డైనమిక్‌ డాక్టరమ్మ

Meghalaya Woman Doctor Drove Ambulance To Help Pregnant Woman - Sakshi

స్త్రీ శక్తి

గర్భిణి ప్రసవ వేదనతో హాస్పిటల్‌కు వస్తే ‘‘డాక్టర్‌లు సమ్మె చేస్తున్నారు. ప్రైవేట్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్లండి’’ అని పేషెంట్‌ని నిర్దాక్షిణ్యంగా పంపించేసిన ఉదంతాలనే చదువుతుంటాం. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా స్పందించారు మేఘాలయలోని డాక్టర్‌ బాల్‌నామ్‌చి సంగ్మా. అంబులెన్స్‌ నడిపేందుకు డ్రైవర్‌ అందుబాటులో లేకపోవడంతో పెద్దాసుపత్రివరకు తనే బండి నడిపి గర్భిణి ప్రాణాలు కాపాడారు.

మేఘాలయలోని వెస్ట్‌ గారో హిల్స్‌లో గారోబదా ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో డాక్టర్‌ ఆమె. తమ హాస్పిటల్‌కి వచ్చిన పేషెంట్‌కి నొప్పులు మొదలయ్యాయి. ఆమెకు స్కానింగ్‌ టెస్ట్‌లో అంచనా వేసిన తేదీ కంటే ముందుగానే కాన్పు నొప్పులు మొదలయ్యాయి. ఆమెను తురా పట్టణంలోని మెటర్నిటీ అండ్‌ చైల్డ్‌ హాస్పిటల్‌కు చేర్చాల్సిన అవసరాన్ని గుర్తించారు డాక్టర్‌లు. పేషెంట్‌ బంధువులకు అదే మాట చెప్పారు. అయితే పేషెంట్‌ను పెద్దాసుపత్రికి చేర్చే నాధుడు లేడు. అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన 108 సర్వీస్‌ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు.

ఆ హాస్పిటల్‌కి ఒక అంబులెన్స్‌ కూడా ఉంది. కానీ ఆ డ్రైవర్‌ ఆ రోజు సెలవులో ఉన్నాడు. వాహనం ఉంది కానీ నడిపే వాళ్లు లేరు. ‘‘ప్రైవేట్‌ వాహనం తెచ్చుకుని పేషెంట్‌ని తీసుకెళ్లండి’’ అని చెప్పడానికి డాక్టర్‌ సంగ్మాకి నోరు రాలేదు. వాళ్లు అంత ఖర్చును భరించలేరని వాళ్లను చూస్తేనే తెలుస్తోంది. అలాంటప్పుడు అంబులెన్స్‌ అందుబాటులో ఉండి, తనకు డ్రైవింగ్‌ వచ్చి ఉండి, లైసెన్స్‌ కూడా చేతిలో ఉండి... వాళ్లనలా వదిలించుకోవడానికి మనసొప్పలేదామెకి. అందుకే స్టెత్‌ని కోటు జేబులో పెట్టి, కోటును పక్క సీటుకు తగిలించి, డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్నారామె. అంబులెన్స్‌ ప్రయాణం తురా పట్టణం వైపు మొదలైంది.

ఫోన్‌లో ఫొటోలు
డాక్టర్‌ సంగ్మా ప్రయాణిస్తున్న దారిలో రోడ్ల మీద ఉన్న జనం దృష్టి ఆ అంబులెన్స్‌ మీద పడనే పడింది. వెంటనే చాలా మంది చేతిలో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌లతో ఆ దృశ్యాన్ని క్యాప్చర్‌ చేశారు. అయితే వాళ్లకు విచిత్రంగా అనిపించిన సంగతి డాక్టర్‌ అంబులెన్స్‌ డ్రైవ్‌ చేస్తోందన్న విషయం కాదు. నిజానికి వాళ్లకెవరికీ ఆ సంగతి తెలియదు కూడా. స్థానికులను ఆశ్చర్యపరిచిన సంగతి.... అంబులెన్స్‌ని ఒక మహిళ నడుపుతోంది అని.
అంబులెన్స్‌ తురా చేరింది, గర్భిణికి సుఖ ప్రసవం అయింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా సమయానికి తీసుకురావడంతో కాంప్లికేషన్‌లు ఏమీ తలెత్తలేదని చెప్పారు డెలివరీ చేసిన డాక్టర్లు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది కూడా. సంగ్మా మాత్రం ‘‘ఆ సమయానికి అవసరమైన పని చేశానంతే’’ అంటున్నారు. ఈ నెల ఒకటో తేదీన జరిగిన ఈ సంఘటన ఈశాన్య రాష్ట్రం నుంచి దేశం నాలుగు మూలలకూ చేరడానికి నాలుగురోజులు పట్టింది.
– మను

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top