నవ  దశాబ్ద  నారీమణి

New year is the first step for a new lady - Sakshi

ఉద్యమాల్లో మహిళలు.. చట్ట సభల్లో మహిళలు.. సదస్సులలో మహిళలు..  సమాలోచనల్లో మహిళలు! ఈ ఏడాది మొత్తం ప్రతి రంగంలోనూ, ప్రతి సందర్భంలోనూ మహిళలు క్రియాశీలంగా ఉన్నారు. 2019లో కూడా ఈ ఒరవడి కొనసాగబోతోంది. కొన్ని గంటల్లో రాబోతున్న కొత్త సంవత్సరం.. ఒక కొత్త మహిళా దశాబ్దపు ‘మార్చ్‌’కి తొలి అడుగు అయినా ఆశ్చర్యం లేదు. 

తక్కెడ సమానంగా ఉండాలి. సూచీ నిటారుగా ఆకాశాన్ని చూస్తుండాలి. అదే సరైన కొలమానం. సూచీ అటు వైపుకో ఇటువైపుకో వంగిందీ.. అంటే అది సమతూకం కానే కాదు. సమతూకం వ్యాపార సంబంధాల్లోనే కాదు, సామాజిక సంబంధాల్లోనూ ఉండాలి. సమతూకం లేని చోట సమన్యాయం జరగదు. వ్యవస్థ అవ్యవస్థీకృతంగా జడలు విప్పుతుంది. సమాజంలో మహిళ పరిస్థితీ అలాగే ఉంది. అందుకే ఇన్ని సదస్సులు, సమావేశాలు, చర్చలు, తీర్మానాలూ ఇంకా అవసరమవుతూనే ఉన్నాయి.‘

‘వేకువ జామున లేచాను. ఇంటెడు చాకిరీ. చేస్తూనే ఉన్నాను. ఇంకా చేయాల్సిన పనులెన్ని ఉన్నాయో, ఇవన్నీ పూర్తయ్యేదెప్పుడు, ఒక ముద్ద తిని నడుం వాల్చేదెప్పుడు..’’ ఇది మధ్య తరగతి ఇల్లాలి ఆవేదనలాగానే కనిపిస్తుంది. కానీ ఇది సగటు ప్రపంచ మహిళ ఆవేదన. తాను ఇప్పటికే చక్కబెట్టిన పనులను తృప్తిగా కళ్ల నిండుగా చూసుకుందామనేలోపు కాలం తరుముతూ ఉంటుంది ఇంకా మిగిలిపోయి ఉన్న పనులను గుర్తు చేస్తూ. మహిళ పరిస్థితీ అంతే. ఒకమ్మాయి ఒక పతకం గెలిచిందని సంతోషంగా ఆకాశానికి ఎత్తేస్తుంటుంది మీడియా. ఆమె స్ఫూర్తితో ముందడుగు వేయండి... అని వెన్నుతడుతుంది. ఆ ప్రోత్సాహాన్నందుకుని ఒక అడుగు వేద్దామని సమాయత్తమయ్యే లోపు మరో పేజీలో మహిళల మీద హింస, లైంగిక దాడులు... ఆడపుట్టుకకు ఎన్ని కష్టాలో అని వికటాట్టహాసం చేస్తుంటాయి.

ఇది సంఘర్షణ
మహిళాభివృద్ధి, మహిళల స్థితిగతుల మీద ఏటా సింహావలోకనం ఉంటుంది. ఆ పునశ్చరణలో ‘సాధించింది ఎంత; సాధించాల్సింది ఎంత’ అనే తులనాత్మకమైన అధ్యయనాలు జరుగుతూనే ఉంటాయి. మహిళల పోరాటాన్ని ‘సమానత్వ సాధన పోరు’ అంటుంది అభ్యుదయ సమాజం. ‘ఆధిక్యత కోసం ఆరాటం’ అంటుంది పురుషాధిక్య భావజాలం. ‘ఇది మా అస్తిత్వ వేదన, మనుగడ కోసం గుండెల్లో చెలరేగుతున్న సంఘర్షణ మాత్రమే, అర్థం చేసుకోండి’ అంటోంది  స్త్రీ ప్రపంచం

.

తప్పని ఆత్మగౌరవ పోరు
మహిళ వంటింటికి పరిమితం కావడం లేదిప్పుడు. తనను తాను నిరూపించుకోవడానికి కత్తిమీద సాము చేస్తోంది. ఆమె విజయాలను చూపిస్తూ ‘చూశారా! మేము మహిళలకు ఎన్ని అవకాశాలిచ్చామో’ అంటోంది మేల్‌ చావనిజం. ‘ఇవ్వడానికి మీరెవరు? మా జీవితాన్ని మా చేతుల్లో ఉంచుకోనివ్వకుండా దోపిడీ చేసిందే మీరు కదా’ అని మహిళ మనసు రోదిస్తూనే ఉంటుందా మాటలు విన్న ప్రతిసారీ. ‘అయినా సరే... మేమేంటో మళ్లీ నిరూపించుకుంటాం. మీ చేతుల్లో చిక్కుకున్న మా జీవితాలను మా వెన్నెముక మీద నిలబెట్టుకుంటాం’ అని తిరిగి స్వీయనిరూపణ కోసం స్వయంశక్తిని అర్పించడానికి ప్రతిరోజూ కొత్తగా సిద్ధమవుతూనే ఉంటుంది మహిళ. అప్పుడు బయటపడుతోంది మరో మేల్‌ కోణం. ‘మీరు అర్పించాల్సింది మేధను కాదు, శ్రమను కాదు. జస్ట్‌ దేహాన్ని’ అంటూ పురుషాధిక్యత తన అమానవీయ కోణాన్ని అలవోకగా బయటపెడుతోంది.

ఇన్ని అరాచకాల మధ్య... మహిళ అస్తిత్వ పోరాటంలో ఆత్మగౌరవ పోరాటం అనివార్యంగా వచ్చి చేరింది. ఆ పోరాటమే లైంగిక వేధింపులు, అక్రమ రవాణాలను నిరసిస్తూ భారతీయ మహిళ కదం తొక్కుతున్న ‘డిగ్నిటీ మార్చ్‌’. ఈ ఏడాది డిసెంబర్‌ 20న ముంబయిలో మొదలైన ఈ మార్చ్‌ వచ్చే ఫిబ్రవరి 22న న్యూఢిల్లీకి చేరనుంది. అయినా..  మహిళావాదం, మహిళ అవసరాలు, స్థితిగతులు.. అంటూ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేని రోజు ఎప్పటికి వస్తుంది? ఎప్పుడైనా, ఎక్కడైనా... అది ప్రాచ్యమైనా, పాశ్చాత్యమైనా సరే... పురుషవాదం జడలు విప్పినప్పుడే మహిళావాదం పురుడు పోసుకుంటుంది. అప్పటి వరకు ఉండేది వ్యక్తివాదమే. సమన్యాయం లేని సమాజంలో సమతూకం కోసం, వ్యక్తివాద సమాజం కోసం మహిళలు తరంగంలా కదిలి వస్తున్నారు. ‘మాతోపాటు ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తాం’ అని నినదిస్తున్నారు. వ్యక్తివాద సమాజం ఎప్పటికి వచ్చినా అది మహిళల పోరాటంతోనే వస్తుంది. ఆ పోరాటం ఎన్నేళ్లనేదే అంతుచిక్కని ప్రశ్న.
– వాకా మంజులారెడ్డి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top