వేధింపులపై చిందు ఎత్తిన చైతన్యం

Special Story About Suresh And Sabrina Francis - Sakshi

ఓ కాలేజీ అమ్మాయిని కొందరు టీజ్‌ చేస్తున్నారు. అమ్మాయి బెదిరిపోతున్న కొద్దీ మరింత రెచ్చిపోతున్నారు. చూడగానే తెలిసిపోయే డైరెక్ట్‌ అటాక్‌ అది. ఆఫీస్‌లోని ఓ మేల్‌ కొలీగ్‌ హుందాగా.. చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నట్టే కనిపిస్తాడు. కానీ... ప్రతి మాట, ప్రతి చేష్ట వెనకాల హెరాస్‌మెంటే. నిరూపించలేని పరోక్ష దాడి. ఈ డైరెక్ట్‌ అటాక్‌లనూ, ఇన్‌డైరెక్ట్‌ వేధింపులనూ ఎలా ఎదుర్కోవాలో రంగస్థలం సాక్షిగా ప్రదర్శిస్తున్నారు ఇద్దరు కళాకారులు. ‘ఫోరమ్‌ థియేటర్‌’, ‘ప్లే బ్యాక్‌ థియేటర్‌’తో యువతలో  చైతన్యాన్ని ‘చిందు’ ఎత్తిస్తున్న సబ్రీనా ఫ్రాన్సిస్, సురేష్‌లది మంచి ప్రయత్నం.

హైదరాబాద్‌... గాంధీ మెడికల్‌ కాలేజ్‌ ఆవరణ..
ఒక అమ్మాయిని కొంతమంది అబ్బాయిలు  వెంటాడుతున్నారు.. వేధిస్తున్నారు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. పాపం ఆ అమ్మాయి ఎదిరించలేక ఏడుస్తోంది. ఆమె నిస్సహాయత ఆ అబ్బాయిలు మరింత రెచ్చిపోయేలా చేసింది. ఇదంతా గమనిస్తూన్న ఓ గుంపులోంచి ఒక విద్యార్థిని ‘నువ్వు రియాక్ట్‌ కావాలి’ అంటూ ముందుకొచ్చింది. ‘ఎలా రియాక్ట్‌ కావాలో మీరు చూపించండి మరి’ అడిగారు ఎవరో. అంతే ఆ అమ్మాయి ఆ రౌడీమూక ను చేరి వాళ్ల చేష్టలను నిలువరించే ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ ఆకతాయిలు కూడా ఎక్కడా తగ్గకుండా ప్రతివ్యూహాలు పన్నుతూ ఇబ్బంది పెడ్తున్నారు. కాసేపటికి ఇంకో అమ్మాయి వచ్చింది గుంపులోంచి.. తనదైన పద్ధతిలో ఆ అబ్బాయిల ఆట కట్టించేందుకు. ఇలా ఓ గంట గడిచింది. తర్వాత ప్రశంసలు. ఆ పరిస్థితికి తగ్గట్టుగా తమను తాము రక్షించుకున్న ఆ అమ్మాయిల సమయస్ఫూర్తికి... ధైర్యానికి.. తెగువకు. అవును.. ఇది నాటకమే. ఈ విధానాన్ని ‘ఫోరమ్‌ థియేటర్‌’ అంటారు.

ఒక కాన్ఫరెన్స్‌ రూమ్‌... పాతికమంది వరకూ ఉన్నారు. నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఒక ఉద్యోగిని తను అనుభవించిన వెతను వెళ్లబోసుకుంటోంది. ‘నేను సింగిల్‌ ఉమన్‌ను. పెళ్లయిన యేడాదిలోపే విడాకులయ్యాయి. నన్ను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొనే స్వాతంత్య్రం కాని, ఆర్థిక స్థోమత కానీ అమ్మానాన్నకు లేవు. దాంతో నా చదువుకి తగ్గ ఉద్యోగాన్ని వెదుక్కుని హైదరాబాద్‌ వచ్చాను. నా సీనియర్‌తో హెరాస్‌మెంట్‌ ఎదుర్కొంటున్నాను’ అని ఆగిపోయింది ఆమె. ‘జాయినై ఆఫీస్‌లోకి ఎంటర్‌ అవగానే’ అంటూ మళ్లీ మొదలుపెట్టింది.. ‘ముందు నా కాళ్లు చూశారు.. తర్వాత మెడ. మేల్‌ కొలీగ్స్‌ దగ్గర్నుంచి హయ్యర్‌ ఆఫీషియల్స్‌(పురుషులు)వరకు. దాన్నిబట్టి నా మ్యారిటల్‌ స్టేటస్‌ అంచనావేయడం.. మ్యారేజ్‌ కాలేదని తెలిసాక దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవడం. అందులో నా సీనియర్‌ సిద్ధహస్తుడు.

అది ఎలా ఉంటుందంటే దాన్ని వేధింపు అని నేను రుజువు చేయలేను. అలాగని భరించనూ లేను. అతని తీరును గమనించిన ఎవరికైనా అది నా పట్ల కన్‌సర్న్‌గా.. గౌరవంగానే కనిపిస్తుంది. కాని సదరు మనిషి వ్యక్తిగతంగా నాతో మాట్లాడేటప్పుడు, నా పని గురించి అతనితో చర్చించాల్సి వచ్చినప్పుడు మాత్రమే అతని వెకిలితనాన్ని బయటపెడ్తాడు. దీనివల్ల నేను ఫ్రస్టేట్‌ అయిపోయి అరిస్తే నన్నో గయ్యాళిగా.. మర్యాద తెలియని మనిషిలా ఎస్టాబ్లిష్‌ చేస్తాడు. ఈ సమస్యను ఎవరితో చెప్పుకున్నా నమ్మని పరిస్థితిని క్రియేట్‌ చేశాడు. భరించలేకపోతున్నా. ఆత్మహత్య ఆలోచనదాకా కూడా వెళ్లా’ అంటూ రెండుచేతుల్లో మొహం దాచుకొని ఏడ్చేసింది ఆమె. అంతలోనే ఆడ, మగ కలిపి పదిమందిదాక ఉన్న ఓ బృందం పోడియం దగ్గరకు చేరింది. ఆ అమ్మాయి పంచుకున్న విషయాలతో అప్పటికప్పుడు నాటకాన్ని అల్లి ప్రదర్శించడం మొదలుపెట్టారు. తాము విన్న దంతా అలా కళ్లకు కడుతుంటే ఆ సమావేశంలో ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఆ నాటకాన్ని పది రకాల పరిష్కారాలతో ఎండ్‌ చేశారు. ఇదే ‘ప్లే బ్యాక్‌ థియేటర్‌ ’ విధానం. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది. ప్రసిద్ధికెక్కుతోంది.

‘ఫోరమ్‌ థియేటర్‌’, ‘ప్లే బ్యాక్‌ థియేటర్‌’ ఈ రెండు విధానాల ద్వారా మహిళల్లో ఆత్మస్థయిర్యం, ఆత్మరక్షణా మెలకువలను బోధిస్తున్నారు.. సబ్రీనా ఫ్రాన్సిస్, సురేష్‌లు తమ గ్రూప్‌లోని దివ్యశ్రీ, తదితర కళాకారులతో కలిసి.  ఫోరమ్‌ థియేటర్‌లో ప్రేక్షకులను భాగస్వామ్యం చేస్తే, ప్లే బ్యాక్‌ థియేటర్‌లో ప్రేక్షకులు మనసు విప్పి మాట్లాడే అవకాశాన్ని కల్పించి.. వాళ్ల బాధకు నాటకరూపమిచ్చి వాళ్లే పరిష్కారం వెదుక్కునేలా చేస్తున్నారు. ‘తమకు జరిగింది బయటకు చెప్పుకుంటే చులకనగా చూస్తారని, తల్లిదండ్రులకు చెబితే చదువు మాన్పిస్తారేమోనని, భర్తకు చెబితే ఉద్యోగం వద్దంటాడేమోననే భయంతో వ్యథను అణచుకుని క్షోభననుభవిస్తుంటారు.

