నడకతో ఆ ముప్పుకు చెక్‌..

Stroke Victims Who Regularly Took Walks Twice As Likely To Suffer Milder Attacks - Sakshi

లండన్‌ : రోజూ అరగంట పాటు నడిస్తే అనారోగ్యం దరిచేరదని ఇప్పటికే పలు అథ్యయనాలు స్పష్టం చేయగా, నిత్యం వాకింగ్‌తో స్ర్టోక్‌, గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. గతంలో స్ర్టోక్‌ బారిన పడినవారు రోజూ 35 నిమిషాలు నడిస్తే తదుపరి భారీ స్ర్టోక్‌ ముప్పును తప్పించుకోవచ్చని ఈ అథ్యయనంలో గుర్తించామని స్వీడన్‌కు చెందిన గొతెన్‌బర్గ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కథారినా సనర్‌హెగెన్‌ చెప్పారు.

శారీరక చురుకుదనం మెదడు పనితీరును కాపాడుతుందని తమ పరిశోధనలో తేలిందని చెప్పుకొచ్చారు. సగటున 73 సంవత్సరాల వయసు కలిగి గతంలో స్ర్టోక్‌కు గురైన 925 మంది వృద్ధులపై జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయన్నారు. తేలికపాటి, ఒక మాదిరి సంక్లిష్ట వ్యాయామాలు చేసే వారితో పోలిస్తే చురుకుదనం లోపించిన వారిలో స్ర్టోక్‌ ముప్పు రెట్టింపుగా ఉందని అథ్యయనంలో వెల్లడైంది.

వారంలో చేసే చిన్నపాటి శారీరక కదలికలు సైతం తర్వాతి కాలంలో స్ర్టోక్‌ తీవ్రతను తగ్గించేలా పెనుప్రభావం చూపుతాయని తమ పరిశోధనలో తేలిం‍దని ప్రొఫెసర్‌ సనర్‌హెగెన్‌ వెల్లడించారు. తాజా అథ్యయన వివరాలు జర్నల్‌ న్యూరాలజీలో ప్రచురితమయ్యాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top