ఈ పదం సరిపోతుందో లేదో చూడు!

Look at whether this word is appropriate - Sakshi

చెట్టు నీడ

అవి నడిచే దైవంగా పేరు పొందిన కంచి పరమాచార్య స్వామివారు జీవించి ఉన్న రోజులు. అప్పట్లో ఒక కుటుంబం స్వామివారి దర్శనానికి వెళ్తూ తమతో పాటు అమెరికాలో నివసిస్తున్న తమ స్నేహితుని కుటుంబాన్ని కూడా తీసుకువచ్చారు. ఆ స్నేహితునిది ఇంగ్లిష్‌ ధోరణి. ఇంగ్లిష్‌ మాట్లాడుతూ అమెరికన్‌ తరహా జీవితంతో ప్రభావితం అయ్యాడు. సన్యాసుల మీద సదభిప్రాయం లేకున్నా వీరి బలవంతం పైనే స్వామివారి దర్శనానికి వచ్చాడు. అతను మహాస్వామి వారిని ఒక సాధారణ మతవాదిగా భావించాడు. భాషాపాండిత్యాలు ఏమీ లేకపోయినా ఆయన్ని జగద్గురువుగా అందరూ గౌరవించడం నచ్చలేదు. ఆ రోజు మఠంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల వీరు దూరంగా నిలుచుని ఉన్నారు. అయితే వీళ్ళని చూడగానే స్వామి నుంచి పిలుపు రావడం, వారంతా స్వామివారి దగ్గరికి వెళ్ళటం క్షణాల్లో జరిగిపోయింది. ఈ కుటుంబంతో పాటు అతని స్నేహితుడు కూడా స్వామి ముందుకు వచ్చి నిలబడ్డాడు.

యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్న స్వామి వచ్చిన ఆ ప్రవాసీయుడితో ‘నీవు భారతదేశంలోనే పుట్టి పెరిగావు. నీకు తమిళం వచ్చు. నీ భార్య కూడా ఇక్కడే పుట్టింది కాబట్టి ఆమె మాతృభాష కూడా తమిళమే అయి ఉంటుంది. కనుక మీరిద్దరూ తమిళంలోనే మాట్లాడుకుంటారు కదా?’ అని అడిగారు. దానికి అతను, ‘మేము ఎప్పుడూ ఆంగ్లంలోనే మాట్లాడుకుంటాం. మా పిల్లలు కూడా ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారు’ అని జవాబిచ్చాడు గర్వంగా.  స్వామి వారు ‘ఓహో అలాగా! మనం మాట్లాడే ముందు ఆలోచన మన మెదడులో మొదలై అది వాక్కు రూపంగా నోటి నుండి బయటకు వస్తుంది కదా! మరి ఈ ప్రక్రియ అంతా ఆంగ్లంలోనే జరుగుతుందా? తమిళంలోనా?’’ అని అడిగారు. ‘అది కూడా ఆంగ్లంలోనే’ అన్నాడు కొంచెం విసురుగా.ఇంతలో ఒక ముసలావిడ స్వామి వారి దర్శనానికి వచ్చింది. అప్పుడు స్వామి వారు అతనికి ఆమెను చూపిస్తూ, ‘ఈమెది ఒకప్పుడు సంపన్న కుటుంబం. ఆ సంపద అంతా పోయినా మఠంపై, నాపై భక్తి ఇసుమంతైనా తగ్గలేదు. ఎంత కష్టం వచ్చినా 

మొక్కవోని భక్తివిశ్వాసాలను తగ్గించలేని ఈ స్థితిని ఆంగ్లంలో ఏ పదంతో సూచిస్తారు?’’ అని అడిగారు.అతను అలా ఆలోచిస్తూండిపోయాడు. స్వామి వారు మందహాసం చేసి ‘కావలసినంత సమయం తీసుకొని బదులివ్వు’ అన్నారు. చాలాసేపు అలోచించిన తరువాత కూడా అతను ఏమీ చెప్పలేకపోవడంతో ‘నేను ఒక పదం చెప్తాను. అది సరియో కాదో సరిచూసుకో. అది ‘ఎక్విపోయిస్డ్‌ అని అన్నారు. అతను కన్నుల నీరు కారుస్తూ తన అహంకారాన్ని పారద్రోలినందుకు మహాస్వామికి సాష్టాంగం చేసి వారి పాదాలపై పడి క్షమాపణలు చెప్పి స్వామివారి ఆశీస్సులు అందుకున్నాడు. భాష, ఆహార్యాన్ని బట్టి జ్ఞానాన్ని అంచనా వేయరాదు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top