ఏటికి ఎదురీదినవాడు... | Motivesanal speaker Marie told that a man's life ... | Sakshi
Sakshi News home page

ఏటికి ఎదురీదినవాడు...

Sep 16 2013 12:02 AM | Updated on Sep 1 2017 10:45 PM

ఏటికి ఎదురీదినవాడు...

ఏటికి ఎదురీదినవాడు...

జీవితంలో ఎన్నో అనుభవించినవాళ్లు, ఎంతో ప్రపంచాన్ని చూసినవాళ్లు, వేదాంతులుగా మారి ప్రవచనాలు చెప్పవచ్చు.. వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలను వివరించవచ్చు.

జీవితంలో ఎన్నో అనుభవించినవాళ్లు, ఎంతో  ప్రపంచాన్ని చూసినవాళ్లు, వేదాంతులుగా మారి ప్రవచనాలు చెప్పవచ్చు.. వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలను వివరించవచ్చు. ప్రపంచం చేత అభిమానాన్ని చూరగొనే వారి జీవిత పాఠాలు స్ఫూర్తిమంతమైనవిగా గుర్తింపు పొందవచ్చు. శారీరకంగా, మానసికంగా ఎన్నో శక్తియుక్తులున్న వాళ్లు ఒక స్థాయి ఎదిగి చెప్పిన వేదాంతాన్నే వింటోంది ప్రపంచం.  కానీ.. ఒక ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సన్... జీవితం గురించి స్ఫూర్తిని పంచితే... మోటివేషనల్ స్పీకర్‌గా మారి మనిషి జీవితానికి అర్థం చెబితే...
 
 అతడి పేరు నిక్ వొజిచిక్.. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో స్థిరపడిన ఒక సెర్బియన్ కుటుంబంలో, పుట్టుకతోనే టెట్రా అమెలియా సిండ్రోమ్ అనే వ్యాధితో జన్మించాడు. కాళ్లుచేతులు సాధారణస్థాయిలో ఎదగలేదు. మొండెం మాత్రమే కనిపించే శరీరంతో మొండిగా బతకడం కూడా చాలా కష్టమే. అయితే ఇతడు తన మొండితనంతో కాకుండా స్ఫూర్తిమంతంతో ఎదిగాడు. స్ఫూర్తిమంతుడై నిలిచాడు. మోటివేషనల్ స్పీకర్‌గా పేరు తెచ్చుకున్నాడు. సమస్యల మధ్య పుట్టి సమస్యలతో సావాసం చేసి సమస్యలతో ఎదిగినవాడు ఏదీ సమస్య కాదని అంటున్నాడు. స్ఫూర్తి పంచుతూ సాగుతున్నాడు. ‘లైఫ్ వితౌట్ లింబ్స్’అనే ట్రస్ట్‌ను స్థాపించి ‘లైఫ్ వితౌట్ లిమిట్స్’అన్న నానుడిని సాకారం చేసి చూపుతున్నాడు.
 
 జీవితానికి ఒక అర్థం ఉంటుందని, ఆ పరమార్థాన్ని వెదుక్కోవడానికే మనిషి బతకాలని భౌతికపరమైన సమస్యలతో, మానసికపరమైన బాధలతో కుంగిపోకూడదని నిక్ చెబుతాడు. నిక్ ఆలోచనా విధానం తనను మోటివేషనల్ స్పీకర్‌గా నిలుపుతోంది. ఎంతోమందిలో ఆత్మన్యూనతను పోగొట్టి.. వారిని కార్యార్థులుగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో వ్యక్తిత్వ వికాసం గురించి స్ఫూర్తిమంతమైన ప్రసంగాలు చేశాడు. ఎన్నో సంస్థలు నిక్ చేత తమ ఉద్యోగులకు ప్రత్యేకమైన క్లాసులు చెప్పిస్తున్నాయి. తన జీవిత ంలో ఎదుర్కొన్న శారీరక, మానసిక ఇబ్బందుల మధ్య తను ఎదగడానికి  పాటించిన నియమాలనే చెబుతూ వ్యక్తిత్వవికాస నిపుణుడిగా ఎదిగాడు నిక్.
 
 బాల్యం నుంచి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ఏటికి ఎదురీదాడు నిక్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయిన ఇతడిని రూల్స్ ప్రకారం ప్రత్యేకమైన స్కూల్‌కు పంపాలి. అయితే మానసికంగా ఇతడి తెగువను చూసి చట్టంలో మార్పులు తెచ్చి, సాధారణ ప్రైమరీ స్కూల్‌కు పంపే ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఇది ఒకరకంగా నిక్‌కు ప్లస్ అయితే మరోరకంగా మైనస్ అయ్యింది. స్కూల్‌లో పిల్లలు గేలిచేసేవారు.
 
 ఈ సమయంలో కాళ్ల్లూచేతులు లేవని కుంగిపోయాడు. ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. నిత్యం దేవుడి ఫోటో ముందు తనకు కాళ్లు చేతులు ఇవ్వమని ప్రార్థించేవాడు.


 దేవుడు కరుణిస్తాడని ఆశించాడు. అయితే అది జరగకపోవడంతో దేవుడిని ప్రార్థించడమే ఆపేశాడట. ఇదే సమయంలో తనలాగే కొంతమంది వికలాంగులు చాలా చక్కగా జీవిస్తున్న విషయాన్ని తెలుసుకోవడంతో నిక్‌లో కొత్త స్ఫూర్తి వచ్చింది. చేతులు కాళ్లు లేకపోయినా బతకగలననే ధైర్యం వచ్చింది. తల్లిదండ్రుల ప్రేమ ఇతడిలో కొత్త లక్ష్యాన్ని నెలకొల్పింది. బతికి సాధించాలన్న నిర్ణయానికి వచ్చాడు. దైవం తనను ఒక కారణం చేత, ఈ రూపంలోకి పంపాడనే భావనను అలవరచుకున్నాడు.
 
 చేతులు లేని నిక్... కాలివేళ్ల మధ్య పెన్ను పెట్టుకుని నిమిషానికి 43 పదాల చొప్పున రాయగలడు. తన కాళ్లతో నీళ్ల గ్లాస్ తీసుకోవడం, బ్రష్ చేసుకోవడం, షేవింగ్ చేసుకోవడం, సాకర్ ఆడటం, స్కై డైవింగ్... అన్నీ చేయగలడు. అకౌంటెన్సీ, ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన 29 సంవత్సరాల నిక్... పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గెడైన్స్‌ను కెరీర్‌గా చేసుకుని ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరిన నిక్ వివాహం  చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక కొడుకు కూడా జన్మించాడు.
 
 నిక్ ఫిలాసఫీ..
 పడిపోవడం అనే రిస్క్ చేయకపోతే మనిషి నిటారుగా కూడా నిలబడలేడు. కాబట్టి రిస్క్ లేని విజయం ఉండదు.  
 
 నాకు రెండు ఛాయిస్‌లు ఉన్నాయి. నా శరీర లోపాలను తలచుకుని దేవుడిని నిందించడం లేదా నాకు  ఆయన ఇచ్చిన వాటితో కృతజ్ఞుడిగా ఉండటం. నేను రెండో దాన్ని ఎంచుకున్నాను.
 
 నీ జీవితాన్ని మార్చే శక్తి ఒక్కరికే ఉంది. అది నువ్వే.  
 
 నీకు ఏదీ అద్భుతమనిపించకపోతే.. నువ్వే ఒక అద్భుతంగా ఎదుగు.
 
 దేవుడి ప్రేమ నిజమైనది. దాన్ని నిరూపించుకోవడానికి ఆయన నిన్ను సృష్టించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement