ఊపిరి పోస్తారా... | Thanked breath ... | Sakshi
Sakshi News home page

ఊపిరి పోస్తారా...

Nov 13 2015 11:18 PM | Updated on Sep 3 2017 12:26 PM

ఊపిరి పోస్తారా...

ఊపిరి పోస్తారా...

కొండ గాలికి రెపరెపలాడుతున్న దీపాన్ని అరచేతులు అడ్డం పెట్టి కాపాడుకున్నట్టు..

జీవితం బుడగలాంటిది అంటారు ఆ బుడగ లేకపోతే ఈయనకు జీవితమే లేదు భార్య, నాయనమ్మలే ఉఛ్వాసనిశ్వాసాలు. ఇన్నాళ్లూ ఇద్దరిలో ఎవరో ఒకరు ఊపిరి పోస్తూ ఉండకపోతేఇవ్వాళ మనకు ఈ అవకాశం ఉండేది కాదు. మానవత్వానికి ఊపిరి పోసే అవకాశం ఉండేది కాదు.
 
కొండ గాలికి రెపరెపలాడుతున్న దీపాన్ని అరచేతులు అడ్డం పెట్టి కాపాడుకున్నట్టు... తను కునుకు తీస్తే భర్త ఊపిరి ఆగిపోతుందేమో అని కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ కన్నార్పకుండా చూసుకుంటోంది. ఊపిరి సలపనివ్వని సమస్యలతో పోరాడుతూ కట్టుకున్నవాడి ప్రాణం నిలపడానికి ప్రతిక్షణం ఆరాటపడుతోంది. ఆదమరచినా, నిద్ర లేమితో కునుకు తీసినా భర్త ప్రాణాలు దక్కవన్న భయంతో క్షణమొక యుగంలా కాలం వెళ్లదీస్తోంది. జీవితంపై విరక్తిచెంది పసిబిడ్డలా కన్నీరుపెట్టే భర్తను ఓదారుస్తూ... బతుకు మీద ఆశలు కల్పిస్తోంది. భర్త ఆరోగ్యం కోసం ఉన్న ఆస్తులన్నీ ఒక్కొక్కటీ అమ్మేసి చేతిలో చిల్లి గవ్వలేక, కడుపున పుట్టిన బిడ్డను అర్ధాకలితో ఉంచలేక కుమిలిపోతూ బతుకుపోరాటం చేస్తున్న ఈవిడ చేజెర్ల కవిత.

 ఆనందం వెంటే విషాదం...
 గుంటూరు జిల్లా నర్సరావుపేట పట్టణానికి చెందిన చేజర్ల శంకర్ ఆర్‌ఎంపీ డాక్టర్. పదకొండేళ్లక్రితం కవితతో పెళైంది. తర్వాతి రెండేళ్లకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఆ ఇంట ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కుమారుడి బారసాలకు బంధువులు, స్నేహితులందర్నీ ఆహ్వానించాడు శంకర్. ఫంక్షన్ ఘనంగా జరిగింది. వేడుకకు వచ్చిన అతిథులంతా దంపతులను చిరకాలం ఆనందంగా జీవించమని దీవించారు. అయితే, ఆ తర్వాత రోజే శంకర్ మంచం పట్టాడు. బారసాల పనుల్లో తీవ్ర ఒత్తిడికి గురైన శంకర్ మరుసటి రోజున ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కాళ్లూ చేతులు చచ్చుబడ్డాయి. ఊపిరి అందడం కష్టమైంది. వెంటనే అతన్ని గుంటూరులోని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. రెండు రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు... అరుదుగా కనిపించే ‘మైలైటిస్’ వ్యాధిగా తేల్చి చెప్పారు. వాయునాళాలు కుచించుకుపోయి, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోవడం ఈ వ్యాధి లక్షణం. దీని గురించి వైద్యులు చెప్పగానే నిర్ఘాంతపోయిన శంకర్ కుటుంబీకులు తమకున్న కొద్దిపాటి ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టారు. దాని ద్వారా వచ్చిన 15 లక్షల రూపాయలతో ఆపరేషన్ చేయించారు. అయినా జబ్బు నయం కాలేదు. మెరుగైన వైద్యం చేయించాలంటే ఇంకో పాతికలక్షలైనా ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పారు. ఆర్థిక స్తోమత లేక శంకర్‌ను ఇంటికి తీసుకొచ్చారు.

