
నా కుక్క పోయిందీ..
‘‘కనులు తెరిచినా నీవె... కనులు మూసినా నీవె’’అంటూ ఆవేదన చెందుతున్నాడు రోగర్ హారోవిట్జ్.
చదివింత...
‘‘కనులు తెరిచినా నీవె... కనులు మూసినా నీవె’’అంటూ ఆవేదన చెందుతున్నాడు రోగర్ హారోవిట్జ్. వాషింగ్టన్ డీసీలో నివసించే తన ప్రియనేస్తం ఒల్లీ అనే కుక్కగారు ఓ దుర్ముహుర్తాన వీధుల్లో పరిగెడుతూ ఆదృశ్యమైపోయింది. మిస్సయిన పెట్ కోసం రోగర్ చేయని ప్రయత్నం లేదు. అందులో భాగంగా వాలంటీర్ల సాయంతో మిస్సింగ్ అంటూ తన ఒల్లీ ఫొటో ముద్రించి, రహదారికి ఇరువైపులా పోస్టర్స్ కూడా అతికించాడు. దీనికి స్పందనగా ఒల్లీ దొరకలేదుగాని ఓ పోలీసు అధికారి రోగర్ ఇంటికొచ్చాడు.
‘‘కుక్క పోయి నీవు... నిబంధనలు మరచినావు’’ అంటూ మందలించి 510 యూరోలు (సుమారు 34 వేల రూపాయలు) జరిమానా కట్టించాడు. ఒక్కరోజులో నిబంధనలకు వ్యతిరేకంగా అతికించిన పోస్టర్స్ తొలగించకపోతే రెట్టింపు కట్టాల్సి ఉంటుందని హెచ్చరించాడు. జరిమానా పడిందన్న బాధకన్నా... తన ఒల్లీని కనిపెట్టడమెలా అనే బాధే ఎక్కువంటున్న రోగర్.. పట్టు వదలని విక్రమార్కుడిలా‘‘ఫైండ్ ఒల్లీ’’ అంటూ నెటిజన్లను అర్థిస్తూ కొత్త ప్రచారం మొదలెట్టాడు.
...::: సత్యవర్షి