చీకట్లను చీల్చిన దివ్యజ్యోతి

Our Society Today Also Needs The Teachings Of The Prophet Muhammad - Sakshi

నేడు ముహమ్మద్‌ ప్రవక్త(స) జయంతి – మిలాదున్నబీ సందర్భంగా..)

మానవజాతి సంస్కరణ కోసం ప్రపంచంలో అనేకమంది సమాజోద్ధారకులు ప్రభవించారు. వారిలో చివరిగా వచ్చినవారు ముహమ్మద్‌ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం.

మనందరి ప్రవక్త ఒక్కరే, మనందరి గ్రంథం ఒక్కటే. మనందరి ధర్మం ఒక్కటే. మనమంతా ఒక్కటే. సమస్త మానవజాతీ ఒక్కటే.. అనిఎలుగెత్తి చాటేరోజు మిలాదున్నబీ.  ప్రవక్త జననానికి ముందు నాటి సమాజంలో ‘కర్రగలవాడిదే బర్రె’ అన్నట్లుగా బలవంతుడు బలహీనుణ్ణి పీక్కు తినేవాడు. స్త్రీల హక్కుల విషయం కాదుగదా అసలు వారికంటూ ఓ వ్యక్తిత్వం ఉన్న విషయాన్నే వారు అంగీకరించేవారు కాదు. స్త్రీని విలాస వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు. అలాంటి జాతిని అన్ని విధాలా  సంస్కరించి, వారిని మంచి మనుషులుగా తీర్చిదిద్దిన ఘనత ముహమ్మద్‌ ప్రవక్తదే.  నాటిసమాజంలో లేని దుర్మార్గమంటూ లేదు. అలాంటి ఆటవిక సమాజాన్ని నిరక్షరాస్యులైన ముహమ్మద్‌ ప్రవక్త సమూలంగా సంస్కరించి, ఒక సత్సమాజంగా ఆవిష్కరించారు.

దురదృష్టవశాత్తూ ఈనాటి మన నాగరిక, విజ్ఞాన సమాజ స్థితిగతుల్ని విశ్లేషిస్తే మనకు నిరాశే మిగులుతుంది. నైతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయంగా మనం పతనం అంచుల్లో ఉన్నాం.  సమాజంలో నైతిక విలువలు అడుగంటి, పాశ్చాత్య పోకడలు, పబ్‌ క్లబ్‌ సంస్కృతి వెర్రితలలు వేస్తున్నది. తత్ఫలితంగా అశ్లీలత, అనైతికత, అమానవీయత, ప్రబలి సాంస్కృతిక  విధ్వంసానికి దారితీస్తున్నాయి. చివరికి ఆధ్యాత్మిక రంగంలోనూ అతివాదం ముదిరి మతోన్మాదంగా రూపాంతరం చెందింది. మతం మనిషిని మంచివైపుకు మార్గదర్శకం చేసే బదులు అసహనం, హింసవైపు తీసుకుపోతోంది. సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలు కొంతమందిని తీవ్రవాదం, ఉగ్రవాదం వైపుకు తీసుకువెళుతున్నాయి.

ఇలాంటి పరిస్థితిలో నేటి మన సమాజానికి కూడా ముహమ్మద్‌ ప్రవక్తవారి బోధనల అవసరం ఉంది. ఆయన బోధనల ప్రకారం... మానవులు తమ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. తోటిమానవుల్ని, సమాజాన్ని ప్రేమించాలి.  స్త్రీలను గౌరవించాలి. ఎలాంటి స్థితిలోనూ నీతినీ, న్యాయాన్ని విస్మరించకూడదు. అనాథలను, వృద్ధులను ఆదరించాలి. తల్లిదండ్రులను సేవించాలి. వారిపట్ల విధేయత కలిగి ఉండాలి. బంధువులు, బాటసారులు, వితంతువులు, నిస్సహాయుల పట్ల తారసిల్లే బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. సంఘంలో ఒక మనిషికి మరో మనిషిపై పడే విధ్యుక్త ధర్మాల పట్ల ఉపేక్ష వహించకూడదు. అన్యాయం, అధర్మ సంపాదనకు ఒడికట్టవద్దు. ధనాన్ని దుబారా చేయవద్దు. వ్యభిచారం దరిదాపులకు కాదుగదా.. దానికై పురిగొలిపే అన్నిరకాల ప్రసార ప్రచార సాధనాలను రూపుమాపాలి. నిష్కారణంగా ఏ ప్రాణినీ చంపవద్దు. ప్రజల ధన, మాన, ప్రాణాలు సురక్షితంగా లేని సమాజం ప్రగతిని సాధించలేదు.

సదా సత్యమే మాట్లాడాలి. చేసిన వాగ్దానాలు నెరవేర్చాలి. వాగ్దాన భంగానికి పాల్పడకూడదు. పలికే ప్రతి మాటకూ, చేసే ప్రతి పనికీ సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. వ్యాపార లావాదేవీల్లో, ఇచ్చి పుచ్చుకోవడాల్లో లెక్కా పత్రాలు, కొలతలు, తూనికలు ఖచ్చితంగా, నికార్సుగా ఉండాలి. స్వార్థాన్ని, అహాన్ని త్యజించాలి. తోటివారిని తమకన్నా తక్కువగా చూడకూడదు. స్త్రీ జాతిని గౌరవించాలి. వితంతువుల్ని చిన్నచూపు చూడకూడదు. సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం దక్కాలి. ప్రతి తల్లీదండ్రి తమ సంతానానికి విద్య నేర్పాలి. భావితరాల సంక్షేమానికి ఇది చాలా అవసరం. అధికార దుర్వినియోగం చేయకూడదు. పరిపాలన అంటే కేవలం ప్రజాసేవ మాత్రమే.. పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని భావించాలి. ప్రతినిత్యం  ప్రజలకు జవాబుదారుగా దైవానికి భయపడుతూ జీవించాలి. ఇక్కడ మనం పలికే ప్రతి మాటకు, చేసే ప్రతి పనికీ రేపు దైవం ముందు సమాధానం చెప్పుకోవాలన్న భావన కలిగి ఉండాలి.

ఇలాంటి భావనలే మానవులను మంచివారుగా, నిజాయితీ పరులుగా, సౌశీల్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. . మానవ సహజ దౌర్బల్యాల వల్ల చిన్నా చితకా పాక్షిక విభేదాలు ఉన్నప్పటికీ మనందరి విశ్వాసం కూడా ఒక్కటే అనడానికి ప్రబల తార్కాణం ఈ పండుగ. మౌలిక విశ్వాసం పరంగా ఒక్కటిగానే ఉన్న మనం పాక్షిక పొరపొచ్చాలను విస్మరించి తోటి సోదరుల్ని గుండెలకు హత్తుకోవాలి. ఈ పర్వదినం మన కిచ్చే మరో సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకు పోకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచు కోకుండా ఏ సంతోషమయినా, ఎంతటి ఆనంద మైనా పరిపూర్ణం కాజాలదు. ఏ సంతోష కార్యమైనా సమాజంతో పంచుకోవాలని, కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించాలని చెబుతుంది ప్రవక్త పుట్టినరోజైన మిలాదున్నబీ.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

అజ్ఞానాంధకార విషవలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న మానవ జాతిని మహోన్నతంగా తీర్చిదిద్దారాయన. దాదాపు 1450 సంవత్సరాల క్రితం అరేబియాదేశంలోని మక్కానగరంలో ఆయన జన్మించారు. ఆమినా, అబ్దుల్లా తల్లిదండ్రులు. పుట్టకముందే తండ్రినీ, ఆరేళ్ళ ప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. తాతయ్య ఆయన్ని పెంచి పెద్దచేశారు. చిన్నతనం నుంచే అనేక సుగుణాలను పుణికిపుచ్చుకున్న ముహమ్మద్‌ ప్రవక్త, ‘అమీన్‌’ గా, షసాదిఖ్‌’గా వినుతికెక్కారు.

ఆయన గొప్ప మానవతావాది. సంస్కరణాశీలి.ఉద్యమనేత. అతి సాధారణ జీవితం గడిపిన సామ్రాజ్యాధినేత. జ్ఞానకిరణాలు ప్రసరింపజేసిన విప్లవజ్యోతి. ప్రాణశత్రువును సైతం క్షమించిన కారుణ్య కెరటం. ఇటువంటి బాధ్యతాభావాన్ని, జవాబుదారీతనాన్ని ముహమ్మద్‌ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ప్రజల మనసుల్లో నూరిపోసి, మానవీయ విలువలతో తులతూగే ఓ చక్కని సత్సమాజాన్ని ఆవిష్కరించారు. అందుకే ఆయన మానవాళికి ఆదర్శమయ్యారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top