రేప్‌కి కారణం అమ్మాయి వస్త్రధారణను, ప్రవర్తనను తప్పు పట్టే .. వ్యాఖ్యలు చేసే దుస్థితిలో ఉన్నాం. అలాంటి వాళ్లకు ఊరటే కాదు.. జీవితాన్ని నెగ్గే మెలకువలను నేర్పించే మాధ్యమం ఫోరమ్‌ థియేటర్, ప్లే బ్యాక్‌ థియేటర్‌’ అని చెప్పడమే కాదు నిరూపిస్తున్నారు కూడా సబ్రీనా, సురేష్‌లు. వేధింపులు, వివక్ష, హింసను ఎదుర్కోవడంలో మహిళలను చైతన్యపరిచినట్టే  అబ్బాయిలు, తల్లిదండ్రుల్లోనూ జెండర్‌ ఈక్వాలిటీ పట్ల స్పృహను పెంచుతున్నారు ఈ రెండు నాటక ప్రక్రియలతోనే.  గ్రామాలు, పట్టణాలు, స్కూళ్లు, కాలేజీలు, కార్యలయాలు ఇలా ఎక్కడైనా ప్రభుత్వ సిబ్బంది, ప్రైవేట్‌ యాజమాన్యాల పిలుపు మేరకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తున్నారు. ‘దీనివల్ల బెరుకు, భయం పోయి పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా స్పందించాలో తెలుస్తుంది. తమను తాము కాపాడుకోవడమే కాదు ఇతరులనూ రక్షించే ధైర్యం వస్తుంది’’ అని వివరిస్తారు సబ్రీనా, సురేష్‌లు. వాళ్లు నేర్చుకున్న, శిక్షణ పొందిన ఈ థియేటర్‌ ప్రక్రియలను ఇలా జెండర్‌ సమస్యలను వెలుగులోకి తేవడానికే ఉపయోగిస్తున్నారు.

షీటీమ్స్‌తో కలిసి.. 
గత మూడేళ్లుగా తెలంగాణ షీటీమ్స్‌తో కలిసి పనిచేస్తున్నారు. అందులో భాగమే హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్‌ కాలేజ్‌ ప్రదర్శన. షీ టీమ్స్‌ సారథ్యంలో  కాలేజ్‌లు, హాస్టల్స్‌లో ఫోరమ్‌ థియేటర్‌ మెథడ్‌లో అమ్మాయిలు సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఆత్మరక్షణా  నైపుణ్యాన్ని  పెంచుకునేలా చేస్తున్నారు.  దీంతోపాటు  పిల్లలు, మహిళల రక్షణ, సాధికారత మీద   ఆడియో ఆల్బమ్‌లు, డాక్యుమెంటరీలు, షార్ట్‌ఫిల్మ్స్‌ తీస్తున్నారు. ఇవన్నీ కూడా ‘చిందు’ అనే సాంస్కృతిక వ్యక్తిత్వ వికాస కేంద్రం కింద చేస్తున్నారు. దీన్ని ఇరవై ఏళ్ల కిందట స్థాపించారు వీళ్లు. సబ్రీనా, సురేష్‌ ఇద్దరూ కళాకారులే. డాన్స్, సంగీతం, డ్రామా.. ఈ మూడింటిలో నిపుణులు.

ఒక వర్క్‌షాప్‌లో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఇద్దరి అభిరుచులు, లక్ష్యాలు ఒకటే అని అర్థమయ్యాక కలిసి పనిచేస్తే బాగుంటుందని ‘చిందు’ను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈశాన్య రాష్ట్రాలు సహా దేశమంతా ప్రదర్శనలిస్తుంటారు. విదేశీ వేదికల మీదా వీళ్ల ప్రతిభకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్లే బ్యాక్‌ థియేటర్‌లో పట్టభద్రులైన ఈ ఇద్దరు డ్రామా థెరపి, సైకోడ్రామా, థియేటర్‌ అప్రెస్డ్‌ అనే విధానల్లోనూ శిక్షణ పొందారు. అంతేకాదు యూకేలోని టావిస్టాక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌  హ్యూమన్‌ రిలేషన్స్‌లోనూ ట్రైనింగ్‌ తీసుకున్నారు. జెండర్‌ సమస్యలు, జెండర్‌ స్పృహకు సంబంధించి వీరి కళాసహాయం కావాలనుకునే వారు ఈ నంబర్‌లో సంప్రదించవచ్చు.. 9849091717.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top