ఒంటికి పట్టేస్తుంది

There are many precious nutrients in pistachio - Sakshi

హెల్దీ ఫుడ్‌ 

పైన పెంకుతో లోపల నట్‌తో చాలా వైవిధ్యం కనిపించే పిస్తాలో ఎన్నెన్నో విలువైన పోషకాలు ఉన్నాయి. వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా విశిష్టమైనవి. వాటిలో ఇవి కొన్ని. పిస్తాలో క్యాలరీలు చాలా ఎక్కువ. కాబట్టి పరిమితంగా తీసుకున్నా సరే... పిస్తా వల్ల లభించే శక్తి చాలా ఎక్కువ.  ప్రోటీన్లు, కొవ్వులు ఎక్కువ. కానీ పిస్తాలో లభ్యమయ్యే కొవ్వు ఆరోగ్యకరమైన కొవ్వు కావడం వల్ల దాని గురించి అంతగా బెంగ అక్కర్లేదు. అలాగని మరీ ఎక్కువగా కాకుండా కాస్త పరిమితంగా తినడమే మంచిది. పిస్తాలో ప్రోటీన్లతో పాటు.. వాటిని సరిగా జీర్ణమయ్యేలా చేసి, ఒంటికి ప్రోటీన్లు పట్టేలా చేసే విటమిన్‌–బి6 కూడా ఎక్కువే.  ఇందులో పీచు కూడా అధికం. అందువల్ల పిస్తా వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరగడమే కాకుండా, పేగుల్లో ఆహారం సాఫీగా ముందుకు జరుగుతుంది. పిస్తాలోని పీచు కారణంగా మలబద్దకం సమస్య కూడా నివారితమవుతుంది. 
     
ఇందులో విటమిన్‌ బి–కాంప్లెక్స్, విటమిన్‌–సి ఉన్నాయి. వీటి కారణంగా అవి చాలా రకాల వ్యాధుల నుంచి మనల్ని రక్షించేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని ఇస్తాయి. పిస్తాలో విటమిన్‌–ఈ కూడా ఎక్కువే. దీనివల్ల పురుషుల్లో వ్యంధ్యత్వాన్ని నిరో«ధించడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. అంతేగాక... చర్మాన్ని నిగారించేలా చేయడం, దీర్ఘకాలం పాటు యౌవనంగా ఉంచేలా చూడటంతో పాటు వృద్ధాప్యాన్ని వీలైనంతగా వెనక్కునెడుతూ... ఆలస్యమయ్యేలా చూడటానికీ పిస్తా బాగా తోడ్పడుతుంది.  పిస్తాలో పొటాషియమ్‌ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తనాళాల్లో రక్తం సాఫీగా ప్రసరించేలా చూడటంతో పాటు గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.     పిస్తాలో ఫాస్ఫరస్, క్యాల్షియమ్‌ కూడా ఎక్కువే అయినందున ఇది ఎముకలను  ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది. మెగ్నీషియమ్, ఇతర ఖనిజలవణాలు మెండుగా ఉన్నందున మెదడు, వెంట్రుకలు, చర్మం ఆరోగ్యానికి పిస్తా ఎంతగానో తోడ్పడుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top