చెట్టెక్కి పత్రి కోసేదాన్ని

Senior Actress Jamuna Birthday Special Interview - Sakshi

వినాయక చవితి రోజున గణేశుడిని సభక్తితోపూజిస్తారు జమున. వినాయకుడి చరిత్ర మీద వచ్చిన తొలి సినిమాలో ఆమె సత్యభామ. అప్పటి నుంచి ఇప్పటివరకూ తెలుగువాళ్లకు... సత్యభామ అంటే జమునే. ఆమె శ్రీకృష్ణుడి భక్తురాలు. రోజూ కృష్ణుడిని కొలుస్తారు. ఆమె కోరుకున్నవన్నీ ఆ కృష్ణుడు ఇచ్చాడు. సహస్ర చంద్రదర్శనం చేసిన జమున ఇప్పుడు...
కృష్ణుడిని ఏం కోరుకుంటున్నారు? కుడుములు తింటూ.. జమున ఇంటర్వ్యూ చదవండి.

ఆగస్ట్‌ 30తో 83 ఏళ్లు పూర్తి చేసుకుని, 84లోకి అడుగుపెట్టారు. 83 ఏళ్లు దాటిన వారిని సహస్రచంద్ర దర్శనం (జీవితకాలంలో వెయ్యి పున్నములను చూస్తారని ఆ లెక్క) చేశారంటారు. బర్త్‌డే నాడు తులాభారం ఇచ్చినట్లున్నారు..
అవును. నా బరువంత బియ్యం, బెల్లం, నెయ్యి ఇచ్చాం. వంశీ రామరాజుగారి ఆధ్వర్యంలో వాటి పంపిణీ జరిగింది. ఇన్నేళ్ల జీవితం ఆనందంగా గడిచినందుకు ఆ కృష్ణుడికే కృతజ్ఞతలు చెప్పాలి.

పుట్టిన రోజు నాడు చక్కగా పట్టుచీర కట్టుకుని, వడ్డాణం పెట్టుకుని భలేగా ఉన్నారు..
సినిమా తారలు పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు అందంగా, హుందాగా కనపడాలి. ఎందుకంటే ప్రేక్షకుల హృదయాల్లో మా అందమైన రూపం నిలిచిపోతుంది. అందుకే నేను పట్టుచీరలే కట్టుకుంటాను. నగలు కూడా బాగానే పెట్టుకుంటాను. అయితే మొన్న పుట్టినరోజుకి అమ్మాయి పెట్టుకోమంటే వడ్డాణం కూడా పెట్టుకున్నాను. అరవంకీలు ఉన్నాయి కానీ, బరువు అనిపించి పెట్టుకోలేదు.
ఈ రోజు వినాయక చవితి. చిన్నప్పుడు ఈ పండగను ఎలా చేసుకునేవారు?
మేం దుగ్గిరాలలో ఉండేవాళ్లం. ఉదయం నిద్రలేచి, తలస్నానం చేసి పత్రి అవీ తీసుకురావడానికి కాలువ దగ్గరికెళ్లేవాళ్లం. ఎవరైనా ముందుకు తోస్తే చెట్టెక్కేదాన్ని. పత్రి కోసేదాన్ని.

చంద్రుడిని చూడక ముందే కథ చదవాలి...లేకపోతే  నిందలకు గురవుతాం అంటారు...
అవును.. ఈ రోజు గణేశుడిని పూజించ కుండా చంద్రుడ్ని చూస్తే నీలాపనిందలకు గురవుతాం అంటారు. కానీ ఇప్పుడు ఏం నీలాపనిందలు వస్తాయో చూద్దామని కథ వినడానికి కుదరకపోయినా కావాలని చంద్రుడ్ని చూస్తున్నాను (నవ్వుతూ).

అంటే.. ఇలాంటి వాటి మీద నమ్మకం లేదా?
నమ్మకం లేక కాదు. ఏదో సరదాగా అన్నాను. అయితే నాకు మూఢనమ్మకాలు లేవు. దెయ్యాలున్నాయని పూజల చేయడం వంటి వాటిని నమ్మను. ఒకప్పుడు నేను షూటింగ్‌ పూర్తి చేసుకుని, ఇంటికి వచ్చిన వెంటనే.. అది రాత్రి పది అవ్వనివ్వండి... అర్ధరాత్రి అవ్వనివ్వండి.. మా అమ్మగారు దిష్టి తీశాకే లోపలికి రానిచ్చేవారు. మొన్న బర్త్‌డేని నా కూతురు స్రవంతి బాగా గ్రాండ్‌గా చేసింది. ఈ వేడుకలో ‘మీర జాలగలడా..’ పాటకు డ్యాన్స్‌ చేశాను. ఆ వీడియో వైరల్‌ అయింది. ఎక్కడెక్కడినుంచో ఫోన్లు చేశారు. చాలా చురుకుగా ఉన్నారని చెప్పారు. నేనేమీ దిష్టి తగులుతుందనుకోలేదు. కాంప్లిమెంట్స్‌ని బాగా ఎంజాయ్‌ చేశాను.

ఇప్పుడు మీ లైఫ్‌ స్టైల్‌ ఎలా ఉంది?
ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తాను. బ్రష్‌ చేసుకుని కాఫీ తాగుతాను. తర్వాత స్నానం చేసి, పూజ చేసుకుంటాను. ఇంతకుముందు అయితే పూజ చేశాకే టిఫిన్‌ తినేదాన్ని. ఇప్పుడు ఆకలికి ఆగలేకపోతున్నాను. పైగా ఆకలితో పూజ చేస్తే ఏకాగ్రత కుదరదు. దేవుడు కూడా ఆకలితో పూజ చేయమని చెప్పలేదు. అందుకే ఇప్పుడు టిఫిన్‌ తిన్నాకే పూజ చేస్తున్నా. పేపర్లు చదవడం, టీవీ చూడటం, ఇంటికొచ్చేవాళ్లతో మాట్లాడటం... రోజంతా బాగా గడిచిపోతుంది.

ఆహారం విషయంలో నియమాలేమైనా?
నేను ప్యూర్‌ వెజిటేరియన్‌. శాకాహారంలో అన్నీ తింటాను. ఒకప్పుడు నెయ్యి బాగా తినేదాన్ని. ఇప్పుడు తగ్గించేశాను. మా అమ్మగారు చిన్నప్పుడు కృష్ణుడి దగ్గర ‘కృష్ణా... రాత్రంతా చల్లగా కాపాడావు. పగలంతా కూడా చల్లగా కాపాడు’ అని పూజించమనేవారు. ఇప్పుడు రోజూ అలానే చేస్తున్నా.

మీ చీరల ఎంపిక బాగుంటుంది.. షాపింగ్‌ ఎవరు చేస్తారు?
స్వయంగా వెళ్లి కొనుక్కోను. చెప్పాలంటే నాకు పెట్టుడు చీరలు ఎక్కువ. పట్టు చీరలు, కాటన్‌ చీరలు అవీ పెడుతుంటారు. ఎవరు పెట్టినా కట్టుకుంటాను. అది కాటన్‌ చీర అయినా సరే కట్టుకుని ఓ గంట సేపు ఉంటాను. అప్పుడే ఇచ్చినవాళ్లకు కూడా తృప్తిగా ఉంటుంది. నాకు మొదట్నుంచీ నైలాన్‌ చీరలు పెద్దగా నచ్చవు. అవి జారిపోతూ అసౌకర్యంగా ఉంటాయి. అందుకే పట్టు చీరలకు లేదా మంచి కాటన్‌ చీరలకు ప్రాధాన్యం ఇస్తాను.

మీకు కుడుములు చేయడం వచ్చా?
అస్సలు రాదు. మా అమ్మగారు చేసేవారు. ఇప్పుడు ఎవరో ఒకరు చేసి పెడతారు. పండగ రోజంతా కుడుములు తింటూ ఉంటాను. ముఖ్యంగా కొబ్బరి లౌజు పెట్టి కుడుములు చేస్తారు కదా.. అవి చాలా ఇష్టం. వినాయకుడి పేరు చెప్పి ఫుల్లుగా తింటాను (నవ్వులు).

వినాయక వ్రత కల్పములో నిజమేంటో తెలుసుకుని సత్రాజిత్తు తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి పెళ్లి చేయడం అనేది ముఖ్యమైన అంశం. 1957లో విడుదలైన ‘వినాయక చవితి’ సినిమాలో మీరు సత్యభామగా చేశారు. ఆ సినిమాని గుర్తు చేసుకుంటారా?
ఆ సినిమాకి సముద్రాల రాఘవచార్యగారు దర్శకులు. గొప్ప దర్శకుడాయన. అందులో పాటలన్నీ బాగుంటాయి. బోలెడన్ని శ్లోకాలు, పద్యాలు, పాటలు ఉంటాయి. నేను ఫస్ట్‌ సత్యభామగా చేసింది ఆ సినిమాలోనే. ఆ తర్వాత ‘శ్రీకృష్ణ తులాభారం’లో సత్యభామ పాత్ర చేశాను. ‘శ్రీకృష్ణ విజయం’లోనూ ఆ పాత్ర చేశాను. మొత్తం మూడుసార్లు సత్యభామగా కనిపించాను.

సత్యభామ పాత్ర అంటే మీరే చేయాలనేంతగా పేరు తెచ్చుకున్నారు. దాని గురించి?
‘వినాయక చవితి’ సినిమాలో అమాయకత్వం నిండిన సత్యభామగా చేశాను. నాకు పెళ్లి అవ్వక ముందు చేసిన సినిమా అది. ఆ తర్వాత పెళ్లయిన కొత్తలో ‘శ్రీకృష్ణ తులాభారం’లో సత్యభామగా చేసే అవకాశం వచ్చింది. ‘పెళ్లయింది కదా. లావయ్యుంటుంది. ఏం బాగుంటుంది’ అని కొంతమంది అన్నారు. ‘ఏం పెళ్లయితే లావైపోతామా?’ అనుకున్నాను. చెప్పాలంటే పెళ్లి తర్వాత ఇంకా పరిణతి వచ్చి, నా అందం రెట్టింపు అయింది. అప్పుడు సత్యభామగా నన్ను చూసి, అందరూ భేష్‌ అన్నారు. మూడోసారి ‘శ్రీకృష్ణ విజయం’లో ఆ పాత్ర చేసినప్పుడు బిడ్డల తల్లిని. అయినా నా అందం, ఆహార్యం చెక్కు చెదరలేదు. అలా సత్యభామగా నేనే కరెక్ట్‌ అనే పేరు తెచ్చుకోగలిగాను.

కుమార్తె స్రవంతి, మనవడు అవిష్‌తో...
కృష్ణుడి పత్నిగా సినిమాల్లో నటించారు. నిజజీవితంలో మీరు కృష్ణుడి భక్తురాలేనా? ఏ దైవాన్ని ఎక్కువగా పూజిస్తారు?
నా చిన్నప్పుడు మా ఇంట్లో ఓ కృష్ణుడి ఫొటో ఉండేది. చేత్తో రామచిలక, నెమలి íపింఛం పట్టుకుని చక్కగా నవ్వుతూ కనిపించే ఫొటో అది. నాకా ఫోటో అంటే ఇష్టం. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మా అమ్మగారు పూజలు చేసేవారు. నేను మాత్రం స్కూల్‌కి వెళ్లే ముందో, సాయంత్రం వచ్చాకో అగరబత్తీలు వెలిగించి, కృష్ణుడి పటానికి గుచ్చేదాన్ని. ఆ అద్దం అంతా నల్లగా అయిపోయిందనుకోండి (నవ్వుతూ). ‘కృష్ణా.. నన్ను పెద్ద ఫిలిం స్టార్‌ని చెయ్యి’ అని కోరుకునేదాన్ని. నా కోరికను మన్నించాడు.

మరి.. హీరోయిన్‌ అయ్యాక కృష్ణుడ్ని ఏం కోరుకున్నారు?
నేను నా జీవితాంతం ఆ కృష్ణ భగవానుడిని ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాను. హీరోయిన్‌ అయ్యాక ‘గౌరవమర్యాదలతో ఉండేలా చెయ్యి కృష్ణా. నా ప్రతిష్టకు ఏ భంగం రాకూడదు’ అని కోరుకున్నాను. అలాగే నిందలు వచ్చినప్పుడు ‘కృష్ణా.. ఇవన్నీ తట్టుకుని స్వాభిమానంతో నిలబడే శక్తిని ఇవ్వు’ అని దండం పెట్టుకున్నా. అలానే దీవించాడు.

ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు?
‘కృష్ణా.. ఇంత అద్భుతమైన జీవితం ఇచ్చావు. మంచి అమ్మానాన్న, దేవుడిలాంటి భర్త, వరాల్లాంటి ఇద్దరు (కుమార్తె స్రవంతి, కుమారుడు వంశీకృష్ణ) పిల్లలను ఇచ్చావు. మళ్లీ జన్మ అంటూ ఉంటే.. ఇలాగే గౌరవంగా, హుందాగా బతికే వరం ఇవ్వు. లేకపోతే నీలో ఐక్యం చేసుకో’ అని కోరుకుంటున్నాను. ఇప్పటివరకూ కృష్ణుడు నేను ఏం కోరుకుంటే అది ఇచ్చాడు. మళ్లీ జన్మంటూ ఉంటే ఈ జన్మలో బతికినంత హుందాగా బతికిస్తాడని నమ్ముతున్నాను. ఒకప్పుడు శక్తి కోసం కోరుకున్నాను. ఇప్పుడు ముక్తి కోసం ప్రార్థిస్తున్నాను.– డి.జి. భవాని

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top