సీ పైలట్‌ | Rishma Kolkata Port Trust | Sakshi
Sakshi News home page

సీ పైలట్‌

Apr 10 2018 12:06 AM | Updated on Apr 10 2018 12:06 AM

Rishma Kolkata Port Trust - Sakshi

రేష్మా నీలోఫర్‌ సాగర్‌

ఆకాశంలో విమానాల్ని చక్కర్లు కొట్టించడం..పట్టాల మీద రైళ్లను రయ్యిన పరుగులెత్తించడం..రోడ్ల మీద బస్సుల్ని లాఘవంగా తిప్పడం..ఈ మూడు దారులలో మహిళలు ఇప్పటికే నైపుణ్యాన్ని ప్రదర్శించారు.ఇప్పుడు కొత్తగా సముద్రం నుంచి పోర్ట్‌కి ఓడల్ని నడుపుతోంది!ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగాచెన్నైకి చెందిన రేష్మా నీలోఫర్‌ సాగర్‌..ఐలాండ్‌ నుంచి కోల్‌కతా పోర్టుకి  నౌకల్ని నడుపుతూ రికార్డు సృష్టించింది.

రోడ్డు మీద ఉన్నట్లే సముద్రంలోనూ స్పీడ్‌ బ్రేకర్లు ఉంటాయి. ఇసుక తిప్పలు, చిన్న చిన్న రాతి గుట్టలు.. వాటిని జాగ్రత్తగా దాటుకుంటూ ఓడను ఒడ్డుకు చేర్చాలి. అందువల్లే సముద్రం నుంచి పోర్ట్‌కి ఓడను నడపడం చాలా కష్టమైన పని. ఈ ఓడలు నడిపే పైలట్‌కి ‘యాక్సిడెంట్‌ జరగకుండా చూడగలను’ అనే నమ్మకం లేకపోతే ఈ పని చేయలేరు. చిన్న చిన్న మలుపులు తిప్పడానికే ఎంతో నైపుణ్యం ఉండాలి. ఓడలను నియంత్రించడం అంత సులువైన విషయం కాదు. మగవారికే అసాధ్యమైన ఈ ప్రొఫెషన్‌లోకి తొలిసారిగా రేష్మా నీలోఫర్‌ వచ్చారు. ప్రపంచంలోనే  తొలి సీ పైలట్‌గా  గుర్తింపు పొందారు. చెన్నైలో జన్మించిన రేష్మా నాటికల్‌ సైన్సెస్‌లో బి.ఎస్‌.సి. డిగ్రీ చేసి, కోల్‌కతా పోర్ట్‌ ట్రస్టులో శిక్షణ తీసుకున్నారు. ఏడాది పాటు క్యాడెట్‌గా పనిచేశారు. ‘డైరెక్టొరేట్‌ జనరల్‌ ఆఫ్‌ షిప్పింగ్‌లో ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ కాంపిటెన్సీ’ సర్టిఫికెట్‌ అందుకున్నారు. గ్రేడ్‌ త్రీ, పార్ట్‌ వన్‌ పూర్తి చేసి, గ్రేడ్‌ త్రీ పైలట్‌గా మరో ఆరు నెలల్లో పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వహించబోతున్నారని మెరైన్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జెజె బిశ్వాస్‌ అంటున్నారు.  ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ కాంపిటెన్సీ అయ్యాక.. చిన్న చిన్న వస్తువులు ఉన్న ఓడలు నడిపి, అనుభవం çసంపాదించారు రేష్మ. ఆ తర్వాత ‘పనామాక్స్‌ వెజల్స్‌’ ఉండే పెద్ద పెద్ద ఓడలను నడిపారు. 300 మీటర్ల పొడవు ఉండే ఈ ఓడలలో, 70,000 టన్నుల సరుకు ఉంటుంది.
 
సముద్ర గర్భం నుంచి కోల్‌కతా పోర్ట్‌కి ప్రతిరోజూ సామాన్లు చేరవేస్తారు రేష్మ. ఆవిడ ప్రయాణించే దూరం 223 కిలో మీటర్లు. హుగ్లీ మీదుగా ప్రయాణించే 148 కిలోమీటర్ల ప్రాంతమంతా అనేక మలుపులు, అడ్డంకులతో నిండి ఉంటుంది. కోల్‌కతా లేదా హల్దియా నుంచి వచ్చే ఓడలు.. సాగర్‌ ఐలాండ్‌లో ఉండే పైలట్‌తో దారిలో ఉండే అడ్డంకుల గురించి కమ్యూనికేట్‌ అవ్వాలి. సముద్రంలో అనేక ఇసుక దిబ్బలు, కొండరాళ్ల మలుపులు ఉంటాయి. అవి బాగా ఇబ్బంది కలిగిస్తాయి. ఓడ వాటిని తప్పించుకుంటూ వెళ్లాలి. అక్కడ యుక్తితో తప్పించుకునే అవకాశం చాలా తక్కువ. ఎంత నేర్పు ప్రదర్శించినా తప్పించుకోలేకపోతారు. ఇందుకు కావలసినదల్లా అనుభవమే. రేష్మను చూసి చాలామంది ఒక ప్రశ్న వేస్తుంటారు. సముద్రంలో పనిచేయడం ఆడవారికి ఎంతవరకు క్షేమమా? అని. అందుకు రేష్మ ‘ఈత వస్తే సముద్రం గురించి భయపడవలసిన అవసరం లేదు’ అంటారు.

అంత తేలికేం కాదు
సీ పైలట్‌ని మారిటైమ్‌ పైలట్‌ అని కూడా అంటారు. వీళ్లు ఇరుకుగా ఉండే నీటి ప్రాంతం.. అంటే హార్బర్స్, నదీ ముఖ ప్రాంతం వంటి ప్రదేశాల నుంచి సరుకులను చేరవేస్తారు. సాధారణంగా వీరికి షిప్‌ కెప్టెన్‌గా, కష్టమైన ప్రదేశాలలో షిప్‌ను హ్యాండిల్‌ చేసిన అనుభవం ఉండాలి. అంటే అక్కడి లోతు ఎంత, గాలి ఎంత శక్తితో ఏ దిశగా ప్రయాణం చేస్తోంది, అలలు ఆటు మీద ఉన్నాయా, పోటు మీద ఉన్నాయా... వంటి విషయాలలో అనుభవం ఉండాలి. వీటన్నిటినీ అలవోకగా దాటేస్తున్నారు రేష్మ. 
– రోహిణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement