పెళ్లి సంతకం

Registration Officials Confused on Trans Woman Marriage Certificate - Sakshi

నిన్నటి వాలంటైన్స్‌ డే మణిగంధన్‌కి, సురేఖకు ప్రత్యేకమైనది. ఈ భార్యాభర్తలకు నిన్న మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ వచ్చింది! కోయంబత్తూర్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కి వెళ్లి ఓ సంతకంపెట్టి, పనిలో పనిగా అక్కడి అధికారులకు ఓ దండం పెట్టి బయటికి వచ్చింది ఈ జంట. రెండేళ్లుగా మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ కోసం తిరుగుతున్నారు మణిగంధన్, సురేఖ. సరిగ్గా రెండేళ్ల క్రితం వాలంటైన్స్‌ రోజునే ఫిబ్రవరి 14న వాళ్ల పెళ్లి జరిగింది. చివరికి ఈ నెల మొదట్లో రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మీకు సర్టిఫికెట్‌ ఇస్తున్నాం. ఎప్పుడొచ్చి తీసుకుంటారు?’’ అని. అచ్చం సినిమాల్లో చూపించినట్లే.. ఆనందంతో ఎగిరి గంతేశారు. వాలంటైన్స్‌ డే రోజు వచ్చి తీసుకుంటాం సార్‌ అని చెప్పారు. వెళ్లి తీసుకున్నారు. మణిగంధన్, సురేఖలకు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ రావడానికి ఇంత సమయం పట్టడం వెనుక పెద్ద కారణమే ఉంది.

మణిగంధన్‌ అబ్బాయి. సురేఖ అమ్మాయి లాంటి అబ్బాయి. ట్రాన్స్‌ ఉమన్‌! ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయి.సమాజం కూడా ఒప్పుకుంది. రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ వాళ్లకే ఒప్పుకోడానికి చట్టం అడ్డుపడింది. ఒక పురుషుడికి–స్త్రీకి మధ్య జరిగిన పెళ్లికైతే మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వగలం కానీ.. ఇలాంటి పెళ్లికి ఏ సెక్షన్‌ కింద వివాహ పత్రం ఇవ్వాలో తెలియడం లేదు అనేశారు. ‘‘లేదు, మాకు సర్టిఫికెట్‌ కావలసిందే’’ అని ఈ దంపతులు పట్టుపట్టారు. చట్టాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి కూడా సిద్ధమైపోయారు. చెన్నై వెళ్లి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (రిజిస్ట్రేషన్‌) ని కలిశారు. ‘అవకాశం ఉందేమో చూస్తాను’ అని ఐజీ గారు వాళ్లు పంపించి, సిబ్బంది చేత చట్టాల పుస్తకాలు తెప్పించుకున్నారు. 2009 తమిళనాడు రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ మ్యారేజస్‌ యాక్ట్‌లో సన్నటి దారం లాంటి ఆధారం దొరికింఇ. దాన్ని పట్టుకుని.. ఈ ఏడాది జనవరి 28న అన్ని జిల్లాల్లోని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులకు నోటిఫికేషన్‌ పంపించారు. ట్రాన్స్‌జెండర్‌ పెళ్లిళ్లను చట్టబద్దం చేసే ఉత్తర్వు అది. ఆ ఉత్తర్వు కోయంబత్తూరు కూడా చేరింది. అక్కడి అధికారులు వెంటనే మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ మణిగంధన్‌కి వర్తమానం పంపారు.. ‘వియ్‌ ఆర్‌ రెడీ టు గివ్‌ యు..’ అని.

మొత్తానికి మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ఈ ఆలూమగల చేతికి వచ్చింది. అయినా సర్టిఫికెట్‌ కోసం ఎందుకు ఇంతగా వీళ్లు పోరాడారు? ‘‘బిడ్డను దత్తత తీసుకోవాలంటే మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ఉండాలన్నారు. ఇప్పుడు ఉంది. త్వరలో మేము అమ్మానాన్న కాబోతున్నాం’’ అన్నారు మణిగంధన్, సురేఖ.. చిరునవ్వులు చిందిస్తూ.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top