సరయు : డాన్స్‌, ఫైట్స్‌, ఆర్ట్స్‌

Special Story On Girl Sarayu Performed Different Arts - Sakshi

స్త్రీ శక్తి 

ఆ బాలిక కుంచె పట్టుకుంటే  ‘చిత్రమై’న అనుభూతినిచ్చే సూర్యోదయం ఆవిష్కృతమవుతుంది. గజ్జె కట్టుకుంటే సంప్రదాయం ఘల్లు మంటుంది. యాహూ అని కేక పెట్టిందంటే ఈవ్‌ టీజర్లకు వణుకుపుడుతుంది. జన్మతః అమెరికా వాసి అయినా సనాతన భారతీయ కళలపై తరగని ఇష్టంతో పాటు నవతరం అభిరుచులకు తగ్గట్టుగా చిత్రకళ, మార్షల్‌ ఆర్ట్స్‌... ఇలా సకల కళల్లోనూ రాణిస్తోంది సరయు. అంతేకాదు... ఎంతగా  కళలపై ఆసక్తి పెంచుకుంటే అంతగా ఇటు చదువులోనూ మంచి ఫలితాలు వస్తాయంటోంది. 

‘‘ఆధ్యాత్మిక భావాలు, చారిత్రక మూలాలు తెలిపే నాట్యం ఓ వైపు మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చింది.  మరోవైపు  చదువులోనూ రాణించేందుకు ఉపకరించింది’’అని చెప్పింది సరయు (15). సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులైన  తల్లిదండ్రులు విజయ్, గీతల ఇద్దరు సంతానంలో ఒకరైన సరయు... అమెరికాలో ఉంటున్న భారతీయ చిన్నారుల సంప్రదాయ అభిరుచులకు నిదర్శనం

కరాటే కిక్‌ కొట్టినా.. కాళ్లకు గజ్జకట్టినా...
‘‘ఎంత నాట్యం నేర్చుకోవాలనుకున్నా కాలిఫోర్నియాలో శిక్షకుకులు దొరకడం కష్టంగా మారింది. అయినా పట్టు వదలకుండా ఉన్న నన్ను చూసి అమ్మా నాన్నలు ఎలాగోలా నాట్య గురువును పట్టుకున్నారు’’ అంటూ చెప్పింది సరయు. పద్యాలకు అర్ధమే తెలియని ఐదేళ్ల వయసులో ప్రారంభమైన ఆమె నాట్యాభ్యాసం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఎన్నో బృంద ప్రదర్శనల్లో పాల్గొన్న ఆమె... ఈనెల 20న బెంగుళూర్‌లో సోలో ప్రదర్శన ద్వారా ఆరంగేట్రం చేయాలనుకుంటోంది.

మరోవైపు కరాటేలో కూడా సరయు ప్రతిభ చాటుతోంది. సెకండ్‌ డిగ్రీ బ్లాక్‌ బెల్ట్‌ను స్వంతం చేసుకుంది.  నాట్యం సెల్ఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌కైతే.. మార్షల్‌ ఆర్ట్స్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌కి అంటుందీ బాలిక. తెలుగు, ఇంగ్లీషు భాషలతో పాటు  స్పానిష్‌ భాష కూడా ప్రావీణ్యం సంపాదించింది. చిత్రకళలోనూ రాణిస్తూ అనేక బహుమతులు అందుకుంటోంది. తాను గీసిన చిత్రాలను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వడం విశేషం. బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, టెన్నిస్‌ క్రీడల్లోనూ ప్రవేశమున్న సరయు... ఇదంతా కూడా చదువే అంటుంది.

డెర్మటాలజిస్ట్‌ కావాలని..!
ఒత్తిడితో కూడిన సంక్లిష్టమైన ఇంటర్నేషనల్‌ బ్యాక్కల్యూరేట్‌ (ఐబి) కరిక్యులమ్‌కీ, తన సకల కళాభ్యాసానికి మధ్య ఆమె విజయవంతంగా బ్యాలెన్స్‌ చేసుకుంది. గత మే నెలలో ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నుంచి తన గ్రేడ్‌ టెన్‌ ఐబి  పూర్తి చేసుకుంది. డెర్మటాలజిస్ట్‌ కావాలనేది ఆమె లక్ష్యం. తనను తాను మాత్రమే కాకుండా తన సంస్కృతీ సంప్రదాయాలను కూడా ఇతరులకు తెలియజెప్పడంలో నాట్యం ఒక ప్రధాన మార్గం అంటుంది. 
– ఎస్‌.సత్యబాబు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top