చంద్రబాబు నాయుడు (టీడీపీ) రాయని డైరీ

Madhav Singaraju Rayani Dairy On Chandrababu Naidu - Sakshi

సచివాలయంతో పాటు రామ్‌గోపాల్‌ వర్మనీ అమరావతికి తెచ్చేసుకోవలసింది. పొరపాటు చేశాను. ‘పొరపాట్లు చేయనివాళ్ల చేత కూడా పొరపాట్లు చేయించే రకం’ అని అతడి గురించి ఎవరో చెబితే, ‘నా దగ్గరా!’ అని నవ్వి ఊరుకున్నాను. ‘ఎన్టీఆర్‌నే గ్రిప్‌లో పెట్టుకున్నవాడిని నేను.. ఎన్టీఆర్‌ మీద సినిమా తీసేవాడిని గ్రిప్‌లో పెట్టలేనా’ అని కూడా నేను అన్నట్లు గుర్తు. వర్మ సరిగ్గా ఎన్నికల ముందు రక్తచరిత్ర–3 చూపిస్తాడని ఊహించలేదు.
లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని తెలంగాణలో జనం విరగబడి చూస్తున్నారని రిపోర్ట్స్‌ వస్తున్నాయి!
‘‘రాష్ట్ర విభజన జరగడం మంచిదైంది. జరక్కుండా ఉంటే ఇప్పుడు తెలంగాణవాళ్లు, ఆంధ్రావాళ్లు ఇద్దరూ కలిసి విరగబడి ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ని చూస్తుండేవాళ్లు’’ అని లోకేశ్‌  ఎవరితోనో అనడం వినిపిస్తోంది!
‘‘జనం ఎందుకంత విరగబడుతున్నారు.. ఎన్టీఆర్‌ జీవితంలో ఉన్నదంతా మనవాళ్లు ఆల్రెడీ ‘కథానాయకుడు’లో, ‘మహానాయకుడు’లో చూపించేశారు కదా’’ అని అంటే, ‘‘అదే నాయుడుగారూ.. మాకూ అర్థం కావడం లేదు’’ అన్నారు హైదరాబాద్‌ వెళ్లొచ్చిన ఒకరిద్దరు మంత్రులు.

‘‘సినిమా చూశారా, బిజినెస్‌ పనులు మాత్రమే చూసుకొచ్చారా?’’ అని అడిగాను. ‘‘చూశాం నాయుడు గారు, ముందు సినిమా చూసి, తర్వాతే బిజినెస్‌ పనులు చూసుకుని వచ్చాం’’ అన్నారు.
‘‘వెళ్లండి’’ అన్నాను.
‘‘సినిమాకా నాయుడుగారూ! మళ్లీ చూసి రమ్మంటారా?’’ అన్నారు.
‘‘నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వండి. వెళ్లండి’’ అన్నాను. వెళ్లిపోయారు.
ఒక్కణ్నే కుర్చీలో కూర్చొని ఉన్నాను. నేను ఊగుతుంటే కుర్చీ ఊగుతోందో, కుర్చీ ఊగుతుంటే నేను ఊగుతున్నానో తెలియడం లేదు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ట్రైలర్‌లో ఎన్టీఆర్‌ కూడా ఇలాగే ఊగుతుంటాడు.
సినిమా చూడాలి. చూడొచ్చు కానీ, సినిమా చూస్తే, సినిమాలో ఉన్న లక్ష్మీ పార్వతిని చూడాలి. నేను చేయదగిన పని కాదు. నేను చూడదగిన సినిమా కాదు.
పోలింగ్‌కి పది రోజులే ఉంది. మూడో తేదీన సినిమా చూసి, విడుదల చెయ్యొచ్చో లేదో చెబుతాం అన్నారు జడ్జీలు.

బోయపాటిని, రాజమౌళిని పిలిపించాను. నా ఫేవరెట్‌ డైరెక్టర్‌లు వాళ్లు. రామ్‌గోపాల్‌ వర్మలా పిచ్చి పిచ్చి సినిమాలు తియ్యరు.
‘‘ఇప్పటికిప్పుడు రెండు రోజుల్లో సినిమా తీసి, మూడో రోజు సినిమా రిలీజ్‌ చెయ్యగలమా మనం? కథ నేనే ఇస్తా. టైటిలూ నేనే చెప్తా. కావాలంటే డైరెక్షన్‌ కూడా ఇస్తా’’ అన్నాను. ఇద్దరూ ఎగ్జయిటింగ్‌గా చూశారు.
‘‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మొత్తం నా మీద నెగటివ్‌గా ఉంది. ఆంధ్రాలో కూడా ఆడించుకోవచ్చని రేపు గనుక కోర్టు తీర్పు వస్తే.. ఆ సినిమాను తిప్పికొట్టడానికి మన దగ్గరా ఒక సినిమా రెడీగా ఉండాలి. ‘బాబూస్‌ ఎన్టీఆర్‌’ అని మనమూ ఒక సినిమా చేద్దాం. భారీ సెట్‌లు, భారీ ఫైట్‌లు పెట్టి.. ’’ అన్నాను.
‘‘సూపర్‌ ఐడియా నాయుడుగారూ. కానీ రెండు రోజుల్లో ఇంత భారీగా సినిమా ప్లాన్‌ చేయలేం. రామ్‌గోపాల్‌ వర్మ ఒక్కడే అలా చేయగలడు. ఆ మధ్య ఏదో సినిమా ఒక్క రోజులో తీశాడు’’ అన్నారు.
‘‘అలాగైతే అమరావతిని కట్టడానికి రామ్‌గోపాల్‌ వర్మనే ప్లాన్‌ అడిగేవాళ్లం కదా’’ అన్నాను. బోయపాటి నవ్వాడు. రాజమౌళీ నవ్వాడు.
‘‘ఎందుకు నవ్వుతున్నారు?’’ అన్నాను.
‘‘కట్టడానికి రామ్‌గోపాల్‌ వర్మ ప్లానింగ్‌ ఇవ్వడు నాయుడుగారూ.. పడగొట్టడానికి ఇస్తాడు’’ అన్నారు!
మాధవ్‌ శింగరాజు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top