మధ్యతరగతి మందహాసి బాసూదా

Special Story About Basu Chatterjee - Sakshi

నివాళి/ బాసూ చటర్జీ

‘ఏ జీవన్‌ హై ఇస్‌ జీవన్‌ కా
యహీహై యహీహై యహీహై
రంగ్‌ రూప్‌’...

‘పియా కా ఘర్‌’ (1972)లోని పాట అది. బాసూ చటర్జీకి దర్శకుడిగా రెండోసినిమా. ఆ సినిమాకు ఆయన ఎంచుకున్న కథ– ముంబైలోని ఇరుకు ఇళ్లలో ఉమ్మడి కుటుంబంగా బతకక తప్పని పరిస్థితుల్లో ఒక నవ వధువు–వరుడు ఏకాంతం కోసం పరితపించడం. పల్లెల్లో పట్టణాల్లో ఉన్నవారికి ‘ఇది ఒక సమస్య’ అనిపించవచ్చు. కాని నగరంలోని మధ్యతరగతికి, దిగువ మధ్యతరగతికి ఏకాంతం అనేది ఎంత విలువైన, అపురూపమైన విషయమో ‘పియా కా ఘర్‌’లో బాసూ చటర్జీ చూపించాడు. అందుకే ఆ సినిమా విడుదలయ్యాక ఈ దేశంలో ఉన్న ఉత్తమ దర్శకుల జాబితాలో ఆయన కూడా ఉండదగ్గవాడుగా నిర్థారించబడ్డాడు.

డెబ్బయ్యవ దశకంలో ‘మిడిల్‌ ఆఫ్‌ ది రోడ్‌ సినిమా’గా చెప్పుకున్న చిన్న, మధ్య తరగతి సినిమాలను హృషికేశ్‌ ముఖర్జీ, బాసూ చటర్జీ, బాసూ భట్టాచార్యలు కలిసి నిలబెట్టారు. ‘లార్జర్‌ దేన్‌ ది లైఫ్‌’గా చెప్పుకునే వినోద, భారీ, కల్పిత కథల నడుమ నమ్మదగ్గ, చూడదగ్గ, తమను తాము ప్రేక్షకులు పోల్చుకోదగ్గ సినిమాలు తీయడంలో బాసూ చటర్జీ కట్టుబడి ఉన్నాడు.

‘నేను బైస్కిల్‌ థీవ్స్‌కు, పథేర్‌ పాంచాలి సినిమాలకు ప్రభావితమైనవాణ్ణి’ అని ఆయన చెప్పుకున్నాడు. తండ్రి రైల్వే ఉద్యోగం రీత్యా ఉత్తరప్రదేశ్‌ లోని మధురలో బాల్యం గడిపిన బాసూ చటర్జీ ఆ ఊరి నుంచే వచ్చిన గీత రచయిత శైలేంద్రకు మిత్రుడు కావడం వల్ల శైలేంద్ర నిర్మాతగా తీసిన సినిమా ‘తీస్రీ కసమ్‌’కు సహాయ దర్శకుడిగా పని చేయడం వల్ల సినిమాల్లోకి వచ్చాడు. బాసూ చటర్జీ తొలి సినిమా ‘సారా ఆకాశ్‌’ (1969) విమర్శకుల మన్ననలు పొందింది. ఆ తర్వాత తీసిన ‘రజనీగంధ’ (1974), ‘చిత్‌చోర్‌’ (1976), ‘ఛోటీసి బాత్‌’ (1976) ఆయనను హిందీ సినిమాలలో గౌరవించి తీరాల్సిన పేరుగా మార్చాయి. ముంబైలో బ్యాంక్‌ క్లర్క్‌గా పని చేస్తూ నాటకాలు వేస్తున్న అమోల్‌ పాలేకర్‌ను బాసూ చటర్జీ ‘రజనీగంధ’తో హీరోగా మార్చాడు. అతనితో వరుస హిట్‌లు ఇచ్చాడు. ‘చిత్‌చోర్‌’ సూపర్‌ హిట్‌ కావడమే కాదు, సంగీత దర్శకుడిగా రవీంద్రజైన్‌ను నిలబెట్టింది. గాయకుడిగా హిందీలో ఈ సినిమాతో ఏసుదాస్‌కు దారి కల్పించినవాడు బాసూ చటర్జీ. ‘చిత్‌చోర్‌’లోని ‘గోరి తేరా గావ్‌ బడా ప్యారా’ ఇప్పటికీ ఒక పసందైన పాట. హీరోయిన్‌ విద్యా సిన్హాను బాసూ చటర్జీనే పరిచయం చేశాడు.

బాసూ చటర్జీ సినిమాల్లోకి రాకముందు ‘బ్లిట్జ్‌’ పత్రికలో కార్టూనిస్ట్‌గా పని చేశాడు. మధ్యతరగతి జీవితం అనుభవించాడు. అందుకే ఆయన ఆ జీవితాన్ని తేలికపాటి హాస్యంతో చెప్పడం నేర్చుకున్నాడు. ఎన్ని కష్టాలు ఉన్నా మధ్యతరగతి వారు తమ జీవితాల మీద తామే జోక్స్‌ వేసుకొని నవ్వుకుంటారు. అలా లేకపోతే వారు చచ్చిపోతారు. ఆ కోణాన్ని బాసూ పట్టుకోవడంతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఒక హీరో వందమందిని కొడుతున్నప్పుడు ప్రేమించిన అమ్మాయికి ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి కిందా మీదా అయిపోయే పిరికి హిరోని ఆయన ‘ఛోటీ సి బాత్‌’లో చూపి ప్రేక్షకులను మందస్మితం చేశాడు. ‘పర్సనాల్టీ డెవలప్‌మెంట్‌’ గురించి ఆ రోజుల్లోనే ఆ సినిమాలో మాట్లాడాడాయన. ‘ఖట్టా మీఠా’ (1978), ‘దిల్లగీ’ (1978), ‘బాతో బాతోమే’ (1979), ‘షౌకీన్‌’ (1982) ఇవన్నీ మధ్యతరగతి మనుషుల ఎత్తుపల్లాలు, చిట్టి సరదాలు, టీ కప్పులో తుఫాన్లు. ‘చమేలీ కి షాదీ’ (1986) ఆయన చివరి హిట్‌ సినిమా.

బాసూ చటర్జీ కేవలం ఈ సినిమాలు మాత్రమే తీయలేదు. గంభీరమైన వస్తువును చర్చించే ‘ఏక్‌ రుకా హువా ఫైసలా’, ‘కమలా కి మౌత్‌’ కూడా ఉన్నాయి. దూరదర్శన్‌ కోసం ఆయన తీసిన ‘రజనీ’ సీరియల్‌ అందులో యాక్ట్‌ చేసిన ప్రియా టెండూల్కర్‌ను చాలా పాపులర్‌ చేసింది. ‘సినిమా విజయాన్ని కలెక్షన్లు రాబట్టడంతో పోల్చి లెక్కేస్తుంటారు చాలామంది. కాని ఒక సినిమా ఎన్ని హృదయాలకు ఎంత ఆనందం పంచింది, ఎలాంటి అనుభూతితో నింపింది కూడా విజయానికి కొలమానం కావాలి’ అంటాడాయన. ఆ విధంగా చూసినప్పుడు ఆయన సినిమాలు అనుభూతుల బాక్సాఫీసు దగ్గర ఘన విజయాన్ని సాధించాయని చెప్పాలి. నిరాడంబరత, మాట పొదుపు, పాదాలను ఎప్పుడూ నేలన తాటించి ఉండటం వంటి సుగుణాలను పాటిస్తూ వచ్చిన బాసూ చటర్జీ ఒక ఘనమైన సినిమా సందర్భానికి చివరి ప్రతినిధిగా వీడ్కోలు తీసుకున్నాడు. నేర్చుకోవాలనుకునే వారికి ఆయన ప్రతి సినిమా ఒక గురుపీఠం. ఈ నివాళిని ఆయన ‘ఖట్టా మీఠా’లోని సుందరమైన పాటతో ముగిద్దాం. థోడా హై థోడే కి జరూరత్‌ హై 
– కె

తుది వీడ్కోలు
సుప్రసిద్ధ దర్శకుడు, స్క్రీన్‌ ప్లే రచయిత, నిర్మాత బాసూ చటర్జీ (90) గురువారం ముంబైలో కన్నుమూశాడు. ఆయన అంత్యక్రియలు అదే రోజు మధ్యాహ్నం శాంతాక్రజ్‌ క్రిమెటోరియంలో ముగిశాయి. వయసు సంబంధిత సమస్యల వల్ల ఆయన మరణించినట్టు ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టివి డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ట్విటర్‌ ద్వారా తెలియచేసింది. బాసూ చటర్జీకి ఇద్దరు కుమార్తెలు. వారిలో రూపాలి గుహ దర్శకురాలిగా సినీ రంగంలో పని చేస్తోంది. ఇండస్ట్రీ ప్రేమగా ‘బాసూ దా’ అని పిలుచుకునే బాసూ చటర్జీ మృతి పట్ల పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా  బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో పని చేసిన నటులు అమితాబ్‌ (మంజిల్‌), అనిల్‌ కపూర్‌ (చమేలీకి షాది) కూడా ట్విటర్‌ వేదికగా తమ నివాళి అర్పించారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top