ఇది చరిత్రాత్మక విజయమన్న విజయ్ తండ్రి చంద్రశేఖర్
తండ్రిగా తనకు చాలా సంతోషంగా ఉందంటూ భావోద్వేగం
విజయ్ ఇంటికి నటి త్రిష
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తమిళగ వెట్రి కజగం (టీవీకే) దూసుకుపోతున్న నేపథ్యంలో విజయ్ తండ్రి చంద్రశేఖర్, తల్లి శోభతోపాటు ఇతర కుటుంబ సభ్యులు ఇంట్లో విజిల్ ఊదుతూ ఆనందాన్ని పంచుకున్నారు. ఇంట్లో సందడి చేస్తూ చక్కర్లు కొట్టారు. చంద్రశేఖర్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఇది చారిత్రక విజయమంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఒక తండ్రిగా నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది.
ఇంతకంటే ఇంకేం కావాలి?‘అని చంద్రశేఖర్ పేర్కొన్నారు. విజయ్ రాష్ట్ర ప్రజల ఆశయాలు నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. ‘తాను ముఖ్యమంత్రి కావాలని విజయ్ రెండేళ్ల క్రితమే నాతో చెప్పాడు. దానికి తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో ఎంతో కష్టపడ్డాడు. నాకంటే నా భార్య (శోభ) చాలా సంతోషంగా ఉంది‘అని తెలిపారు.
విజయ్ ఎప్పుడూ అచంచలమైన విశ్వాసంతో ఉండేవాడని, విజయమే మనది అనే నినాదమే అతని తారక మంత్రంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. విజయ్‌ను తమిళనాడు ప్రజలు తమ కుటుంబంలో ఒకరిగా చూస్తున్నారని,. ఎన్నో వ్యతిరేకతలు, పరీక్షలను ఎదుర్కొని విజయ్ ఈ స్థాయికి చేరుకున్నాడని కొనియాడారు. ‘ఇది సాధారణ విజయం కాదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా, ఒంటరిగా పోటీ చేసి ఇంతటి విజయాన్ని అందుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం‘అని పేర్కొన్నారు.
20 ఏళ్ల ప్రణాళిక..
తన కొడుకు రాజకీయ ప్రయాణంపై చంద్రశేఖర్ హర్షం వ్యక్తంచేశారు. విజయ్ సినిమా నుంచి ప్రజాజీవితంలోకి రావడంపై స్పందిస్తూ.. ఇదేదో అనుకోకుండా తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టంచేశారు. దీని వెనుక 20 ఏళ్ల ప్రణాళిక ఉందని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించి విజయ్‌కు కొన్ని పెద్దపెద్ద కలలున్నాయన్నారు. తాను టీవీకే సభ్యుడిగా విజయ్‌ను తన నాయకుడిగా భావిస్తానని అంటూనే.. ఒక తండ్రిగా తన పాత్రకు, పార్టీ వ్యూహాత్మక కార్యకలాపాలకు మధ్య తేడాను స్పష్టంగా పాటించారు. కాగా, విజయ్ నీలాంకరై నివాసానికి నటి త్రిష చేరుకోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని త్రిషా నేరుగా విజయ్ ఇంటికి వెళ్లడం గమనార్హం.


