ఎందుకూ అలా చూస్తున్నారు? | Morgan Spending Lockdown With His Son Luton May Rose‌ | Sakshi
Sakshi News home page

ఎందుకూ అలా చూస్తున్నారు?

May 25 2020 4:32 AM | Updated on May 25 2020 4:32 AM

Morgan Spending Lockdown With His Son Luton May Rose‌ - Sakshi

కోవిడ్‌ 19 లాక్‌డౌన్‌ ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన అనుభవాన్ని మిగులుస్తోంది. ఈ చిన్నారి తల్లికి మాత్రం కోవిడ్‌ తెలియదు, లాక్‌డౌన్‌ తెలియదు. ఇంకా... తనకు ఏం జరుగుతోందో కూడా తెలియదు. లక్షల మంది తనను చూస్తున్నారని, ప్రశంసలు– విమర్శలతో అనేక కామెంట్లకు తాను కేంద్రబిందువు అవుతున్నట్లు కూడా తెలియదు పాపం. దీనంతటికీ కారణం ఈ బుజ్జాయి తల్లి సరదానే. మోర్గాన్‌ 28 ఏళ్ల మహిళ. యూఎస్, ఓరేగాన్‌లో ఉంటుంది. లాక్‌డౌన్‌లో రోజుకు ఉన్న 24 గంటల సమయాన్ని ఎలా గడపాలో తెలియని వాళ్లలో కొంత మంది కొత్త వంటలు చేయడం, డాన్సులు చేయడం, పాటలు పాడి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం... ఇలా ఎవరికి ఇష్టమైన వ్యాపకంలో వాళ్లు మునిగిపోతున్నారు. మోర్గాన్‌ మాత్రం తన మూడు నెలల పాపాయి ల్యూటన్‌ మే రోజ్‌ని రోజుకో రకంగా అలంకరించుకుని మురిసిపోయేది. ఓ రోజు పాపాయికి పెద్ద కనుబొమలు గీసి వీడియో తీసి టిక్‌టాక్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. ఆమె సరదాలను చాలా మంది ఆస్వాదించారు. ప్రశంసలు రావడంతో మరో రెండు రకాలుగా మేకప్‌ చేసి వీడియోలు పెట్టిందామె. మొత్తానికి బుజ్జాయిని పది లక్షల మంది చూశారు. కొంతమంది ‘ఇంత కచ్చితంగా కనుబొమలను ఎలా దిద్దగలిగారు’ అని ఆశ్చర్యపోయారు. ‘మూడు నెలల పాపాయికి కళ్లు మూసి తెరిచేంతలో యాభై ఏళ్ల వయసు మీద పడినట్లైంది’ అని ఒకరు, ‘మీ అమ్మాయి మిమ్మల్ని క్షమించదు సుమా’ అని ఒకరు చమత్కరించారు. కొంతమంది నవ్వారు, కొంతమంది ‘చందమామలాంటి పాపాయిని వికృతంగా తయారు చేయడమేంటి? ఇదేం పిచ్చిపని’ అని పెదవి విరిచారు. పాపం రోజీ బుజ్జాయికి ఇవేమీ తెలియదు. తాను నిద్రపోయిన తర్వాత అమ్మ తనకు మేకప్‌ చేసిందని తెలియని పాపాయి, కళ్లు తెరిచిన తర్వాత బోసి నవ్వులతో వీడియోని పండిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement