర్లు పెట్టి పెద్ద కేక్‌ తెప్పించారు. సెట్‌లో ఫస్ట్‌ టైమ్‌ నేను సెలబ్రేట్‌ చేసుకున్న బర్త్‌డే అది. అక్కడ కేక్‌ కట్‌ చేయడం నాకు మంచి మెమరీ.
రాజేశ్‌: ‘హాయ్‌’ మూవీ షూటింగ్‌ దుబాయ్‌లో జరిగినప్పుడు నా బర్త్‌డే వచ్చింది. ‘రారా’ అని తీసుకెళ్లి ఒమేగా వాచ్‌ కొనిపెట్టారు. ఆ వాచ్‌ ఇప్పటికీ నా దగ్గర ఉంది. 
   
ఫైనల్లీ.. మీ నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్స్‌లో మీరు దాచుకున్నది?
నరేశ్‌: నాకు చాలా వాచ్‌లు కొనిపెట్టారు కానీ నేను ఇప్పటికీ వాడుతున్న గిఫ్ట్‌ నాన్న ఇచ్చిన ‘వ్యాలెట్‌’. ఒకసారి నేను పర్స్‌ కొనడానికి వెళితే, ‘నీ అంతట నువ్వు కొనుక్కునే కన్నా ఎవరైనా గిఫ్ట్‌గా ఇస్తే బాగుంటుంది’ అని పక్కన ఉన్నవాళ్లు అన్నారు. అప్పుడు నాన్న ‘నా వ్యాలెట్‌ తీసుకో. ఆ డబ్బులు నాకిచ్చెయ్‌’ అన్నారు (నవ్వులు). ఆ పర్స్‌ భద్రంగా ఉంది. మా ఇద్దరి షూ సైజ్‌ ఒకటే. నా షూస్‌ని ఆయన, ఆయనవి నేను వాడేవాళ్లం. అవి ‘నైస్‌ మూమెంట్స్‌’.
రాజేశ్‌: ఇందాక చెప్పినట్లు ఒమేగా వాచ్‌ నా దగ్గర ఎప్పటికీ ఉంటుంది. మెటీరియల్స్‌ గురించి వదిలేస్తే.. నాన్నగారితో గడిపిన ప్రతి క్షణం వ్యాల్యుబుల్‌. మాకు ఎన్నో మంచి మెమరీస్‌ని మిగిల్చారు.

మీ నాన్నగారు దూరమయ్యాక మీ ఇద్దరూ సినిమాలు తగ్గించేశారు. కారణం ఏంటి?
నరేశ్‌: ఏదైనా సక్సెస్‌ మీదే డిపెండ్‌ అయ్యుంటుంది. చాలా కష్టపడి ‘లడ్డూ బాబు’ చేశాను. ‘యాక్షన్‌ 3డీ’ చేశాం. సక్సెస్‌ అవ్వలేదు. రెగ్యులర్‌ కామెడీ సినిమాలు చేస్తే ఎప్పుడూ అవేనా అంటారు. ఇదివరకు వరుసగా మాకు రెండు ఫ్లాప్స్‌ వస్తే నాన్నగారు మాతో ఓ హిట్‌ సినిమా తీసేవారు. దాంతో బ్యాలెన్స్‌ అయిపోయేది. ఇప్పుడు ఆ అడ్వాంటేజ్‌ లేదు. ఇప్పటివరకూ రాజేశ్‌ది కానీ నాది కానీ ఒక్క సినిమా కూడా స్టార్ట్‌ అయ్యి, ఆగిపోయింది లేదు. ఇదివరకు కథ కొంచెం ఫర్లేదు అనిపించినా చేసేవాళ్లం. కానీ ఇప్పుడు కొంచెం డౌట్‌ ఉన్నా.. వద్దు అనేస్తున్నాం. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్‌ అనుకుంటున్నాం.
రాజేశ్‌: నాన్నగారు పోయిన తర్వాత కొంచెం గ్యాప్‌ తీసుకున్నాను. పెళ్లయిన తర్వాత ఇంకాస్త గ్యాప్‌ వచ్చింది. ఈ ఇయర్‌ నుంచి వరుసగా సినిమాలు చేస్తాను. ఓ వెబ్‌ సిరీస్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నాం.

ఏదైనా ఒక విషయంలో మీ నాన్నగారితో మీ ఇద్దరూ విడివిడిగా వాదించిన సందర్భాలేమైనా ఉన్నాయా?
రాజేశ్‌: ‘ఫిట్టింగ్‌ మాస్టర్‌’ సినిమా విషయంలో నాకు, డాడీకి వాదన జరిగింది. ‘ఇది మీ స్టైల్‌ సినిమా కాదు. మీకు సెట్‌ అవ్వదు’ అన్నాను. డాడీ వినలేదు. అప్పుడు గట్టిగా వాదించాను. అయినా తీశారు.
నరేశ్‌:  ‘ఆరుగురు పతివ్రతలు’ సినిమా అప్పుడు చాలా డిస్కషన్‌ జరిగింది. ఆ సినిమా ఇప్పుడు తీసుంటే కరెక్ట్‌  అని నా ఫీలింగ్‌. ఎంత వద్దన్నా ఆ సినిమా చేశారు. అంత కాన్ఫిడెంట్‌గా ఉండేవారు.
     
అప్పట్లో మీ ఇద్దరి కోసం చాలా సినిమాలు తీశారు. కొన్ని సినిమాలకు డబ్బులు పోయాయి కూడా...
నరేశ్‌: డబ్బులు గురించి నాన్నగారు ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయన చనిపోయాక మేం ‘ఈవీవీ సినిమా’ బేనర్‌ మీద ‘బందిపోటు’ సినిమా చేశాం. బేనర్‌కి మంచి వ్యాల్యూ ఉంది కాబట్టి సక్సెస్‌ఫుల్‌ మూవీయే చేయాలనుకున్నాం. మా దురదృష్టం.. హిట్‌ కాలేదు. డబ్బుకన్నా కూడా ఆ ఫ్లాప్‌ని మేం అవమానంగా భావించాం. హిట్టయితే ‘ఈవీవీ పిల్లలు ఆయన బేనర్‌ మీద మంచి హిట్‌ సినిమా తీశారు’ అని చెప్పుకునేవాళ్లు. అది మిస్సయినందుకు బాధగా అనిపించింది.
రాజేశ్‌: ఆ విషయంలో చాలా బాధపడ్డాం. మళ్లీ మా బేనర్‌ మీద సినిమా ప్లాన్‌ చేస్తున్నాం. 
– డి.జి. భవాని

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top