ధర్మనిరతి అంటే అది! | There is a large pool in the forest There are eczema flowers | Sakshi
Sakshi News home page

ధర్మనిరతి అంటే అది!

Mar 10 2019 1:24 AM | Updated on Mar 10 2019 1:24 AM

There is a large pool in the forest There are eczema flowers - Sakshi

పూర్వం కాశీరాజ్యంలోని ఒక అడవిలో ధర్మనిరతుడు అనే భిక్షువు ఉండేవాడు. ఆ అడవిలో ఒక పెద్ద కొలను ఉంది. దాన్నిండా తామరపూలు. లేత పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. ఆ సరోవరం దాపునే ధర్మనిరతుని నివాసం. ఆ సరోవరానికి ఒక కాపలాదారు ఉన్నాడు. ఒకరోజున ఉదయాన్నే ధర్మనిరతుడు లేచి కొలనులో స్నానం చేసి, గాలి వాలుకు పోయి నిలబడ్డాడు. పూలపరిమళాలు పీలుస్తూ తన్మయుడవుతున్నాడు. అంతలో  అతన్ని కాపలాదారు ‘‘స్వామీ! దొంగతనం తప్పా? ఒప్పా?’’ అడిగాడు. ‘‘నాయనా! దొంగతనమే కాదు, ఒకరు ఇవ్వకుండా మనది కానిది ఏది తీసుకున్నా తప్పే. అదీ దొంగతనం కిందే లెక్క’’ అన్నాడు చిరునవ్వుతో. ‘‘అయితే... మీరు దొంగే!’’ అన్నాడు కాపలాదారు.  ‘‘నేనా? నేనేమీ దొంగిలించలేదే’’ అన్నాడు భిక్షువు. ‘‘ఇదిగో... ఈ పూలపరిమళాలు ఆఘ్రాణించారు కదా! ఇది గంధచౌర్యమే కదా.

తమరు నా కొలనులోని సువాసనల్ని దొంగిలించినట్లే కదా’’ అన్నాడు. భిక్షువు అతనితో అలా మాట్లాడుతూ ఉండగానే, కొలను ఆవలిగట్టున ఒక వ్యక్తి వచ్చి కొలనులో దిగి కొన్ని తామరపూలు తెంపుకుని వెళ్లిపోయాడు. అతణ్ణి కాపలాదారు చూశాడు. కానీ, అతణ్ణి ఏమీ అనలేదు. కనీసం కేకవేసి మందలించలేదు. అప్పుడు భిక్షువు– ‘‘బాగుందయ్యా! వాసన చూసిన నన్ను తప్పుపట్టావు. పూలు తెంపుకుపోతున్న వాణ్ణి పన్నెత్తి చూడలేదు’’అని అడిగాడు. ‘‘స్వామీ! అతను లోభి. ధూర్తుడు. అజ్ఞాని. కానీ, తమరు జ్ఞానులు. ప్రబోధకులు. స్వచ్ఛమైన కర్మలు ఆచరించేవారు. దోషం ఎంచలేని దొడ్డవారు. అతను పెద్ద తప్పు చేసినా చిన్నగానే కనిపిస్తుంది. మీలాంటివారు కంట్లో నలుసంత తప్పు చేసినా కారుమేఘమంతగా అందరికీ కనిపిస్తుంది కదా!’’ అన్నాడు. భిక్షువు మౌనం వహించాడు. ధార్మికులు జీవితంలో ఎంత జాగరూకులై ఉండాలో బుద్ధుడు చెప్పిన సందేశాత్మక కథ ఇది. 
 – డా. బొర్రా గోవర్ధన్‌

మీకు తెలుసా

►కుటుంబసభ్యుల మధ్య వున్న విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి... అందరూ కలిసి మెలిసి సత్సంబంధాలుగా ఏర్పడేందుకు ‘విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాల’ ను నిత్యం పారాయణం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజూ పఠిస్తే.. ఏ సమస్యలు తలెత్తవు. అన్ని పనులలో విజయాలను సాధిస్తారు.

►లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ని నిత్యం పారాయణం చేస్తే మంచి సద్గుణాలతో కలిగినవారు వివాహ సంబంధాలు తీసుకువస్తారు. అలాగే పెళ్లి పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరుగుతాయి.

►సంతానం లేని వారు ప్రతిరోజు ‘గోపాల స్తోత్రం’ ను పఠిస్తే.. మంచి ఫలితం లభిస్తుందని... అలాగే గర్భిణులు ఇదే స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే ప్రసవం సుఖంగా అవుతుందని పండితులు, పురోహితులు శాస్త్రాల ఆధారంగా చెబుతున్నారు. 

►గరికను నగదు ఉంచే ప్రదేశంలో పెడితే, రావలసిన నగదు త్వరగా వచ్చేస్తుంది.

►శనీశ్వరుడిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలిననాటి శని, అష్టమ శని దోషాలు తొలగిపోతాయి.

►గరికను దారంతో కట్టి గణపతికి మాల వేస్తే కోరికలు నెరవేరుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement