
అన్నయ్య.. అన్నావంటే ఎదురవనా.. ఇది పాట మాత్రమే కాదు నిజం కూడా! అమ్మానాన్నకు చెప్పుకోలేని విషయాలు కూడా ఆడవాళ్లు.. అన్నకు చెప్పుకుంటారు. ఏ కష్టం వచ్చినా అన్న సలహా తీసుకోవాల్సిందే! ఇబ్బందుల్లో ఉంటే అన్నకు ఫోన్ రావాల్సిందే! అతడు క్షణంలో చెల్లెలి ముందు ప్రత్యక్షం కావాల్సిందే! ఈ అనుబంధాన్ని దేనితోనూ వెలకట్టలేము.
ఈ అన్నాచెల్లెళ్ల ప్రేమను లోతుగా చూపిస్తూ కంటతడి పెట్టించే సినిమాలు వెండితెరపై ఎన్నో వచ్చాయి. అక్కడిదాకా ఎందుకు రక్షా బంధన్ పండగపై రాఖీ అనే సినిమా కూడా ఉంది. కృష్ణవంశీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. రాఖీయే కాదు, ఇలా ఎన్నో పండగలు సినిమా టైటిల్స్‌గా ఆవిష్కృతమై తెరపై అద్భుతాలు సృష్టించాయి. అవేంటో చూసేద్దాం..
సంక్రాంతి
వెంకటేశ్, శ్రీకాంత్, శివబాలాజీ, స్నేహ, ఆర్తి అగర్వాల్, సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. ముప్పలనేని శివ డైరెక్ట్ చేశాడు. 2005లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.
మహాశివరాత్రి
రాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మహాశివరాత్రి. రేణుకశర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేసింది.
దసరా
నాని హీరోగా వచ్చిన దసరా సినిమా ఏ రేంజ్‌లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2023లో విడుదలైంది.
హోలీ
ఉదయ్‌కిరణ్ హీరోగా నటించిన హోలీ సినిమాకు ఎస్వీఎన్ వరప్రసాద్ దర్శకత్వం వహించాడు. 2002లో వచ్చిన ఈ మూవీ జనాల్ని బాగానే ఆకట్టుకుంది.
ఉగాది
ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా నటించడంతోపాటు దర్శకత్వం వహించిన మూవీ ఉగాది. లైలా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం 1997లో రిలీజైంది.
నందమూరి కల్యాణ్‌రామ్ విజయదశమి, సునీల్ కృష్ణాష్టమి, కృష్ణ భోగిమంటలు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురుపౌర్ణమి.. ఇంకా దీపావళిపై రెండు సినిమాలు.. ఇలా బోలెడన్ని వచ్చాయి.
చదవండి: నిర్మాతలు ఎటూ తేల్చకపోతే చిరంజీవి ఆ పని చేస్తానన్నారు