సమానత్వం కోసం వేచి ఉండే పనే లేదు

Melinda Gates comments on Equality for women - Sakshi

‘‘నువ్వు ఎక్కడ పుట్టావనేది కాదు, ప్రపంచంలో ఎక్కడైనా పుట్టు, ఆడపిల్లగా పుట్టావంటే చాలు, జీవితాన్ని నెట్టుకురావడానికి చాలా దుర్భరమైన, దయనీయమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదు’’. ఈ మాట అన్నది మామూలు మహిళ కాదు. మిలిందా గేట్స్‌. బిల్‌ గేట్స్‌ సతీమణి. ‘బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌’ సహ వ్యవస్థాపకురాలు. ప్రపంచ దేశాల్లో పర్యటించి ఆడవాళ్లు, పిల్లల జీవన స్థితిగతులను పరిశీలించిన మహిళ. తాను చూసిన ఘటనలతో ‘ద మోమెంట్‌ ఆఫ్‌ లిఫ్ట్‌’ అనే ప్రసిద్ధ పుస్తకం రాసిన మహిళ. 

గేట్స్‌ ఫౌండేషన్‌ స్థాపించి ఇరవై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా గేట్స్‌ దంపతులు సోమవారం సంయుక్తంగా ఒక వార్షిక లేఖను విడుదల చేశారు. ప్రపంచ ఆరోగ్యం, విద్య, స్త్రీ పురుష సమానత్వాలకు మున్ముందు మరింత ప్రాముఖ్యం ఇవ్వబోతునట్లు‡ఆ లేఖలో పేర్కొన్నారు. అందులో స్త్రీ–పురుష సమానత్వం గురించి మిలిందా పంచుకున్న విషయాలు ఆలోచన రేకెత్తించేవిలా ఉన్నాయి. అదే సమయంలో స్త్రీ పురుష సమానత్వం సాధ్యమే అనే ఆశనూ చిగురింపజేస్తున్నాయి. గేట్స్‌ ఫౌండేషన్‌ ఇరవయ్యవ వార్షికోత్సవంతోపాటు, చరిత్రాత్మకమైన బీజింగ్‌ వరల్డ్‌ కాన్ఫరెన్స్‌కూ ఈ ఏడాది పాతికేళ్లు నిండబోతున్నాయి.

ఆనాటి బీజింగ్‌ సదస్సు మహిళల స్థితిగతుల మీద చర్చించడానికి ప్రత్యేక దృష్టి పెట్టిన విషయాన్ని మిలిందా తన లేఖలో గుర్తు చేశారు. 1995లో బీజింగ్‌లో జరిగిన ఉమెన్‌ వరల్డ్‌ కాన్ఫరెన్స్‌లో హిల్లరీ క్లింటన్‌ ప్రసంగిస్తూ ‘మానవ హక్కులే మహిళల హక్కులు.. మహిళల హక్కులే మానవ హక్కులు’ అన్నారు. ఆ మాట తనను ఎంత ఇన్‌స్పైర్‌ చేసిందీ చెప్పారు. ‘ఆ తర్వాత నేను ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో పర్యటించాను. అక్కడి మహిళలను చూసిన తర్వాత స్త్రీ– పురుష సమానత్వ సాధన కోసం స్త్రీలకు అవసరమైన శక్తినివ్వడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు నేను చెప్పదలచినది ఏమంటే.. మన శక్తిని కార్యరూపంలోకి తీసుకురావడానికి మహిళలమందరం ముందుకు రావాలి. అప్పుడు సమానత్వం కోసం వేచి చూడాల్సిన పనే ఉండదు’ అని లేఖలో రాశారు మిలిందా గేట్స్‌.

బిల్‌–మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ నిర్వహణతోపాటు మిలిందా గేట్స్‌ సొంతంగా ప్రపంచవ్యాప్తంగా భారీ విరాళాలతో సమాజహిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహిళాభివృద్ధి ద్వారా కుటుంబాల అభివృద్ధి జరుగుతుందని, తద్వారా సమాజాభివృద్ధి సిద్ధిస్తుందని చెబుతారామె.మిలిందా గేట్స్‌ యూఎస్‌లోని డ్యూక్స్‌ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్, ఎంబీఏ చేశారు. ఒక దశాబ్దం పాటు తన కెరీర్‌ మీద మాత్రమే దృష్టి పెట్టారామె. ఇప్పుడు తన పూర్తి సమయాన్ని కుటుంబం, సమాజ సేవ కోసం కేటాయించారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top