ఓనమ్‌ వచ్చెను చూడు

Onam Festival Will Be Held in Kerala From September 10 - Sakshi

కేరళలో సెప్టెంబర్‌ 10 నుంచి ‘ఓనమ్‌’పండుగ వేడుకలు జరుగుతున్నాయి. తెలుగువారికి సంక్రాంతి ఎలాగోమలయాళీలకు ఓనమ్‌ అలాగ. పూలు,ఫలాలు, పంటలు, పిండి వంటలు,పాటలు, ఆటలు, పోటీలు...ఇవన్నీ ఓనమ్‌ పండుగ సమయంలోకేరళ అంతటినీ కళకళలాడిస్తాయి.ఆ సినిమా తారలను కూడా.

కేరళను ‘దేవుని సొంత భూమి’గా చెప్తారు. అయితే ఇది ఒకప్పుడు దేవుని వద్ద లేదు. దీని పాలకుడు అసురుడు. బలి చక్రవర్తి. అయితే అందమైన ఈ భూమి మీద దేవుడు మనసుపడ్డాడు. అందుకే వామనుడి రూపంలో బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి ‘మూడు అడుగుల నేల’ అడిగాడు. మొదటి రెండు అడుగులకే మూల్లోకాలు ఆక్రమితమయ్యాయి. ఇక మిగిలింది బలి చక్రవర్తి శిరస్సే. అమిత విష్ణుభక్తుడైన బలి వామనుడి మూడవ పాదాన్ని తన శిరస్సు మీదే పెట్టమని అంటాడు. ఆ తర్వాతి కథ ఏమైనా కేరళ వాసుల విశ్వాసం ప్రకారం బలి చక్రవర్తి భక్తికి విష్ణువు మెచ్చాడని, అందువల్ల ఒక వరం ప్రసాదించాడని, ఆ వరం ప్రకారం సంవత్సరానికి ఒకసారి బలి చక్రవర్తి సజీవుడైన తాను పాలించిన నేలకు (కేరళ) వచ్చి ఆ ప్రాంతాన్ని చూసుకుంటాడనీ. బలి వచ్చేవేళనే ఓనమ్‌ పండుగ వేళ. ఇది పురాణ కథ అయితే సాంస్కృతికంగా కేరళలో ఇది పంటలు ఇంటికి చేరే వేళ కనుక దీనిని విశేషంగా జరుపుకుంటారని విశ్లేషకులు అంటారు. కేరళ ప్రకృతి సౌందర్యానికే కాదు స్త్రీ సౌందర్యానికి కూడా పెట్టింది పేరు.

అందుకే అక్కడి నుంచి కె.ఆర్‌.విజయ, పద్మినిలతో మొదలుపెట్టి నేటి అనుపమా పరమేశ్వరన్‌ వరకు ఎందరో హీరోయిన్లు దక్షణాది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తెలుగువారి హృదయాలను దోచారు. అక్కడి నుంచి వచ్చిన శోభన, వాణి విశ్వనాథ్‌ దాదాపు తెలుగు హీరోయిన్ల వలే లెక్కకు మించిన సినిమాల్లో పని చేశారు. రేవతి, ఊర్వశి, పూర్ణిమా భాగ్యరాజ్, లిజి, సితార, మీరా జాస్మిన్, అసిన్, నయన తార, ప్రియమణి, శ్వేతా మీనన్, కీర్తి సురేశ్, సాయి పల్లవి, నివేదా థామస్, అమలా పాల్‌... వీరంతా దాదాపు తెలుగవారి ఆడపడుచులు అయ్యారు. ఇక కేరళ మూలాలు ఉన్న సమంతా ఏకంగా అక్కినేని వారి ఇంటి కోడలు అయ్యింది.పండుగల్లో పురుషుల పాత్ర ఎలా ఉన్నా స్త్రీల వల్లే వాటికి అందం వస్తుంది. ఓనమ్‌ పండుగ నాడు సంప్రదాయ ఓనమ్‌ చీరను కట్టడం తప్పనిసరి అని భావిస్తారు కేరళ స్త్రీలు. అందుకు మన హీరోయిన్లు కూడా భిన్నం కాదు. ఓనం చీరకే అందం తెచ్చిన ఆ సౌందర్యాన్ని చూడండి. ఇరుగు పొరుగున మలయాళీలు ఉంటే ఓనమ్‌ శుభాకాంక్షలు తెలపండి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top