 ఇరవై నాలుగు గంటలూ...
 శంకర్‌కు 24 గంటలూ ఆక్సిజన్ అందిస్తూ ఉండాలి. ఇందుకోసం వెంటిలేటర్ సదుపాయం ఎప్పుడూ ఉండాలి. ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేసుకుని ఆదమరవకుండా ప్రాణవాయువు అందిస్తుండాలి. శంకర్ దుస్థితి చూసిన కొందరు దాతలు రూ.50 వేల వరకూ సాయం చేశారు. ఆ డబ్బుతో కృత్రిమ వెంటిలేటర్ పరికరాలను కొనుగోలు చేసిన కవిత భర్త పక్కనే కూర్చుని బెలూన్‌ను ఒత్తుతూ అతనికి శ్వాస నందిస్తోంది. అంతేకాదు అతనికి ఇవ్వాల్సిన ఆహారం, మలమూత్ర విసర్జన అన్నీ... మంచమ్మీదే. తొమ్మిదేళ్లుగా ఇదే పరిస్థితి. ఆమె కాసేపు ఆ మంచం దగ్గర నుంచి బయటకు వెళ్లాలన్నా కొడుకును కూర్చోబెట్టి వెళుతుంది. కుటుంబ పరిస్థితి ఏమాత్రం బాగోలేకపోవడంతో తొమ్మిదేళ్ల కుమారుడిని స్కూల్‌కి కూడా పంపించడం లేదు. భర్తకు ఆక్సిజన్‌ను అందించడం కోసం తను ఊపిరిని తీసుకోవడం మర్చిపోతూ అతని సేవలోనే మునిగిపోయింది కవిత.

 వెంటాడుతున్న ఆర్థిక భారం...
 శంకర్‌కు సొంతిల్లు గానీ, సొంత పొలం గానీ లేవు. కూడబెట్టుకున్న డబ్బంతా ఖర్చయిపోయింది. సంపాదించే వారు లేక, చేతిలో చిల్లిగవ్వ లేక ఇల్లు గడవడమే కష్టమైంది. మూడేళ్ల కిందటి వరకూ ఆదుకున్న శంకర్ తండ్రి వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆర్థిక బాధలు ఇంకా ఎక్కువయ్యాయి. అవసరమైనప్పుడు ఐదు రూపాయలిచ్చే నాథుడు కరువై కవిత నానా కష్టాలు పడుతున్నారు. రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులూ లేవు. శంకర్ నాయన మ్మ వరలక్ష్మమ్మకు వచ్చే వృద్ధాప్య పింఛను సొమ్ముతోనే ఇప్పుడు వీరిల్లు గడుస్తోంది.
 - గంగిశెట్టి వేణుగోపాల్, స్టేట్‌బ్యూరో, విజయవాడ
 ఫొటోలు: వి. రూబెన్ బెసాలియల్
 
 నేను పోయాక ఏం చేస్తారో ..!
 ముసలోళ్లకిచ్చే ఫించను కింద నెలకు రూ.1000 లు వస్తాయి. ఆ డబ్బులతో ఇంట్లోకి కావల్సిన పప్పూ ఉప్పూ కొనుక్కుంటున్నాం. కొంత మంది దాతలు బియ్యం, కూరగాయలు ఇస్తుంటారు. నేను ఎన్నాళ్లు బతుకుతానో తెలియదు. నేను పోయాక ఆ కాస్త డబ్బులు కూడా రావు. ఆపైన ఇల్లు ఎలా నెట్టుకొస్తుందో... (కళ్లనీళ్లు పెట్టుకుటూ)
 - వరలక్ష్మమ్మ,
  శంకర్ నాయనమ్మ
 
 ఆయనతోనే జీవితం...
 పెళ్లై అత్తవారింటికి వచ్చాక, నాకు ఎలాంటి కష్టం తెలియకుండా ఇంట్లో కూర్చోబెట్టి అన్నీ సమకూర్చారు నా భర్త. ఈయనే నా ప్రాణమనుకున్నాను. అలాంటిది ఈయనకే ప్రాణం మీదకు వస్తే ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఏదైనా పని చూసుకుందామన్నా రాత్రింబవళ్లూ ఈయన పక్కనే కూర్చుని గాలినందిస్తుండాలి. ఒకవేళ నాకు ఆరోగ్యం బాగోకపోతే ఎవరో ఒకర్ని కూర్చోబెట్టాలి. స్నానానికి వెళ్లాలన్నా, వంట చేయాలన్నా ఎవరో ఒకరు ఈయన దగ్గరుండాల్సిందే. ఏ నాటికైనా ఈయన తిరిగి లేస్తాడన్న ఆశతోనే బతుకుతున్నా.
 - కవిత, చేజర్ల శంకర్ భార్య
 
 తొమ్మిదేళ్లుగా ఇదే పరిస్థితి. భర్తని క్షణంసేపైనా వదిలివెళ్లడానికి లేదు. వెంటిలేటర్  బుడగను ఒత్తీ ఒత్తీ అలసిపోతే, ఆ బాధ్యతను భర్త నాయనమ్మకు ఇచ్చి ఇలా సోలిపోతుంది కవిత. వెంటిలేటర్ ఆగిన క్షణమే భర్త ఊపిరి ఆగిపోతుందన్న భయంతో క్షణమొక యుగంలా ఈమె గడుపుతోంది.
 
 సాయం అందించేవారు
ఫోన్ నెం: 9160033240లో సంప్రదించగలరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement