ఈ తరం, ఈ చైతన్యం కావాలి | Special Story About Eshvi From Hyderabad | Sakshi
Sakshi News home page

ఈ తరం, ఈ చైతన్యం కావాలి

Jul 4 2020 2:51 AM | Updated on Jul 4 2020 2:51 AM

Special Story About Eshvi From Hyderabad - Sakshi

మార్కులు, ర్యాంకుల పరుగులో ఉన్న యువత సమాజ మార్పు గురించి ఆలోచిస్తున్నదా? సామాజిక చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నదా? పాలనా విధానాలలో పాలు పంచుకుని వాటిని ప్రభావితం చేసేలా ముందుకు వస్తున్నదా? అలా ముందుకు వచ్చే యువతను ఎంపిక చేసే ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమం ‘యంగ్‌ లీడర్స్‌ ఫర్‌ యాక్టివ్‌ సిటిజన్‌షిప్‌’ (వై.ఎల్‌.సి.ఏ)కు తెలుగు తేజం, హైదరాబాద్‌ విద్యార్థిని ఇష్వి మథాయి ఎంపిక కావడం ప్రశంసకు కారణమవుతోంది. ఈ ప్రోగ్రామ్‌కు శశి థరూర్‌ (పార్లమెంట్‌ సభ్యులు), బైజయంత్‌ పండా (మాజీ పార్లమెంట్‌ సభ్యులు), ప్రొ. మైఖేల్‌ వాల్టన్‌ (హార్వర్డ్‌ యూనివర్సిటీ) సలహాదారులుగా ఉంటారు.

హైదరాబాద్‌లోని బాచుపల్లి ఓక్రిడ్జ్‌లో క్లాస్‌ 11 చదువుతున్న ఇష్వి చదువులో టాపర్‌గా నిలవడమే కాక స్విమ్మింగ్‌లో జాతీయస్థాయి ప్రతిభ చూపుతోంది. తాజాగా ఆమె వై.ఎల్‌.సి.ఏ ప్రోగ్రామ్‌కు ఎంపికైంది. లాక్‌డౌన్‌ సమయంలో ఆమె ప్రదర్శించిన సామాజిక చైతన్యం, ప్రతిస్పందనకు ఈ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల ప్రధాన నగరాల నుంచి విద్యార్థినీ విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌లో ఎంపిక కోసం పాల్గొనగా అనేక అంచెల వడపోతల తర్వాత ఇష్వికి ఈ గౌరవం దక్కింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించాక ఇష్వి వలస కార్మికుల సహాయానికి తన వంతు ప్రయత్నం చేయాలనుకుంది. అందుకు తనకు ప్రావీణ్యం ఉన్న బేకింగ్‌ను ఒక మార్గంగా ఎంచుకుంది. తాను చేసిన బేకింగ్‌ ఉత్పత్తులతో తన రెసిడెన్షియల్‌ కమ్యూనిటీలో నిధులు సేకరించింది. వాటిని వలస కార్మికులకు ఆహార పదార్థాలు అందించడానికి, వాకింగ్‌ కిట్‌లకు, వైద్య సహాయానికి వినియోగించింది.

అయితే వై.ఎల్‌.సి.ఏ ప్రోగ్రామ్‌ నిర్వాహకులకు ఇష్విలో ఆకర్షించిన అంశం ఆమె తన బేకింగ్‌ ఉత్పత్తులను సామాజిక సందేశానికి కూడా ఉపయోగించడం. ఇటీవలి ‘బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌’ ఉద్యమానికి మద్దతుగా ఆ సందేశాన్ని ఇమిడ్చిన బేకింగ్‌ ఉత్పత్తులను ఇష్వి చేయడం నిర్వాహకులు ప్రశంసనీయంగా భావించారు. వై.ఎల్‌.సి.ఏ ప్రోగ్రామ్‌ రెండు నెలల పాటు సాగుతుంది. ఈ ప్రోగ్రామ్‌లో అలవర్చుకోవాల్సిన దృష్టికోణం గురించి, సామాజిక–రాజకీయ నిర్మాణం పట్ల ఉండవలసిన విమర్శనాలోచన గురించి, నాయకత్వ శక్తిని సమకూర్చుకోవడం గురించి, సామర్థ్యాలు దీర్ఘకాలం నిలిచేలా నైపుణ్యాలు పెంచుకోవడం గురించి దర్శనీయత ఇస్తారు. ఇంత విశేష కార్యక్రమంలో స్థానం పొందడం ఇష్వి ప్రతిభకు ఒక మెచ్చుతునక.
ఇష్వి ద్వారా సహాయం పొందుతున్న వలస కార్మికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement