న్యూస్‌ రీడర్‌ నుంచి సీరియల్‌ నటిగా! 

Special Interview With TV Serial Actress Siri  - Sakshi

సీ'రియల్‌'

‘టీవీలో యాంకరింగ్‌ చేశాను. న్యూస్‌రీడర్‌గా పనిచేశాను. ఇప్పుడు సినిమాలు, సీరియల్స్‌లో వర్క్‌ చేస్తున్నాను.నటిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా ముందున్న లక్ష్యం’ అంటున్న సీరియల్‌ నటి సిరి చెబుతున్న ముచ్చట్లివి.

‘‘మాది వైజాగ్‌. పుట్టి పెరిగింది అక్కడే. డిగ్రీ తర్వాత హైదరాబాద్‌కి వచ్చేశాను. అమ్మ, నేను, అన్నయ్య.. ఇదీ మా కుటుంబం. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడంతో అమ్మ చిన్న కిరాణా షాపు పెట్టి, అలా వచ్చిన ఆదాయంతో మమ్మల్ని పెంచింది. ఇప్పుడు ఎంబీయే చేస్తూనే సీరియల్స్‌లో నటిస్తున్నాను. సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్నాను. అన్నయ్య ఫొటోగ్రఫీ వర్క్‌ చేస్తున్నాడు. మా బలం అమ్మనే.

అగ్నిసాక్షి
ఇప్పటి వరకు మూడు సినిమాలలో  అవకాశాలు వస్తే చేశాను. ‘అగ్నిసాక్షి’ సీరియల్‌కి ముందు ‘ఉయ్యాల జంపాల’, ‘ఎవరేమోహినీ’లో వర్క్‌ చేశాను. ఇప్పుడు అగ్నిసాక్షిలో ప్రాధాన్యం ఉన్న రోల్‌లో నటిస్తున్నాను. సిరిగా ఇప్పుడు అందరిలోనూ మంచి గుర్తింపు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 

డిగ్రీ చేస్తూనే యాంకరింగ్‌ వైపు
నేను టీవీలో, సినిమాలో కనిపించడం అమ్మకు నచ్చలేదు. ఈ ఫీల్డ్‌ అంటే ఉన్న సందేహాలు, నాన్న లేకపోవడంతో మేం భవిష్యత్తులో ఎలా నిలదొక్కుకుంటామో అనే భయాల వల్ల మొదట్లో అమ్మ ఒప్పుకోలేదు. కానీ, నాకు చిన్నప్పటి నుంచి ఆన్‌స్క్రీన్‌ అంటే బాగా ఇష్టం. అలా డిగ్రీ చేస్తూనే యాంకరింగ్‌ వైపుకు వచ్చాను.

ఆ తర్వాత న్యూస్‌రీడర్‌గానూ వర్క్‌ చేశాను. పది వరకు షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించాను. అవి చూసిన వాళ్లు అమ్మకు ‘మీ అమ్మాయి చక్కగా ఉంది. మంచి జాబ్‌ చేస్తోంది. మంచి భవిష్యత్తు ఉంది’ అని మెచ్చుకునేవారు. దీంతో అమ్మకు ఈ ఫీల్డ్‌ అంటే ఉన్న భయం పోయింది. సిరి ఎక్కడున్నా బతికేస్తుంది అని నమ్మకం వచ్చేసింది. 

అన్నయ్య కన్నా నేనే బెస్ట్‌!
నాన్నగారు లేకపోవడంతో అమ్మ నన్ను ఇండిపెండెంట్‌గా బతకడం అలవాటు చేసింది. ఇది అమ్మాయిల పని, ఇది అబ్బాయిల పని అని అన్నయ్యను నన్ను ఎప్పుడూ వేరుగా చూడలేదు. పైగా ఎక్కడున్నా ఎవరి మీద ఆధారపడకుండా బతకాలి అంటుండేది. అలా పనులు చేయడంలో, యాక్టివ్‌గా ఉండటంలో అన్నయ్య కన్నా నేనే బెస్ట్‌ అనిపించుకుంటాను. ఇప్పుడు అమ్మను పనిచేయనివ్వడం లేదు. షాప్‌ తీసేశాం. ‘మా కోసం ఇన్నాళ్లు కష్టపడ్డావు ఇక రెస్ట్‌ తీసుకో’ అని అమ్మకు చెబుతుంటాం నేనూ, అన్నయ్య. 

అభిరుచులు
డ్యాన్స్‌ అంటే పిచ్చి. కానీ, ఒక పద్ధతి ఉండదు (నవ్వుతూ). ఎలా అంటే అలా గెంతులు వేస్తుంటాను. పాటలు కూడా అంతే. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాను. ఎప్పుడూ ఫోన్‌ చేతిలోనే ఉంటుంది. కాస్ట్యూమ్స్‌ ఎంపిక, కలర్‌ కాంబినేషన్స్‌.. చూసుకోవడం ఇష్టంగా చేస్తాను. 

డ్రీమ్‌ రోల్‌
ఎప్పటికీ ఇలా మీ మధ్య ఈ ఫీల్డ్‌లో కొనసాగాలన్నదే నా కల. ఇదే నా జీవితం. ఈ ఫీల్డ్‌లో దేనినీ వదిలేయను. ఇప్పటికీ ఎవరైనా పిలిచి యాంకరింగ్‌ చేయమన్నా చేస్తాను. షోస్‌లో పాల్గొంటాను. ఒకటి అని ఏమీ లేదు. సినిమా, టీవీ .. యాక్టింగ్‌లో ఆల్‌రౌండర్‌ అనిపించుకోవాలి.
– నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top