పదార్థాలు అంటుకోకుండా ఉండే లక్షణమే మనల్ని నాన్‌స్టిక్ వంట సామాగ్రి వాడేలా చేస్తుంది.
పదార్థాలు అంటుకోకుండా ఉండే లక్షణమే మనల్ని నాన్‌స్టిక్ వంట సామాగ్రి వాడేలా చేస్తుంది. అయితే కొన్నిసార్లు ఎంత ఖరీదైనవి కొన్నా... కొద్ది రోజులకే తమ గుణాన్ని కోల్పోయి వంటకాల్ని మాడ్చేస్తుంటాయి. కనీసం ఐదేళ్లపాటు పనికి రావాల్సిన గిన్నెలు అంత త్వరగా పాడవడానికి కారణం... మనకు వాటిని వాడటం చేతకాకపోవడమే!
నాన్‌స్టిక్ అనేది నూనె వాడక్కర్లేకుండా వండుకోవడానికే తయారు చేశారు. కాబట్టి వీలైనంత వరకూ నూనె జోలికి పోవద్దు. అస్తమానం నూనె వేసి వండుతుంటే పాడైపోతాయి! వంట చేసేటప్పుడు స్టీలు గరిటెలు ఉపయోగించవద్దు. అవి గిన్నెలోని టెఫ్లాన్ కోటింగును పాడు చేస్తాయి. కాబట్టి చెక్క గరిటెలను మాత్రమే వాడాలి. నాన్‌స్టిక్ గిన్నెలను అన్ని గిన్నెలతో కలిపి వాష్ బేసిన్లో వేయవద్దు. వాటిని ఎప్పుడూ వేరుగా ఉంచి శుభ్రం చేసుకోవాలి.
మామూలు గిన్నెలకు వాడే లిక్విడ్, సబ్బు వాడకూడదు. గిన్నెనిండా నీరు పోసి, కాసింత వెనిగర్ కలిపి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. జిడ్డు తట్టులా తేలిపోతుంది. అప్పుడు నీటిని వంపేసి మెత్తని గుడ్డతో కానీ స్పాంజితో కానీ తుడిచేయాలి. నాన్‌స్టిక్ గిన్నెల్లో వండే టప్పుడు మంట ఫుల్లుగా పెట్టకూడదని మీకు తెలుసా? ఎప్పుడూ మీడియంలో కానీ, సిమ్‌లో కానీ మాత్రమే పెట్టాలి. మితిమీరిన వేడి నాన్ స్టిక్ గిన్నెల్ని పాడు చేస్తుందన్నది నిరూపణ అయిన వాస్తవం.