ఆలయ దీపాలు | The temple lights | Sakshi
Sakshi News home page

ఆలయ దీపాలు

Feb 18 2016 11:00 PM | Updated on Sep 3 2017 5:54 PM

ఆలయ దీపాలు

ఆలయ దీపాలు

భక్తికి కూడా స్త్రీ, పురుష భేదం ఉంటుందా? ఉంటుంది. లేకుంటే ఆలయాల నిర్వహణ పురుషుల చేతుల్లోనే ఎందుకు ఉంటుంది?

భక్తికి కూడా స్త్రీ, పురుష భేదం ఉంటుందా? ఉంటుంది. లేకుంటే ఆలయాల నిర్వహణ పురుషుల చేతుల్లోనే ఎందుకు ఉంటుంది? అవకాశం రావాలేగాని స్త్రీలూ అంత సమర్థంగానే గుళ్లు నిర్వహించగలరు. గోపురాలు నిర్మించగలరు. దేవుని పాదాలను తమ కరస్పర్శతో తేజోమయం చేయగలరు. సింగుపాలేనికి పదండి. స్త్రీలందరూ కలిసి ఒక గుడికి తెచ్చిన పూర్వవైభవాన్ని చూడండి. ఆలయంలో దీపాలు వెలగటం ఆనవాయితీ. స్త్రీల సంకల్పమే ఒక దీపమై వెలగడం మాత్రం... స్ఫూర్తి... దీప్తి.. ప్రశస్తి.
 
శని శింగణాపూర్ వివాదం.. హాజీ హలీ విజయం.. దేవ్‌బంద్‌లో మహిళా ఖాజీల నియామకం... దేశంలోని మహిళా శక్తికి నిదర్శనాలు. ఇప్పుడు ఆ వరుసలో ఆంధ్రప్రదేశ్‌లోని సింగుపాలెం స్థానం సంపాదించింది. అయితే సింగుపాలెం మహిళలది హక్కుల పోరాటం కాదు.. బాధ్యతల గెలుపు! కారణం వాళ్లకు అక్కడ నిబంధనలు, నిషేధాలు లేవు. అలక్ష్యం కనిపించింది. దాని మీద శ్రద్ధ పెట్టడమే లక్ష్యంగా మలచుకున్నారు. సాధించారు కూడా!
 
వివరాల్లోకి వెళితే..
గుంటూరు జిల్లాలోని రేపల్లె మండలం సింగుపాలెం గ్రామం. 240 ఇళ్లతో పచ్చని ప్రకృతి గూటిలో ఒదిగినట్టు ఉంటుంది. 856 మంది జనాభా. ప్రతి ఊరికి ఉన్నట్టే ఆ ఊరికీ ఓ బడి, గుడీ ఉన్నాయి. అయితే ఈ ఊళ్లో బడి కన్నా గుడికి విశేషం ఉంది. ఇప్పుడీ కథనం దాని
గురించే!
 
వందేళ్ల చరిత్ర
సింగుపాలెంలోని శ్రీసీతారామస్వామి దేవాలయాన్ని 1901లో నిర్మించారు. అంటే దాదాపు 116 ఏళ్ల చరిత్ర అన్నమాట. ఆ ఆలయానికి ఇరవై ఒక్క ఎకరాల భూమి కూడా ఉంది. పాత కట్టడమవడం వల్ల క్రమక్రమంగా శిథిలమవుతూ వచ్చింది. దానికున్న భూమిలోని ఆదాయమూ తగ్గింది. ఆ 21 ఎకరాల్లో ఆరు ఎకరాల భూమిని ఆ ఊళ్లోని రజకులు, నాయీబ్రాహ్మణులు సాగు చేసుకుంటున్నారు. మిగిలిన పదిహేను ఎకరాల సేద్యంతో వచ్చిన ఆదాయమే గుడి, పూజారి ఆలనాపాలనకు ఆధారం. ఈ రాబడి అరకొరగా ఉండడంతో గుడి సంరక్షణ, పూజారి జీతభత్యాలకు సరిపోని పరిస్థితి ఏర్పడింది. దేవాలయ ఆవరణలో ఏళ్ల కిందట కట్టించిన పూజారి నివాసగృహం కూడా శిథిలావస్థకు చేరుకొని అందులో తలదాచుకోలేని దుస్థితి వచ్చింది. గుడి ప్రాంగణం, గర్భగుడిలోని నాపరాళ్లు పగిలిపోయి దెబ్బతిన్నాయి. ఊళ్లోని వాళ్లంతా చూస్తున్నా ఎవరూ దీని మరమ్మతుల మీద శ్రద్ధ పెట్టలేదు. పైగా ఆలయానికి వస్తున్న ఆదాయం పూజారి జీత భత్యాలకే సరిపోవడంలేదు. ఈ క్రమంలో గుడిబాగు కోసం అధికారులను అడగడం, మోతుబరుల సాయం అడిగినా పని ముందుకు సాగకపోవడంతో బీటలువారుతున్న గుడి పునఃనిర్మాణం జోలికి ఎవరూ వెళ్లలేదు.

వివరాలు.. విరాళాలు
ముందు ఊళ్లోని 240 ఇళ్లలోని కుటుంబాల వివరాలను సేకరించారు. ప్రతి ఇంటికి వెళ్లి తలుపుతట్టారు. గుడి పునర్నిర్మాణానికి ఆర్థిక చేయూతనివ్వాల్సిందిగా అడిగారు. ఊళ్లోని వాళ్లందరికీ గుడి పరిస్థితి తెలిసిందే కాబట్టి ఎవరూ కాదు, కుదరదు అని చెప్పలేదు. చేతనైనంత విరాళం ఇచ్చారు. అలా ప్రతి ఇంటికీ వెళ్లి సహాయం అర్థించడమే కాక వాళ్ల బంధువుల వివరాలూ సేకరించి వారినీ ఈ గొప్ప కార్యంలో భాగస్వామ్యం పంచుకోవాల్సిందిగా కోరారు. ఊరు, ఊళ్లోని వాళ్ల బంధువులందరి సహాయం కలిపినా నిర్మాణం పూర్తికాదని భావించి చుట్టుపక్కల ఊళ్లు, తమ ఊళ్ల నుంచి వెళ్లిన ప్రవాస ఆంధ్రుల వివరాలనూ తీసుకొని వాళ్లందరి సహాయాన్నీ అర్థించారు. పెద్ద మనసుతో అందరూ డబ్బు అందించారు. అలా మొత్తం పది లక్షల రూపాయలు పోగయ్యాయి.
 
కొత్త శోభ
పదిలక్షల రూపాయల ఖర్చుకి ఓ పద్దు రాసుకున్నారు. ప్రణాళిక వేసుకున్నారు. దాని ప్రకారమే ఖర్చుపెట్ట సాగారు. ముందుగా బీటలు వారిన దేవాలయ గోడలు, పగుళ్లొచ్చిన పైకప్పును మరమ్మత్తు చేయించారు. దేవాలయ ప్రాంగణం, గర్భగుడిలో పగిలిపోయిన ఫ్లోరింగ్ తీసేయించి కొత్త ఫ్లోరింగ్ చేయించారు. గుడికి రంగులు వేయించారు. కొత్తగా కరెంట్ కనెక్షన్ పెట్టించారు. ఆలయమంతా విద్యుత్ దీపాలను అలంకరించి గుడికి కొత్త శోభను తెచ్చారు. అలాగే జీర్ణావస్థలో ఉన్న పూజారి క్వార్టర్‌నూ పూర్తిగా బాగుచేయించి సున్నాలు వేయించి పూజారి కుటుంబాన్ని గృహప్రవేశం చేయించారు. ఇలా వీళ్లు చేసిన ఈ పనులకు ఊరంతా ఒక్కటై మద్దతుగా నిలిచింది.
 
ఆలయ కమిటీ సభ్యులు
ఊళ్లోని దేవాలయ పునర్నిర్మాణాన్ని,  దాని వృద్ధిని తమ బాధ్యతగా భావించి ఈ మహిళలు అకుంఠిత దీక్షతో ముందుకు సాగిన తీరు సింగుపాలెం పొలిమేర దాటి రేపల్లె, గుంటూరుకు చేరింది. ఉన్నతాధికారుల దృష్టికీ వెళ్లి  ఆంధ్రప్రదేశ్‌లో ఓ కొత్త ప్రతిపాదనకు నాంది అయింది. ఊళ్లో గుడి పునరుద్ధరణను తమ కర్తవ్యంగా భావించి చేసిన మహిళల కృషికి తగు గౌరవం ఇవ్వాలనుకున్నారు. భక్త సమాజంలో ఉంటేనే ఇంత చేయగలిగిన వారు ఏకంగా దేవాలయ పాలకమండలిలో ఉంటే మరింత మేలు చేయగలరు కదా అని ఆలోచించారు. సింగుపాలెం శ్రీసీతారామస్వామి దేవాలయ పునర్నిర్మాణానికి నడుం బిగించిన ఈ మహిళామణులను ఆలయపాలక కమిటీ సభ్యులుగా నియమించాలనే ప్రతిపాదనను స్థానిక ఎమ్మెల్యేకు పంపించారు. ఎమ్మెల్యే అనుమతి దొరికింది. ఇంకేం గుడి నిర్మాణపనుల్లో చురుకుగా ఉన్న ఆరుగురు స్త్రీలను ఆలయ కమిటీ పాలకమండలి సభ్యులను చేసేశారు.
 
