అదిగో భద్రాద్రి ఇదిగో పర్ణశాల!

అదిగో భద్రాద్రి  ఇదిగో పర్ణశాల!


భద్రాచలం సీతారామస్వామి ఆలయం ప్రపంచమంతటా తెలిసిందే. ఈ పుణ్య క్షేత్రం, రాములవారి గుడి, రామదాసు అని పిలువబడే గోపన్న, గుడి చరిత్రం.. అందరికీ తెలిసిందే. ఉగాది ముందు రామనవమి దాకా ఈ పుణ్యక్షేత్రంలో జరిగే తిరునాళ్లు చాలా ప్రసిద్ధి. ప్రతి యేటా లాగే ఈ రామనవమికి కూడా భద్రాచలం సిద్ధమవుతోంది. సీతారాములవారి కల్యాణం బ్రహ్మానందమైన ఒక విశేషం.

 రామనవమి సంబురాలు, భద్రాచలం నుండి ప్రవహిస్తున్న గోదావరి, ఇవ్వన్ని తెలిసినవే! వీటిని మించి ప్రదేశం మరొకటి ఉంది. ఈ పట్టణం నుండి 32 కిలోమీటర్ల దూరంలో సీతమ్మవారి పర్ణశాల ఉన్నది. సీతారాముల దేవస్థానం ఎంతటి ప్రఖ్యాతి చెందినదో ఈ పర్ణశాలకు కూడా అంతే ప్రఖ్యాతి చెందింది. పర్ణశాల వెళితే మొదట మనకు అనిపించేది ఏమిటంటే దీనికి రావల్సినంత గుర్తింపు రాలేదేమో అని.

 భద్రాచలం నుండి షేర్ ఆటో లేక టాక్సీల ద్వారా పర్ణశాల చేరుకోవచ్చు. ప్రభుత్వం నడిపే బస్సులు కూడా ఉన్నాయి. నవంబరు-ఫిబ్రవరి కాలంలో పర్ణశాలకు భధ్రచాలం నుంచి పడవలో కూడా వెళ్లవచ్చు. అప్పుడు గోదావరి నదిలో నీటి ప్రవాహం బాగుంటుంది కాబట్టి. రామనవమి సమయంలో గోదావరిలో నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పడవలుండవు.





 పర్ణశాలకు ఓ ప్రత్యేకత ఉంది. రామాయణంలో ఒక ప్రముఖమైన ఘట్టం ఈ ప్రదేశంలో జరిగిందని ఉంది. రాముడు, సీత, లక్ష్మణుడితో వనవాసానికి బయల్దేరి గోదావరి ఒడ్డున ఒక కుటీరం ఏర్పరుచుకొని ఉన్నారు. అదే ఈ పర్ణశాల. ఇక్కడ ప్రతి రాయికి, ప్రతిగుట్టకు ఓ చరిత్ర ఉంది. మరొక విశేషం ఏమిటంటే ఈ ప్రదేశం నుండే రావణాసురుడు సీతమ్మని అపహరించాడట.



 సీతారాములు ఉన్న కుటీరమే పర్ణశాల. దాదాపు వాళ్ల వనవాసంలోని చాలా సమయం ఇక్కడే గడిపారని ఈ ప్రదేశ చరిత్ర చెబుతుంది. సీతమ్మవారు గోదావరిలో స్నానం చేసి, పర్ణశాల పక్కనున్న ‘రాధగుట్ట’పై చీర ఆరేసుకుంది అని అంటారు. ఇప్పుడు ఆ చోటుని నార చీర గురుతుల స్థలం అని అంటారు. పర్ణశాలకు వెళ్లే దారిలో ఒక కిలోమీటరు ముందే ఈ రాధగుట్ట ఉంది. ఇక్కడ ఇప్పుడు  కూడా అప్పటి ఆనవాళ్లు ఉన్నాయి. రాధగుట్ట పక్కనే మీకు లక్ష్మణుడు, శూర్పణఖల మధ్య సంఘర్షణ జరిగిన ఒక చిన్న గుట్ట ఉంది. ఇవన్నీ ఇప్పుడు పర్యాటక స్థలాలు.



 అక్కడి స్థానికుల కథనం ప్రకారం.. రావణాసురుడు తన పుష్పకవిమానంలో ఈ ప్రదేశానికి వచ్చాడట. గోదావరి ఒడ్డున తన వాహనాన్ని ఆపి, సన్యాసి అవతారం ధరించి, పర్ణశాలకు వచ్చి, సీతమ్మవారిని అపహరించాడట. ఇదే ప్రదేశంలో సీతమ్మ బంగారు జింకను చూసి రాములవారిని ఆ జింక కావాలని కోరిందిట. శ్రీరాముడు బంగారు జింక రూపంలో వచ్చిన మారీచుని సంహరించాడట.



 ప్రస్తుతం పర్ణశాల, ఈ విశేషాలు చూడటానికి వచ్చిన పర్యాటకులు, వారు చేసే వ్యాపారం మీదే ఆధారపడి ఉంది. ఆ ఊరి పంచాయతి వారు సమగ్రంగా ఈ ప్రత్యేకతను వాడుకుంటున్నారు. ఊరి మధ్యలోనే ప్రతి వాహనం పై పన్ను సేకరిస్తున్నారు. పర్ణశాల కుటీరం పక్కనే సీతారాముల వారి చిన్న గుడి కూడా ఉంది.



 పర్ణశాలకు ఉన్న ప్రత్యేకతను పురస్కరించుకుని ఆ ప్రదేశంలో రామాయణ ఘట్టాలను కన్నులకు కట్టే బొమ్మలు, కుటీరం ఏర్పాటుచేశారు. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ బాపుగారి బొమ్మలు. ప్రభుత్వం పర్ణశాలను ప్రత్యేక కేంద్రంగా గుర్తించి బాపు గారిని ఆహ్వానించి రామాయణంలో ఇక్కడి ఘట్టాన్ని బొమ్మల రూపంలో రూపొందించమని కోరింది. ఈ బొమ్మలు బాపు శైలిలో ఆకర్షణీయంగా ఉన్నాయి. కానీ, మనవాళ్లు దేవుడికి, కలానికి మర్యాద ఇవ్వడం లేదు. ఈ బొమ్మలు ప్రస్తుతం దీన స్థితిలో ఉన్నాయి.

 ఏది ఏమైనా, పర్ణశాల ఒక మంచి సందర్శనీయ స్థలం. ప్రభుత్వం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే,  గొప్ప కళాఖండాలు బతికి బయటపడతాయి. లేకపోతే అక్కడ దళారుల చేతిలో ఇదొక ఆటబొమ్మలా మిగిలిపోతుంది.

 

 - కె. జయదేవ్

  (వ్యాస రచయిత జర్నలిస్ట్, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top