
శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ సంచలన వ్యాఖ్యలు
శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నియోజకవర్గంలో నలభై వేల బోగస్ ఓట్లు ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం సాయంత్రం బూత్ కమిటీ సభ్యులు, పార్టీ కమిటీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నియోజకవర్గంలో 2.72 లక్షల ఓట్లు ఉన్నప్పటికీ వాటిలో దాదాపు 30 వేల నుంచి 40వేల వరకు బోగస్ ఓట్లు ఉంటాయని, వాటిని త్వరలోనే తొలగిస్తారని చెప్పారు.
అవన్నీ పట్టించుకోకుండా బూత్ పరిధిలోని 60–70 శాతం ఓటర్లను కలవాలన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యల ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ‘తొలి అడుగు’లో ఎవ్వరూ చురుగ్గా పాల్గొనడంలేదని, ఇప్పటివరకు 35 వేల కుటుంబాలను మాత్రమే కలిశామని, మొత్తం 90 వేలు కుటుంబాలను కలవాల్సి ఉందని ఎమ్మెల్యే శంకర్ చెప్పారు.