ఏకాభిప్రాయం..
మొన్న బుధవారమే ఆ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎంపిక చర్చకు వచ్చింది. దానికి ఎన్నికలు ఎందుకు? ఏకగ్రీవంగా ఎన్నుకుందామని చర్చించుకొని చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక విషయంలో క్షణాల్లో ఏకాభ్రియానికి వచ్చారు వాళ్లు. అలా సజ్జా విశాలాక్ష్మిని చైర్మన్‌గా, కొల్లి జయశ్రీని వైస్ చైర్‌పర్సన్‌గా ఎంపికచేసుకున్నారు. పాలక కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌గా ఎంపికవడాన్ని కొత్త బాధ్యతగా భావిస్తున్నారు విశాలాక్ష్మి, జయశ్రీలు. కేవలం గుడి సంరక్షణే కాకుండా ఆలయం వేదికగా సంక్షేమ కార్యక్రమాలను చేపడతాం అంటున్నారు. అలా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ మహిళలు ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. పాలక కమిటీ సభ్యులుగా ఉన్నారు సరే మరి అర్చకులుగా కూడా మహిళలను నియమించాలనే ఆలోచనలో మీరు ఉన్నారా అని విశాలాక్ష్మిని అడిగితే ‘మహిళలు, పురుషులు సమానమైనప్పటికీ దేహ నిర్మాణం అన్ని పనులకు పురుషులను ఆమోదిస్తూ కొన్ని పనులకు మాత్రమే స్త్రీలను పరిమితం చేసింది. అలాంటి వాటిలో అర్చక విధి కూడా ఒకటి. నాకు తెలిసినంత వరకు స్త్రీకి శారీరక పరిమితులు ఉన్నాయి కాబట్టి మన పూర్వీకుల నుంచి కూడా వాళ్లు ఈ అర్చక వృత్తికి దూరంగా ఉన్నారనుకుంటున్నాను. కాబట్టి ప్రస్తుతం మేం  ఆలయ అభివృద్ధి, దాని ఆధారంగా గ్రామ ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేపట్టడం పైనే దృష్టికేంద్రీకరించాలనుకుంటున్నాం’ అన్నారు.
 
జానకీ భక్త సమాజం
 దేవాలయం పునరుద్ధరణకు ముందు నుంచే ఊళ్లో ‘జానకీ భక్తసమాజం’ అని ఓ భక్తమండలి ఉంది. ఈ రోజు ఈ గుడి గురించి ఈ కథనం రాసుకుంటున్నామంటే ఆ భక్తమండలే కారణం. ఇందులో స్త్రీలు పెద్దసంఖ్యలో ఉన్నారు! ప్రతి రోజూ సాయంకాలం గుడికి చేరి నాలుగు మంచి మాటలు మాట్లాడుకొని రామ కీర్తనలు ఆలపించే వీరికి గుడి పరిస్థితి కలత పెట్టసాగింది. ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గుడి ఇలాగే కూలిపోతుందేమోనన్న బెంగ వెంటాడసాగింది. గుడిని పునఃనిర్మించుకోవాలని వాళ్లలో వాళ్లే చాలాసార్లు సమావేశాలూ ఏర్పాటు చేసుకున్నారు. కాని ఎలా ముందుకు వెళ్లాలి... సమాలోచనలు జరిగాయి. అంతకుముందు ఊరిపెద్దలు చేసిన ప్రయత్నాలనూ విశ్లేషించుకున్నారు. కృతనిశ్చయంతో సజ్జా విశాలాక్ష్మి అనే భక్తురాలి సారథ్యంలో ఆ మహిళలంతా అడుగు ముందుకేశారు.
 
మరిన్ని మంచి కార్యక్రమాల్లో..
సజ్జా విశాలాక్ష్మి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించటంతో ఆమె వెంట నడిచి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములుగా మారాం. ముందుముందు మరిన్ని మంచి కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకుంటాం.
 - కొల్లి జయశ్రీ, ట్రస్ట్ బోర్డు వైస్ చైర్మన్
 
ఐకమత్యమే ఈ అవకాశాన్నిచ్చింది
భద్రాచలం తరువాత నలువైపులా గాలిగోపురాలు ఉన్న దేవాలయంగా మా గుడికి పేరుంది. అటువంటి విశిష్టత కలిగిన దేవాలయ అభివృద్ధిలో మహిళలు ఐకమత్యంగా భాగస్వాములు కావటం విశేషం. అందుకే మహిళా కమిటీ వచ్చిందని భావిస్తున్నా.
 - సజ్జా అపర్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యురాలు
 
కీలకపాత్ర

మహిళల కృషి అభినందనీయం. ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారికి ప్రభుత్వం, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మంచి గౌరవాన్ని కల్పిస్తూ రాష్ట్రంలో తొలిసారిగా మహిళా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయటం అభినందనీయం.
 - దివి లక్ష్మణాచార్యులు, ఆలయ అర్చకులు

చరిత్రలో నిలిచిపోతారు
దేవాదాయ శాఖలో తొలిసారిగా మహిళా ట్రస్ట్‌బోర్డును ఏర్పాటు చేయడం, అది ఈ గ్రామ మహిళలకు దక్కడం చరిత్రలో నిలిచిపోయే అంశం. రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధితో పాటు గ్రామాభివృద్ధిలోనూ వారు భాగస్వాములు కావాలనుకుంటున్నాను.
 - యార్లగడ్డ ప్రేమాజీ, గ్రామ సర్పంచ్

 - గడ్డం వాసు, సాక్షి, రేపల్లె
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement